టీఆర్‌ఎస్ తుంగతుర్తి అభ్యర్థి గాదరి కిశోర్‌కుమార్
సాక్షి, తిరుమలగిరి (తుంగతుర్తి): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా ఆత్మ గౌరవంతో ఉద్యమించాను. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ గుర్తించి చట్ట సభల్లో నిలబడటానికి అవకాశం కల్పించారు. తుంగతుర్తి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు, దీవెనలతో శాసన సభ్యుడిగా గెలుపొందాను. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లలో నియోజకవర్గంలో రూ.1600 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను. 60 ఏళ్లలో జరగని అభివృద్ధి నాలుగున్నరేళ్లలో పూర్తి చేశాననే సంతృప్తి కలిగింది. రెండోసారి ప్రజలకు సేవ చేయడానికి అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నా. నిత్యం ప్రజలమధ్య ఉండి సేవ చేసే తనకు మరోసారి భారీ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపిస్తారని తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ తుంగతుర్తి అభ్యర్థి గాదరి కిశోర్‌కుమార్ అంటున్నారు. ఎన్ని కల సందర్భంగా ‘సాక్షి’ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పేర్కొన్న పలు అంశాలు ఆయన మాటల్లోనే...
వారిని ప్రజలు ఆదరించరు..
ఈసారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత తుంగతుర్తి ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా మారుస్తాం. నాగారంలో132/11కేవీ సబ్‌స్టేషన్,అర్వపల్లిలో ఐటీఐ కళాశాల, మోత్కూరులో సీహెచ్‌సీ , తిరుమలగిరిలో బస్ డిపో ఏర్పాటు చేస్తాం. ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాల్వల ఆధునికీకరణ చేస్తాం. ఎన్నికల ముందు వచ్చిన మహా కూటమి అభ్యర్థి అద్దంకి దయాకర్, బీజేపీ అభ్యర్థి కడియం రామచంద్రయ్యలను ఈ ప్రాంత ప్రజలు ఆదరించరు. కాంగ్రెస్, టీడీపీ పొత్తులను ప్రజలు ఎవరూ నమ్మడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు నియోజకవర్గంలో జరిగిన అభివద్ధి పనులతో నా విజయం సునాయాసం. ఇక మేజార్టీయే తేలాల్సి ఉంది.
కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే..
నియోజకవర్గంలోఎస్‌ఆర్‌ఎస్‌పీ కాల్వలు ఉన్నా గోదావరి జలాలు రాక దుర్భర పరిస్థితులు న్నాయి. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి గతంలో 41 రోజులు, రెండు నెలల క్రితం 32 రోజులు నీటిని తీసుకొచ్చి చెరువులు, కుంటలు నింపాం. ఆరు నెలల్లో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే రెండు పంటలకు నీళ్లు వస్తాయి. వెంపటి, రుద్రమదేవి చెరువులను రిజర్వాయర్‌గా మార్చడానికి ప్రతిపాదనలు చేశాం. ఈ రెండు రిజర్వాయర్లు పూర్తయితే సాగు నీటి సమస్య తీరుతుంది.
పదమూడు రోజుల్లోనే ఆశీర్వదించారు ..
2014లో ఎన్నికలు 13 రోజులు ఉండగానాకు తుంగతుర్తి టిక్కెట్ కేటాయించారు. తెలం గాణ ఉద్యమంలో పాల్గొని వందలాది కేసులు ఉన్న తనను నియోజకవర్గ ప్రజలు తక్కువ సమయంలోనే ఆదరించి గెలిపించారు. నియోజకవర్గంలో గతంలో నెలకో, ఆరు నెలలకో ప్రభుత్వ కార్యక్రమాలకు మాత్రమే వస్తే శాసన సభ్యుడిని కలిసే అవకాశం ప్రజలకు ఉండేది. సమస్యలు శాసన సభ్యుడికి తెలపాలంటే మొదటగా స్థానిక నాయకులను కలిసి ఆ తరువాత ఎమ్మెల్యేను కలిసే అవకాశం ఉండేది. కొన్ని సమయాలల్లో శాసన సభ్యుడిని కలిసే అవకాశం లేక సమస్య అలాగే పెండింగ్‌లో ఉండి పోయేది. నేను గెలిచిన తర్వాత నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నియోజకవర్గంలోనే ఇంటిని తీసుకొని వారంలో ఐదు రోజులు ఇక్కడే ఉంటున్నాను. దీర్ఘకాలిక సమస్యలకు ప్రణాళికలు రూపొందించాను.
Comments
Please login to add a commentAdd a comment