వైఎస్ మేలు మరువలేనిది..
రెడ్డిగూడెం (కొణిజర్ల) : అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి మేలును ప్రజలు మరువలేకపోతున్నారని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నాయకుడంటే ఎలా ఉండాలో.. సంక్షేమ పాలన ఎలా చేయాలో చేసి చూపించిన మహానేత వైఎస్ అని కొనియాడారు. మండల పరిధిలోని రెడ్డిగూడెంలో వైఎస్ విగ్రహాన్ని వైరా ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్, అశ్వరావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుతో కలిసి ఎంపీ ఆదివారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారిగా రెడ్డిగూడెంలో వైఎస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. తెలంగాణలో ఎక్కడా లేని విధంగా సింహాసనంపై వైఎస్‌ఆర్ కూర్చున్న రీతిలో విగ్రహాన్ని రూపుదిద్దడం ప్రశంసనీయమన్నారు. తెలంగాణలో వైఎస్సార్‌సీపీ ఉనికి ఉండబోదని చెప్పుకుని పబ్బంగడుపుకున్నపార్టీలకు ఇప్పుడు దిశానిర్దేశం లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు.
తమ నాయకుడెవరో చెప్పుకోలేని పరిస్థితి ఆ పార్టీల శ్రేణుల్లో నెలకొందన్నారు. తెలంగాణలో వైఎస్సార్‌సీపీ బలమైన శక్తిగా మారి ప్రజల పక్షాన పోరాడుతోంద న్నారు. ప్రజా సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వానికి సహకరిస్తూనే వ్యతిరేక విధానాలు అవలంబిస్తే నిలదీయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్ కీసర పద్మజారెడ్డి, కొండవనమాల ఎంపీటీసీ సభ్యురాలు దొబ్బల కృష్ణవేణి, నాయకులు రాయల పుల్లయ్య, పాముల వెంకటేశ్వర్లు, దొడ్డపిన్ని రామారావు, గుమ్మా రోశయ్య , తాళ్లూరి చిన్నపుల్లయ్య, తల్లపురెడ్డి హనుమారెడ్డి, నెల్లూరి పురుషోత్తం, అయిలూరి వెంకటరెడ్డి, గూడూరు శ్రీనివాసరెడ్డి, ఎరమల ఆదిరెడ్డి, వార్డు సభ్యురాలు భద్రమ్మ పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీలో చేరిక
సీపీఐకి చెందిన నాలుగు కుటుంబాలు ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరాయి. గ్రామానికి చెందిన డాకూరి బసవయ్య, చందా శ్రీనివాసరెడ్డి, శీలం కృష్ణారెడ్డి, జంగా సిద్దారెడ్డిల కుటుంబాలు పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి.