గుండె తరుక్కుపోతోంది: జగన్
మెదక్: ‘‘చెల్లాచెదురుగా పడిన పుస్తకాలు.. నేలపాలైన టిఫిన్లు.. రక్తమోడుతున్న చిన్నారుల మృతదేహాలను చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. ఏమిచ్చినా.. చిన్నారుల ప్రాణాలను వెనక్కి తీసుకురాలేం. బాధిత కుటుంబాలకు న్యాయం చేకూర్చలేం. ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఇరు రాష్ట్రాలతోపాటు కేంద్ర ప్రభుత్వంపై ఉంది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం మాసాయిపేట రైల్వే ప్రమాదంలో మృతిచెందిన చిన్నారుల కుటుంబాలను పరామర్శించేందుకు ఆయన మెదక్ ఏరియా ఆస్పత్రికి వచ్చారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. దేశంలో ఇలాంటి కాపలా లేని రైల్వే క్రాసింగ్‌లు అనేకం ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం ప్రమాదం జరిగిన మాసాయిపేట క్రాసింగ్ వద్ద గతంలో కూడా రెండు మూడు సంఘటనలు చోటుచేసుకుని ప్రాణనష్టం జరిగిందన్నారు. ఇటీవల ఇక్కడకు వచ్చిన రైల్వే జీఎంకు ఈ విషయంపై స్థానికులు ఫిర్యాదు చేసినప్పటికీ, చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు.
ఫలితంగా దేశానికి, కుటుంబానికి ఉపయోగపడే చిన్నారులు పసితనంలోనే ప్రాణాలు కోల్పోయారని, ఈ లోటును ఎవరు ఎలా తీర్చగలరని ప్రశ్నించారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ప్రభుత్వాలు గుర్తించుకునేలా భారీస్థాయిలో నష్టపరిహారం విధించే వ్యవస్థ ఉండాలని అభిప్రాయపడ్డారు. రైల్వే మంత్రి వెంటనే స్పందించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని జగన్ డిమాండ్ చేశారు. ఆయన వెంట వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నాయకులు గట్టు రామచంద్రరావు, విజయారెడ్డి, నల్లా సూర్యప్రకాశ్‌రావు, చల్లా కృష్ణారెడ్డి, శ్రీధర్ తదితరులు ఉన్నారు.