నల్లగొండకు నేడు సీఎం కేసీఆర్ రాక
నల్లగొండ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బుధవారం జిల్లా కేంద్రానికి రానున్నారు. స్థానిక లక్ష్మిగార్డెన్స్‌లో ఏర్పాటుచేసిన తుంగతుర్తి శాసనసభ్యుడు గాదరి కిషోర్‌కుమార్ వివాహ విందుకు రాత్రి 8 గంటలకు హాజరుకానున్నారు. ఈ మేరకు వేదిక వద్ద ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా జిల్లాకు కేసీఆర్ వస్తున్నారు. భూ పంపిణీ కార్యక్రమాన్ని ఆగస్టు 15వ తేదీన నల్లగొండ జిల్లా నుంచే ప్రారంభించాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అనివార్య కారణాల వల్ల ఆ పర్యటన రద్దయింది. కాగా ఎమ్మెల్యే గాదరి కిషోర్ వివాహ విందుకు జిల్లాకు వచ్చేందుకు ముహూర్తం కుదిరింది. బుధవారం సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి రాత్రి 7 గంటలకు నల్లగొండకు వస్తారు. నేరుగా లక్ష్మి గార్డెన్స్‌కు వెళ్లి కిషోర్ దంపతులను ఆశీర్వదిస్తారు. 7.30 గంటలకు నల్లగొండ నుంచి బయలుదేరి రాత్రి 9.30 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేటలోని తన నివాసానికి చేరుకుంటారు.
ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, డీఐజీ, ఎస్పీ, టీఆర్‌ఎస్ నాయకులు
జిల్లాకేంద్రంలోని లక్ష్మిగార్డెన్స్‌లో జరిగే తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ వివాహ విందుకు సీఎం వస్తుండడంతో అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను మంగళవారం కలెక్టర్ చిరంజీవులు, డీఐజీ శశిధర్‌రెడ్డి, ఎస్పీ ప్రభాకర్‌రావులు పరిశీలించారు. సీఎం రానుండడంతో కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉండడంతో భద్రతాపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. బాంబుస్క్వాడ్ బృందం అడుగడుగునా తనిఖీలు నిర్వహించింది. అదే విధంగా ఏర్పాట్లను టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, నాయకుడు దుబ్బాక నర్సింహారెడ్డిలు పర్యవేక్షించారు.