మెదక్‌లోని బీసీ వెల్ఫేర్ అధికారి కార్యాలయం
సాక్షి, మెదక్: జిల్లాలో బీసీ రుణాల పంపిణీ అటకెక్కింది. వేలాది మంది బీసీ యువకులు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులు సమర్పించి నెలలు గడుస్తున్నా లబ్ధిదారుల ఎంపిక పూర్తి కావడం లేదు. దీనికితోడు ప్రభుత్వం నిధులు సైతం మంజూరు చేయకపోవడం గమనార్హం. దీంతో బీసీ రుణాల పంపిణీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే అన్న చందంగా మారింది. యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు బీసీ కార్పొరేషన్ ద్వారా ఈ సబ్సిడీ రుణాలు అందజేస్తోంది.
ఈ సబ్సిడీని 50 నుంచి 80 శాతానికి పెంచింది. లక్ష నుంచి రూ.12 లక్షల వరకు రుణాలు అందజేస్తోంది. రూ.లక్షకు 80 శాతం సబ్సిడీ, రూ.2 లక్షలకు 70 శాతం సబ్సిడీ, రూ.2 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు 60 శాతం సబ్సిడీ ఉంటుంది. అలాగే బ్యాంకు కాన్సెంట్‌ను కూడా రద్దు చేసింది. దీంతో జిల్లాలోని యువకులు పెద్ద సంఖ్యలో రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 13 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి.
వీటిలో 9వేల దరఖాస్తులు నిబంధనల మేరకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దరఖాస్తులను స్వీకరించి మూడు నెలలు దాటుతున్నా ఇంకా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి కాలేదు. ఎంపిక కోసం గ్రామాల వారీగా గ్రామ సభలు నిర్వహిస్తున్నారు.
రుణాల లక్ష్యం నిర్ణయించలేదు..
జిల్లాలో బీసీ రుణాల కోసం 20 మండలాల నుంచి 9వేల మందికిపైగా ఎదురుచూస్తున్నారు. వీరితో పాటు కులవృత్తులు చేసుకునేవారు సైతం తమ సంఘాల ద్వారా రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కుల సంఘాల ద్వారా 9,044 మంది రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ లక్ష నుంచి రూ.12 లక్షల వరకు సబ్సిడీపై రుణాలు ఇవ్వాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు బీసీ కార్పొరేషన్ రుణాల మంజూరు ఊసెత్తడం లేదు.
రుణాల మంజూరీ కోసం ప్రభుత్వం బ్యాంకులకు మండలాలు, పట్టణాల వారీగా లక్ష్యం నిర్ధేశిస్తుంది. కానీ ఇప్పటివరకు బ్యాంకుల వారీగా రుణాల పంపిణీ లక్ష్యం నిర్ణయించలేదు. ఈ కారణంగానే రుణాల పంపిణీలో జాప్యం జరుగుతున్నట్లు సమాచారం. లక్ష నుంచి రెండు లక్షల వరకు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వచ్చే నెల నుంచి మంజూరు చేసే అవకాశాలు ఉన్నాయి. రూ.2 నుంచి 12 లక్షల వరకు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి రుణాల మంజూరీలో జాప్యం జరిగే అవకాశం కనిపిస్తోంది. కులవృత్తుల వారికి సైతం వచ్చేనెల నుంచి రుణాలు మంజూరు అయ్యే అవకాశాలున్నాయి.
ఎంపిక ప్రక్రియ జరుగుతోంది
జిల్లాలో బీసీ రుణాల అందజేసేందుకు లబ్ధిదారుల ఎంపిక పక్రియ జరుగుతోంది. గతంలో రుణాలు పొందిన వారు సైతం తిరిగి దరఖాస్తులు సమర్పించటంతో అధికారులు దరఖాస్తులను సమగ్రంగా పరిశీలిస్తున్నారు. ప్రభుత్వం త్వరలోనే నిధులు మంజూరు చేసే అవకాశం ఉంది. నిధులు మంజూరు అయిన వెంటనే బీసీ రుణాల పంపిణీ ప్రారంభం అవుతుంది. –సుధాకర్, బీసీ సంక్షేమశాఖ అధికారి
ఎప్పుడిస్తారో తెలియడం లేదు
బీసీ కార్పొరేషన్ రుణాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందు కోసం దరఖాస్తు చేసుకున్నాం. వార్డు సభలు కూడా నిర్వహించారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదు. అసలు ఇస్తారో?.. ఇవ్వరో? తెలియడం లేదు. అధికారులను అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదు. –నరేష్, మెదక్
వస్తాయో?.. రావో?
స్వయం ఉపాధి పొందుదామని బీసీ కార్పొరేషన్ సబ్సిడీ లోన్ కోసం దరఖాస్తు చేసుకొని నెల్లాళ్లు గడుస్తోంది. ఇప్పటికీ ఎలాంటి సమాచారం లేదు. వార్డు సభలన్నారు. ఎంక్వరీలన్నారు. అన్నీ అయిపోయాయి. కానీ ఇంకా లోన్‌ల గురించి ఎవరూ ఏం చెప్పడం లేదు. –కృష్ణ, మెదక్
Comments
Please login to add a commentAdd a comment