Gadari Kishore Kumar
-
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బ్లాక్ మెయిలర్: గాదరి కిషోర్
హైదరాబాద్: ఎల్లుండి (సోమవారం) జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్‌లో ఉండే నల్గొండ పట్టభద్రులు వెళ్లి ఓటు వేయాలని బీఆర్ఎస్ నేత గాదరి కిషోర్ కుమార్ కోరారు. ఆయన శనివారం తెలంగాణ భవన్లో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బ్లాక్ మెయిలర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక మొత్తం ఇలాగే ఉంది. వందలాది కేసులు ఉన్న వ్యక్తి మల్లన్న. బ్లాక్ మెయిల్ కేసులు ఉన్నాయి. రేవంత్‌రెడ్డి సీఎం అవ్వగానే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు నియామక పత్రాలు ఇచ్చి, మేమే ఇచ్చినం అని గొప్పలు చెప్పుకుంటున్నారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. చేసింది చెప్పుకోలేక మేము ఓడిన వాతావరణం కనిపించింది. ఏదైనా అడిగితే దేవుళ్ళ మీద ఒట్లు పెట్టడం తప్ప చేసిందేమీ లేదు. రైతు బంధు ఇవ్వలేదు, సన్నవడ్లకు రూ.500 బోనస్ ఇస్తాం అంటున్నారు. మేనిఫెస్టోలో అన్ని రకాల వడ్లకు రూ. 500 ఇస్తామన్నారు. రైతు రుణమాఫీ ఇద్దరు భార్యాభర్తలకు కలిపి రెండు లక్షలు చేస్తామని ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. మళ్ళీ కథ మొదటికి వచ్చింది. మోసపూరిత మాటలతో ప్రజల్ని మభ్య పెడుతున్నారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడారు కాంగ్రెస్ నాయకులు’’ అని గాదరి కిషోర్ మండిపడ్డారు. -
తుంగతుర్తి నియోజకవర్గం మోత్కూర్ లో ఎమ్మెల్యే గాదరి ఎన్నికల ప్రచారం
-
బీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిశోర్‌కుమార్ ఎన్నికల ప్రచారం
-
‘తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండగ’
మలేషియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరిగాయి. మలేషియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ బతుకమ్మ సంబరాలకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ హాజరయ్యారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేది బతకమ్మ పండగ. అలాంటి బతుకమ్మ పండుగను సభ్యులు ఘనంగా నిర్వహించారంటూ ఈ సందర్భంగా గాదరి కిషోర్ కుమార్ వారిని అభినందించారు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్ల విషయంలో టీఆర్ఎస్ మలేషియా చూపిన చొరవపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మారుతి కుర్మ, కార్యదర్శి సందీప్ కుమార్ లగిశెట్టి, కోర్ కమిటీ సభ్యులు మునిగల అరుణ్, బొడ్డు తిరుపతి,గద్దె జీవన్ కుమార్, రమేష్ గౌరు, సత్యనారాయణరావ్ నడిపెల్లి, నవీన్ గౌడ్ పంజాల, హరీష్ గుడిపాటి, రవిందర్ రెడ్డి, శ్యామ్, సంపత్ రెడ్డి, పూర్ణ చందర్ రావు, కిషోర్ పాల్గొన్నారు. -
దిక్కులేని వారయ్యాం.. ఆదుకోండి
అర్వపల్లి: సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల పరిధిలోని చాకలిగూడెంకు చెందిన దర్శనం శిల్ప తమను ఆదుకోవాలని మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్లో అభ్యర్థించింది. తన భర్త సతీశ్.. తొమ్మిది నెలల కిందట రోడ్డు ప్రమాదంలో మరణించాడని, దీంతో తాను, ముగ్గురు పిల్లలు దిక్కులేని వారమయ్యామని వాపోయింది. స్పందించిన కేటీఆర్.. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని తుంగతుర్తి ఎమ్మెల్యే కిశోర్‌కుమార్‌ను ఆదేశించారు. దీంతో ఆయన శుక్రవారం చాకలిగూడెం వెళ్లి శిల్ప కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థికసాయం అందజేశారు. శిల్పకు ఔట్సోర్సింగ్ ఉద్యోగం, డబుల్బెడ్రూం ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. పిల్లలను గురుకుల విద్యాలయాల్లో చదివిస్తానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా శిల్ప మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే కిశోర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: పీఆర్సీ వర్తించేది వీటికే.. -
మైండ్‌గేమ్‌తో బీజేపీ ఆటలు సాగవు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశం కేవలం సీఎం కేసీఆర్‌ను తిట్టడం కోసమే పెట్టినట్లు ఉందని హుజుర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ అంటే తెలంగాణ.. తెలంగాణ అంటే కేసీఆర్ అని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం కరోనాను కనిపెట్టడంలో విఫలమవగా ఆ సమయంలో కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత ధీటుగా ఎదుర్కొందో దేశమంతా చూసిందని గుర్తుచేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మిషన్ కాకతీయ, భగీరథ పథకాలను కేంద్రమంత్రులందరూ పొగిడారని చెప్పారు. గుజరాత్ తరువాత తెలంగాణ మాత్రమే జీఎస్టీ అత్యధికంగా కడుతున్న రాష్ట్రమని ఎమ్మెల్యే తెలిపారు. జనాల మైండ్‌తో గేమ్ ఆడుతూ ఎన్నికల్లో గెలుస్తున్నారని విమర్శించారు. బీజేపీకి రామ మందిరం కట్టడమే ఇష్టం లేదని.. సుప్రీంకోర్టు చెప్పేవరకు పోరాటం చేసిన నేత ఒక్కరూ బీజేపీలో లేరని పేర్కొన్నారు. నేషనల్ స్కిల్ దేవలమెంట్ పెట్టి దేశంలో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని, తెలంగాణలో 7లక్షల 60 వేల ఉద్యోగాలు ఐటీ ఆధారితతో యువతకు ఉపాధి కల్పించినట్లు వెల్లడించారు. మేక్ ఇన్ ఇండియా లోగోను రూ.10 కోట్లు పెట్టి బయట కొన్నా ఉపయోగం లేదని చెప్పారు. కొన్ని పిచ్చి కుక్కలను రాష్ట్రం మీదకు వదిలారు!.. అని తీవ్రస్థాయిలో బీజేపీ నేతలపై సైదిరెడ్డి విరుచుకుపడ్డారు. మాఫియాను పోషించేది బీజేపీనే మరో ఎమ్మెల్యే గాదరి కిశోర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. దేశీయ దొంగలు ఇష్టమొచ్చినట్లు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. సత్యహరిశ్చంద్రుడు బతికి ఉంటే వీరి మాటలు విని ఆత్మహత్య చేసుకునే వారని తెలిపారు. దేశంలో మాఫియాను పెంచి పోషించేది బీజేపీ అని, హత్యలు అత్యాచారాలు చేసిన 25 మంది మంత్రివర్గాల్లో ఉన్నారని ఎమ్మెల్యే కిశోర్ ఆరోపించారు. దేశవ్యాప్తంగా కేసులు ఉన్న నేతలు 176 మంది పాలకవర్గంలో కొనసాగుతున్నారని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కేసుల వల్ల గతంలో గుజరాత్ నుంచి వెలివేశారని గుర్తుచేశారు. దేశానికి మోదీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పకుండా అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నల్లధనం పేరుతో ఎంతమందిని అరెస్ట్ చేశారని, పేదలకు ఎంతధనం పంచారో చెప్పాలి? అని ప్రశ్నించారు. మాఫియా అనేది ఎవరో దేశ.. రాష్ట్ర ప్రజలకు తెలుసని తెలిపారు. దేశం బయట ఉన్న డబ్బులు దేశానికి రప్పించకుండా.. దేశంలో ఉన్న డబ్బులు బయటకు తరలిస్తున్న పార్టీ బీజేపీ అని విమర్శించారు. బండి సంజయ్ కాలం దగ్గర పడిందని హెచ్చరించారు. కేసీఆర్‌ను విమర్శిస్తే తెలంగాణ ప్రజలను అన్నట్లేనని ఎమ్మెల్యే కిశోర్ పేర్కొన్నారు. -
తుంగతుర్తి: నిత్యం..ప్రజల వెన్నంటి ఉన్నా..!
సాక్షి, తిరుమలగిరి (తుంగతుర్తి): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా ఆత్మ గౌరవంతో ఉద్యమించాను. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గుర్తించి చట్ట సభల్లో నిలబడటానికి అవకాశం కల్పించారు. తుంగతుర్తి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు, దీవెనలతో శాసన సభ్యుడిగా గెలుపొందాను. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లలో నియోజకవర్గంలో రూ.1600 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను. 60 ఏళ్లలో జరగని అభివృద్ధి నాలుగున్నరేళ్లలో పూర్తి చేశాననే సంతృప్తి కలిగింది. రెండోసారి ప్రజలకు సేవ చేయడానికి అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నా. నిత్యం ప్రజలమధ్య ఉండి సేవ చేసే తనకు మరోసారి భారీ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపిస్తారని తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ తుంగతుర్తి అభ్యర్థి గాదరి కిశోర్‌కుమార్ అంటున్నారు. ఎన్ని కల సందర్భంగా ‘సాక్షి’ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పేర్కొన్న పలు అంశాలు ఆయన మాటల్లోనే... వారిని ప్రజలు ఆదరించరు.. ఈసారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత తుంగతుర్తి ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా మారుస్తాం. నాగారంలో132/11కేవీ సబ్‌స్టేషన్,అర్వపల్లిలో ఐటీఐ కళాశాల, మోత్కూరులో సీహెచ్‌సీ , తిరుమలగిరిలో బస్ డిపో ఏర్పాటు చేస్తాం. ఎస్ఆర్ఎస్పీ కాల్వల ఆధునికీకరణ చేస్తాం. ఎన్నికల ముందు వచ్చిన మహా కూటమి అభ్యర్థి అద్దంకి దయాకర్, బీజేపీ అభ్యర్థి కడియం రామచంద్రయ్యలను ఈ ప్రాంత ప్రజలు ఆదరించరు. కాంగ్రెస్, టీడీపీ పొత్తులను ప్రజలు ఎవరూ నమ్మడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు నియోజకవర్గంలో జరిగిన అభివద్ధి పనులతో నా విజయం సునాయాసం. ఇక మేజార్టీయే తేలాల్సి ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే.. నియోజకవర్గంలోఎస్ఆర్ఎస్పీ కాల్వలు ఉన్నా గోదావరి జలాలు రాక దుర్భర పరిస్థితులు న్నాయి. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి గతంలో 41 రోజులు, రెండు నెలల క్రితం 32 రోజులు నీటిని తీసుకొచ్చి చెరువులు, కుంటలు నింపాం. ఆరు నెలల్లో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే రెండు పంటలకు నీళ్లు వస్తాయి. వెంపటి, రుద్రమదేవి చెరువులను రిజర్వాయర్‌గా మార్చడానికి ప్రతిపాదనలు చేశాం. ఈ రెండు రిజర్వాయర్లు పూర్తయితే సాగు నీటి సమస్య తీరుతుంది. పదమూడు రోజుల్లోనే ఆశీర్వదించారు .. 2014లో ఎన్నికలు 13 రోజులు ఉండగానాకు తుంగతుర్తి టిక్కెట్ కేటాయించారు. తెలం గాణ ఉద్యమంలో పాల్గొని వందలాది కేసులు ఉన్న తనను నియోజకవర్గ ప్రజలు తక్కువ సమయంలోనే ఆదరించి గెలిపించారు. నియోజకవర్గంలో గతంలో నెలకో, ఆరు నెలలకో ప్రభుత్వ కార్యక్రమాలకు మాత్రమే వస్తే శాసన సభ్యుడిని కలిసే అవకాశం ప్రజలకు ఉండేది. సమస్యలు శాసన సభ్యుడికి తెలపాలంటే మొదటగా స్థానిక నాయకులను కలిసి ఆ తరువాత ఎమ్మెల్యేను కలిసే అవకాశం ఉండేది. కొన్ని సమయాలల్లో శాసన సభ్యుడిని కలిసే అవకాశం లేక సమస్య అలాగే పెండింగ్‌లో ఉండి పోయేది. నేను గెలిచిన తర్వాత నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నియోజకవర్గంలోనే ఇంటిని తీసుకొని వారంలో ఐదు రోజులు ఇక్కడే ఉంటున్నాను. దీర్ఘకాలిక సమస్యలకు ప్రణాళికలు రూపొందించాను. మరిన్ని వార్తాలు... -
అరగుండు, అర మీసంతో ప్రచారం
సాక్షి, మోత్కూరు/అడ్డగూడూరు : ప్రచారంలో వినూత్నమిది. తమ అభిమాన అభ్యర్థులను గెలిపిం చుకునేందుకు కార్యకర్తలు ప్రచారంలో కొత్తపుం తలు తొక్కుతున్నారు. అలాంటి ఘటనలే తుంగతుర్తి నియోజకవర్గంలో చోటుచేసుకుంటున్నా యి. ఒకరు టీఆర్ఎస్ గెలవాలని, మరొకరు కాంగ్రెస్ గెలవాలని అరగుండు, అరమీసంతో ప్రచారంలో పాల్గొంటున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అద్దంకి దయాకర్ గెలవాలని కోరుతూ లక్ష్మీదేవి కాల్వ గ్రామానికి చెందిన బండి మధు అనే కార్యకర్త అరగుండు, అరమీసంతో ప్రచారం నిర్వహిస్తున్నాడు. ఆదివారం మోత్కూరు మండలంలో బుజిలాపురం, రాగిబావి, ముశిపట్ల ,అనాజిపురం, పనకబండ గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థి అద్దంకి దయాకర్ పర్యటించగా, ఆయన ప్రచారంలో అరగుండు అరమీసంతో మధు ఆకర్షణగా నిలిచాడు. టీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిశోర్గెలవాలని.. టీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిశోర్‌ను గెలిపించాలని యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం ధర్మారం గ్రామానికి చెందిన మందుల మల్లయ్య అరగుండు, అరమీసంతో ప్రచారం ని ర్వహించాడు. లక్ష్మిదేవికాల్వ, ధర్మారంలో టీఆ ర్ఎస్ గ్రామశాఖ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచా రం నిర్వహించారు. ప్రచారంలో అతను అరగుండు, అరమీసంతో ఓటర్లను ఆకర్షించాడు. -
రూ. 1600 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి
సాక్షి,అర్వపల్లి: గత 60 ఏళ్లలో జరగని అభివృద్ధి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ హయాంలో నాలుగేళ్లలో రూ. 1600 కోట్లతో జరిగిందని టీఆర్ఎస్ జిల్లా నాయకుడు దావుల వీరప్రసాద్ చెప్పారు. తుంగతుర్తి టీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిశోర్‌కుమార్ గెలుపు కోసం గురువారం సీతారాంపురంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కిశోర్‌కుమార్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బందెల అర్వపల్లి, రాసాల సైదులు, బందెల వెంకన్న, చిత్రాల వీరయ్య, బందెల శశికాంత్, కుర్రె రమేశ్, ఎ. భద్రయ్య, బైరబోయిన రామలింగయ్య, పెద్దయ్య, కె. శ్రీకాంత్, జి. రామ్మూర్తి, ఎస్. వెంకన్న, ఎ. వెంకన్న, కె. భిక్షం, ఎ. సంతు, ఎ. ప్రవీణ్, పి. శ్రీను, ఎ. లింగయ్య, వీరమల్లు, ఎ. సంతు, దావుల లింగయ్య, కె. నాగరాజు, పి. ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయం తుంగతుర్తి : త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పూసపల్లి శ్రీనివాస్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్తోనే సాధ్యమన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయన్నారు. తుంగతుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత గాదరి కిశోర్కుమాదే అని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు కారుగుర్తుకు ఓటేసి టీఆర్‌ఎస్‌పార్టీని గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో వెంకటనారాయణ, జలేందర్, రాములు, సంతోష్, భిక్షం, వెంకన్న, హరీశ్ తదితరులు పాల్గొన్నారు. -
అక్టోబర్‌కల్లా యాదాద్రి ఆలయం
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి ప్రధాన ఆలయ నిర్మాణాన్ని అక్టోబర్ నాటికి పూర్తి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు వెల్లడించారు. అసెంబ్లీలో గురువారం ఈ అంశంపై సభ్యులు గాదరి కిషోర్ కుమార్, గొంగిడి సునీత అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు. ప్రస్తుతం రిటైనింగ్ వాల్ నిర్మాణం, ఏడు గోపురాల నిర్మాణం, లడ్డూ ప్రసాదం కాంప్లెక్స్, వ్రత మండపం, మాడవీధి, బ్రహ్మోత్సవ ప్రాంతం, ముఖ మండపం, ప్రాకారాల పనులు పురోగతిలో ఉన్నాయని కేటీఆర్ వివరించారు. వైటీడీఏ పరిధిలోకి యాదగిర్పల్లి, సైదాపూర్, రాయ్‌గిరి, మళ్లాపూర్, దాతర్పల్లి, గుండ్లపల్లి, బశ్వపుర గ్రామాలను తెస్తున్నట్లు తెలిపారు. యాదాద్రిలో రోప్‌వే ఏర్పాటు చేయాలని కూడా యోచిస్తున్నట్లు వివరించారు. ‘అన్నపూర్ణ’గా రూ. 5 భోజన కేంద్రాలు రూ. 5 భోజన కేంద్రాలకు ‘అన్నపూర్ణ’గా పేరు ఖరారు చేసినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం 109 భోజన కేంద్రాలు నడుస్తున్నాయని, వాటిని 150కి విస్తరిస్తామన్నారు. కంటోన్మెంట్ పరిధిలో ఐదారు భోజన కేంద్రాలు పెడతామని హామీ ఇచ్చారు. -
నల్లగొండకు నేడు సీఎం కేసీఆర్ రాక
నల్లగొండ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బుధవారం జిల్లా కేంద్రానికి రానున్నారు. స్థానిక లక్ష్మిగార్డెన్స్లో ఏర్పాటుచేసిన తుంగతుర్తి శాసనసభ్యుడు గాదరి కిషోర్‌కుమార్ వివాహ విందుకు రాత్రి 8 గంటలకు హాజరుకానున్నారు. ఈ మేరకు వేదిక వద్ద ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా జిల్లాకు కేసీఆర్ వస్తున్నారు. భూ పంపిణీ కార్యక్రమాన్ని ఆగస్టు 15వ తేదీన నల్లగొండ జిల్లా నుంచే ప్రారంభించాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అనివార్య కారణాల వల్ల ఆ పర్యటన రద్దయింది. కాగా ఎమ్మెల్యే గాదరి కిషోర్ వివాహ విందుకు జిల్లాకు వచ్చేందుకు ముహూర్తం కుదిరింది. బుధవారం సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి రాత్రి 7 గంటలకు నల్లగొండకు వస్తారు. నేరుగా లక్ష్మి గార్డెన్స్‌కు వెళ్లి కిషోర్ దంపతులను ఆశీర్వదిస్తారు. 7.30 గంటలకు నల్లగొండ నుంచి బయలుదేరి రాత్రి 9.30 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేటలోని తన నివాసానికి చేరుకుంటారు. ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, డీఐజీ, ఎస్పీ, టీఆర్ఎస్ నాయకులు జిల్లాకేంద్రంలోని లక్ష్మిగార్డెన్స్లో జరిగే తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ వివాహ విందుకు సీఎం వస్తుండడంతో అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను మంగళవారం కలెక్టర్ చిరంజీవులు, డీఐజీ శశిధర్‌రెడ్డి, ఎస్పీ ప్రభాకర్‌రావులు పరిశీలించారు. సీఎం రానుండడంతో కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉండడంతో భద్రతాపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. బాంబుస్క్వాడ్ బృందం అడుగడుగునా తనిఖీలు నిర్వహించింది. అదే విధంగా ఏర్పాట్లను టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, నాయకుడు దుబ్బాక నర్సింహారెడ్డిలు పర్యవేక్షించారు.