బీహెచ్‌ఈఎల్ సీఎండీ అతుల్ సోబ్జీకి చెక్కును అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్. చిత్రంలో జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, మంత్రి జగదీశ్‌రెడ్డి, సీఎస్ ఎస్పీ సింగ్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: దామరచర్లలో నిర్మిస్తున్న యాదాద్రి అల్ట్రా మెగా విద్యుత్ కేంద్రం పనులను మూడేళ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు ని ర్మాణ పనులను చేపడుతున్న బీహెచ్‌ఈఎల్ కంపెనీ సీఎండీ అతుల్ సోబ్జీ శుక్రవారం ముఖ్యమంత్రిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా పనులను వేగంగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆయనను కోరారు. విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో పారదర్శకత, జాప్యాన్ని నివారించేందుకోసమే ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీహెచ్‌ఈఎల్‌కు ఈ పని అప్పగించామని, ప్రభుత్వ నమ్మకాన్ని నిలబెట్టేలా పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. యాదాద్రి ప్లాంటు నిర్మాణానికి అయ్యే రూ.20,379 కోట్ల వ్యయంలో మొదటి విడతగా రూ.417.16 కోట్ల చెక్కును బీహెచ్‌ఈఎల్ సీఎండీకి అందించారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ సింగ్, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు, పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అన్ని అనుమతులు వచ్చాయి
బీహెచ్‌ఈఎల్ సీఎండీకి చెక్కు అందజేసిన అనంతరం కేసీఆర్ మాట్లాడారు. వచ్చే ఏడాది నుంచి తెలంగాణలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరుగుతుందని.. దానిని దృష్టిలో పెట్టుకుని కొత్త ప్లాంట్ల నిర్మాణం వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. యాదాద్రి ప్లాంటుకు అవసరమైన భూసేకరణ పూర్తయిందని, పర్యావరణ అనుమతులు సహా అన్ని రకాల అనుమతులు వచ్చాయని తెలిపారు. ‘‘వచ్చే మార్చి నుంచి రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించాం. దానికితోడు ఎత్తిపోతల పథకాల నిర్మాణం జరుగుతోంది. కొత్తగా అనేక పరిశ్రమలు కూడా వస్తున్నాయి. ఇతరత్రా వినియోగం కూడా పెరుగుతోంది. అందువల్లే రాష్ట్రంలో పెద్ద ఎత్తున విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం చేపట్టాం. అన్నింటిలోకెల్లా యాదాద్రి ప్లాంటు ముఖ్యమైంది..’’అని పేర్కొన్నారు. రైతులకు 24 గంటల విద్యుత్ ఇవ్వడానికి వీలుగా అన్ని ఏర్పాట్లు చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ఎత్తిపోతల పథకాలు, పరిశ్రమలు, మిషన్ భగీరథ, మెట్రో రైలు తదితర కార్యక్రమాల నిర్వహణకు ఏర్పడే డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.
సీఎంను కలసిన టీఎస్‌ఈఆర్‌సీ చైర్‌పర్సన్
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఏర్పడి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా.. కమిషన్ చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్, సభ్యుడు హెచ్.శ్రీనివాస్ శుక్రవారం అసెంబ్లీలోని సీఎం చాంబర్‌లో కేసీఆర్‌ను కలిశారు.
వచ్చే ఏడాది మణుగూరు ప్లాంటు
కొత్తగూడెం, మణుగూరులో నిర్మిస్తున్న కొత్త విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంపై చర్చ జరిగింది. కొత్తగూడెంలో 800 మెగావాట్ల యూనిట్ నిర్మాణం 2–3 నెలల్లో పూర్తవుతుందని, వచ్చే ఏడాది మణుగూరు ప్లాంటూ పూర్తవుతుందని జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment