ఖమ్మం రూరల్, న్యూస్‌లైన్: 1962 పునర్విభజనలో ఖమ్మం నుంచి విడిపోయి పాలేరు ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పడింది. కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, ముదిగొండ మండలాలను కలిపి పాలేరు నియోజకవర్గంగా ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 12సార్లు ఈ నియోజకవర్గంలో ఎన్నికలు జరిగాయి.
1962లో తొలిసారి ఖమ్మానికి చెందిన కత్తుల శాంతయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసి ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి ఎద్దన్నపై గెలుపొందారు. వరుసగా మూడుసార్లు శాంతయ్యే విజయం సాధించారు.
1978లో జరిగిన సాధారణ ఎన్నికల్లో నేలకొండపల్లి మండలం బోదులబండకు చెందిన పొట్టపింజర హుస్సేనయ్య కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. స్థానికేతరుడైన కోటా గురుమూర్తి (జనత పార్టీ)పై హుస్సేనయ్య గెలుపొందారు. కొద్దికాలానికే హుస్సేనయ్య మృతి చెందడంతో 1981లో ఉప ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కొత్తగూడెంకు చెందిన సంభాని చంద్రశేఖర్ కాంగ్రెస్ నుంచి పోటీచేశారు. నేలకొండపల్లికి చెందిన బాజీ హనుమంతు (సీపీఎం)పై విజయం సాధించారు.
1983లో జరిగిన సాధారణ ఎన్నికల్లో తిరిగి సంభాని చంద్రశేఖర్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. టీడీపీ, సీపీఎం, సీపీఐ ఉమ్మడి అభ్యర్థిగా బరిలో ఉన్న భూపతిరావు చంద్రశేఖర్‌పై గెలుపొం దారు. 1985లో మధ్యంతర ఎన్నికలు వచ్చా యి. కాంగ్రెస్ నుంచి మళ్లీ సంభాని. సీపీఎం నుంచి బాజీ హనుమంతు పోటీచేశారు. ఈసారి బాజీ హనుమంతు విజయం సాధించారు.
1989 సాధారణ ఎన్నికల్లో సంభాని చంద్రశేఖర్, బాజీ హనుమంతే తలపడ్డారు. ఈసారి సంభాని పై‘చేయి’ సాధించారు.
1994లో కూసుమంచి మండలం రాజుపేటకు చెందిన ప్రస్తుత సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య (టీడీపీ) సీపీఎం నుంచి సంభాని పై పోటీచేసి గెలుపొందారు.
1999లో సాధారణ ఎన్నికల్లో టీడీపీ నుంచి సండ్ర వెంకటవీరయ్య, కాంగ్రెస్ నుంచి సంభాని చంద్రశేఖర్ మరోసారి తలపడగా సంభానినే విజయం వరించింది.
2004లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ సంభాని, సండ్రాలే ఆయా పార్టీల తరఫున పోటీచేశారు. ఈసారి కూడా సంభాని చంద్రశేఖరే గెలుపొందారు.
పునర్విభజనతో మారిన ముఖచిత్రం
2008-09లో జరిగిన పునర్విభజనతో పాలేరు నియోజకవర్గ ముఖచిత్రం మారింది. తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, కూసుమంచి, ముదిగొండ మండలాలతో ఉన్న నియోజకవర్గంలో ముదిగొండ స్థానంలో ఖమ్మంరూరల్ వచ్చి చేరింది. ముదిగొండ మధిర నియోజకవర్గ పరిధిలోకి వెళ్లింది. అంతకుముందు ఎస్సీ రిజర్వుడ్ స్థానమైన పాలేరు ఈసారి జనరల్ స్థానంగా మారింది.
2009లో జరిగిన ఎన్నికల్లో కామేపల్లి మండలం పాతలింగాలకు చెందిన రాంరెడ్డి వెంకటరెడ్డి (కాంగ్రెస్), ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లికి చెందిన తమ్మినేని వీరభద్రం (సీపీఎం/మహాకూటమి)పై విజయం సాధించారు.
నియోజకవర్గం నుంచి పలుమార్లు గెలుపొందిన సంభాని చంద్రశేఖర్ సుదీర్ఘకాలం మంత్రి పదవులను నిర్వర్తించగా, తొలిసారి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందిన రాంరెడ్డి వెంకటరెడ్డి కూడా మంత్రి పదవిని చేపట్టారు.
ఈ ఎన్నికల్లో ఆశావహులు...
జనరల్ స్థానమైన పాలేరు నియోజకవర్గంపై జిల్లాకు చెందిన హేమాహేమీ రాజకీయనాయకులు దృష్టి సారించారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పోటీ చేయాలని ఆశిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి, కూసుమంచి మండలం రాజుపేటకు చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ కందాళ ఉపేందర్‌రెడ్డి, ముదిగొండ మండలానికి చెందిన గ్రానైట్ వ్యాపారి రాయల నాగేశ్వరరావు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రాంరెడ్డి వెంకటరెడ్డికి టికెట్ ఖరారు అయినట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు, ఆ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు మద్దినేని స్వర్ణకుమారి పోటీపడుతున్నారు.
పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశిస్తే ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుకు కూడా పాలేరు అసెంబ్లీకి పోటీచేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. తుమ్మలకే పాలేరు టికెట్ ఖాయమైనట్లు తెలుస్తోంది. సీపీఎం నుంచి ఆపార్టీ జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్‌రావుకు టికెట్ కేటాయించారు. టీఆర్‌ఎస్ నుంచి ఆపార్టీ పాలే రు నియోజకవర్గ ఇన్‌చార్జి బత్తుల సోమయ్య టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. బీజేపీ తరఫున ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి పోటీచేయాలని ఆశిస్తున్నట్లు సమాచారం.
వైఎస్ సంక్షేమ పథకాల మూలంగా వైఎస్‌ఆర్‌సీపీ నియోజకవర్గంలో బలంగా ఉంది. ఆ పార్టీ మూడుజిల్లాల కోఆర్డినేటర్ సాధు రమేశ్‌రెడ్డి నియోజకవర్గంలోక్రియాశీలకంగా పనిచేస్తున్నారు. వైఎస్ ఆశయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
నియోజకవర్గంలో 1,94,039 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో లక్షా ఆరువేలమంది 18 నుంచి 40 ఏళ్ల మధ్యవయస్కులే. పాలేరుకు పోటీచేసే నాయకుల భవిత ఈ యువ ఓటర్ల చేతిలోనే ఉంది.
పాలేరు... యువజోరు
Published Thu, Apr 3 2014 2:36 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM
Advertisement
Advertisement