banoth madan lal
-
వైరా బీఆర్ఎస్లో అసమ్మతి సెగలు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: వైరా నియోజకవర్గ బీఆర్ఎస్లో వైరం ఆరని మంటలా సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ చేసిన ప్రయత్నాలు ఫలించక.. మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్‌లాల్‌కు అధిష్టానం అవకాశం ఇవ్వడంతో ఎమ్మెల్యేతో పాటు ఆయన వర్గం మండిపడింది. తమ సత్తా చూపిస్తామని శప థం చేసింది. ఆ తర్వాత అధిష్టానం బుజ్జగింపులతో శాంతించి.. కలిసి పనిచేస్తామని వెల్లడించింది. ఇంతలోనే శుక్రవారం ఎమ్మెల్యే చేసిన ఘాటు వ్యాఖ్య లు ఆ పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపాయి. ప్రధానంగా దళితబంధు లబ్ధిదారుల ఎంపిక వ్యవహారం రెండు వర్గాల మధ్య వైరాన్ని పెంచింది. టికెట్ ఆశించి భంగపడి.. బీఆర్ఎస్ అధిష్టానం టికెట్లు ప్రకటించకముందే వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌కు టికెట్ రాదనే ప్రచారం మొదలైంది. ఈక్రమంలో ఎమ్మెల్యే తనకే టికెట్ ఇవ్వాలంటూ ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధుల ద్వారా రాయబారాలు నడపడంతో పాటు తన తనయుడితో పాటు ప్రగతిభవన్‌కు వెళ్లి చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. ఆ తర్వాత పార్టీ మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్‌కు టికెట్ కేటాయించింది. దీంతో తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే... రానున్న ఎన్నికల్లో తానేంటో చూపిస్తానంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు. దీనిపై అధిష్టానం బుజ్జగించడంతో కొంత మెత్తపడిన ఆయన, పార్టీ ప్రకటించిన అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తానని తెలిపారు. దీంతో అంతా సర్దుకున్నట్లేనని అధిష్టానం సహా అందరూ భావించారు. దళితబంధు రగడ నియోజకవర్గాల్లో దళితబంధు లబ్ధిదారుల ఎంపిక ఎమ్మెల్యే ఆధ్వర్యానే జరుగుతోంది. వైరా నియోజకవర్గంలోని అన్ని మండలాలకు కలిపి 1,120 మంది తో పేర్లతో ఎమ్మెల్యే రాములునాయక్‌ను జాబితా ను అధికారులకు పంపినట్లు తెలిసింది. ఈ జాబితా ప్రకారమే యూనిట్లు మంజూరవుతాయని ఎమ్మెల్యే భావిస్తుండగా, కొందరిని ఎంపిక చేసే అవకాశం పార్టీ అభ్యర్థి మదన్‌లాల్‌కు అధిష్టానం ఇచ్చిందన్న సమాచారంతో ఎమ్మెల్యే భగ్గుమన్నారు. గతంలో ఇక్కడ దళితబంధు అర్హుల ఎంపికలో చేతివాటం ప్రదర్శించారనే ఆరోపణలతో మదన్‌లాల్‌కు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యే తన ప్రతిపాదనలను పక్కన పెడుతున్నారంటూ మదన్‌లాల్‌తో పాటు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌పై శుక్రవారం నాటి సమావేశంలో తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. చెడిన సయోధ్య ఎమ్మెల్యే రాములునాయక్ వ్యాఖ్యలతో రెండు వర్గాల మధ్య ఉన్న సయోధ్య చెడినట్లయింది. ఈ పరిస్థితితో ఎమ్మెల్యే వెంట ఉన్న నాయకులు, ప్రజాప్రతినిధుల్లో ఒక్కరొక్కరుగా మదన్‌లాల్ వైపు వెళ్తున్నట్లు సమాచారం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కోవాల్సి ఉండగా.. రెండు వర్గాల పోరు మొదలవడం అధిష్టానం దృష్టికి కూడా వెళ్లినట్లు తెలిసింది. ఎమ్మెల్యే, అభ్యర్థి నడుమ మధ్య పంచాయితీకి దారితీసిన పరిస్థితులపై ఆరా తీయడమే కాక... ఆచితూచి వ్యవహరించాలని మదన్‌లాల్‌కు పార్టీ పెద్దలు సూచించినట్లు సమాచారం. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే, పార్టీ ప్రకటించిన అభ్యర్థి మదన్‌లాల్ వ్యవహార శైలి ప్రతిపక్షాలకు అస్త్రంగా మారే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. దళితబంధు లబ్ధిదారుల జాబితా విషయాన్ని ఎమ్మెల్యే బహిరంగంగా ప్రస్తావించడంతో ఎమ్మెల్యేలు చెప్పిన అధికార పార్టీ నేతలకే లబ్ధి చేకూరుతోందనే విమర్శలు వస్తున్నాయి. అయితే, అభ్యర్థిని ప్రకటించిన కొన్నాళ్లకే వైరా నియోజకవర్గంలో మొదలైన ఈ విభేదాలను బీఆర్ఎస్ అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందో వేచి చూడాల్సిందే. -
వైఎస్సార్ సీపీని మోసం చేసి.. బయటికొచ్చిన మూర్ఖుడిని
వైరా: ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మోసం చేసి బయటకు వచ్చిన మూర్ఖుడిని, మోసగాడిని’ అని వైరా ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్ అన్నారు. గురువారం ఖమ్మం జిల్లా వైరాలో టీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆ పార్టీ కార్యకర్తలు దాడులు చేసుకున్నారు. దీంతో వారినుద్దేశించి ఎమ్మెల్యే మదన్‌లాల్ చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే..‘తెలంగాణ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మనుగడ సాధించదని అనుకొని, ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరాను. పార్టీ కార్యకర్తలు తనను వద్దంటే చెప్పండి వెళ్లిపోతాను.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన న్ని రోజులు నేను ఏనాడూ అభాసు పాలైన సంఘటనలు లేవు. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం చేర్పించే వారు దమ్ముంటే ముందుకు రావాలి. నలుగుర్ని పోగేసుకుని విమర్శలు చేయడం సరైనది కాదు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి తప్పుచేస్తే బహిరంగ క్షమాపణ అడుగుతాను. అవసరమైతే సీఎం కేసీఆర్ కాళ్లు పట్టుకుని వందల పుస్తకాలు తీసుకొస్తాను. నేను పార్టీలోకి రాకముందు ఒక్క వార్డు సభ్యుడు కూడా టీఆర్ఎస్లో లేడు. నేను టీఆర్ఎస్లో చేరిన తర్వాత వేలాది మంది పార్టీలో చేరుతున్నారు. గంటల తరబడి మాట్లాడితే రెండు ముక్కలు రాసే మీడియా కొద్దిపాటి ఘర్షణను జిల్లా అంతటా తెలిసేలా రాస్తుందని అన్నారు. -
వైరా ఎమ్మెల్యేపై వైఎస్సార్ సీపీ ఫిర్యాదు
-
వైరా ఎమ్మెల్యేపై వైఎస్సార్ సీపీ ఫిర్యాదు
హైదరాబాద్: టీఆర్ఎస్ లో చేరిన ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్ పై అనర్హత వేటు వేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎస్. మధుసూదనాచారిని కలిసి వైఎస్ఆర్ సీసీ నాయకులు విజ్ఞప్తి చేశారు. తమ పార్టీ గుర్తుపై గెలిచి టీఆర్ఎస్ లో చేరిన మదన్‌లాల్ పై ప్రజాప్రాతినిథ్య చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరారు. మదన్‌లాల్ టీఆర్ఎస్ లో చేరినట్టుగా స్పీకర్ కు ఆధారాలు సమర్పించారు. అన్ని విషయాలు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటానని స్పీకర్ తమకు హామీయిచ్చారని వైఎస్ఆర్ సీపీ నాయకులు తెలిపారు. స్పీకర్ ను కలిసిన వారిలో జనక్‌ప్రసాద్, శివకుమార్, కొండా రాఘవరెడ్డి, నల్లా సూర్యప్రకాశ్ ఉన్నారు. -
వైఎస్ మేలు మరువలేనిది..
రెడ్డిగూడెం (కొణిజర్ల) : అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి మేలును ప్రజలు మరువలేకపోతున్నారని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నాయకుడంటే ఎలా ఉండాలో.. సంక్షేమ పాలన ఎలా చేయాలో చేసి చూపించిన మహానేత వైఎస్ అని కొనియాడారు. మండల పరిధిలోని రెడ్డిగూడెంలో వైఎస్ విగ్రహాన్ని వైరా ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్, అశ్వరావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుతో కలిసి ఎంపీ ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారిగా రెడ్డిగూడెంలో వైఎస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. తెలంగాణలో ఎక్కడా లేని విధంగా సింహాసనంపై వైఎస్ఆర్ కూర్చున్న రీతిలో విగ్రహాన్ని రూపుదిద్దడం ప్రశంసనీయమన్నారు. తెలంగాణలో వైఎస్సార్సీపీ ఉనికి ఉండబోదని చెప్పుకుని పబ్బంగడుపుకున్నపార్టీలకు ఇప్పుడు దిశానిర్దేశం లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. తమ నాయకుడెవరో చెప్పుకోలేని పరిస్థితి ఆ పార్టీల శ్రేణుల్లో నెలకొందన్నారు. తెలంగాణలో వైఎస్సార్సీపీ బలమైన శక్తిగా మారి ప్రజల పక్షాన పోరాడుతోంద న్నారు. ప్రజా సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వానికి సహకరిస్తూనే వ్యతిరేక విధానాలు అవలంబిస్తే నిలదీయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్ కీసర పద్మజారెడ్డి, కొండవనమాల ఎంపీటీసీ సభ్యురాలు దొబ్బల కృష్ణవేణి, నాయకులు రాయల పుల్లయ్య, పాముల వెంకటేశ్వర్లు, దొడ్డపిన్ని రామారావు, గుమ్మా రోశయ్య , తాళ్లూరి చిన్నపుల్లయ్య, తల్లపురెడ్డి హనుమారెడ్డి, నెల్లూరి పురుషోత్తం, అయిలూరి వెంకటరెడ్డి, గూడూరు శ్రీనివాసరెడ్డి, ఎరమల ఆదిరెడ్డి, వార్డు సభ్యురాలు భద్రమ్మ పాల్గొన్నారు. వైఎస్సార్సీపీలో చేరిక సీపీఐకి చెందిన నాలుగు కుటుంబాలు ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరాయి. గ్రామానికి చెందిన డాకూరి బసవయ్య, చందా శ్రీనివాసరెడ్డి, శీలం కృష్ణారెడ్డి, జంగా సిద్దారెడ్డిల కుటుంబాలు పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి. -
జిల్లా ప్రజలకు రుణపడి ఉంటాం
వైరా, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యుడిగా తనను, ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిపించిన జిల్లా ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటామని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వైరా మండలం ముసలిమడుగులోని పురాతన అభయాంజనేయ స్వామి దేవాలయంలో శుక్రవారం నిర్వహించిన హనుమజ్జయంతి ఉత్సవాల లో వైరా ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్‌తో కలిసి ఆయన పూజలు నిర్వహించారు. ఆ తర్వాత దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారమే ఎజెండాగా తమ పార్టీ పని చే స్తుందని చెప్పారు. జిల్లా ప్రజలు విజ్ఞులని, అందుకే వైరా, ఆశ్వారావుపేట, పినపాక నియోజకవర్గాల్లో పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించి మహానేత రుణం తీర్చుకున్నారని అన్నారు. పేద , మధ్య తరగతి కుటుంబాలు, రైతులు, కార్మికులకు నిత్యం అందుబాటులో ఉండి వారి పక్షాన పార్టీ పనిచేస్తుందన్నారు. తమను గెలిపించిన ఓటర్లందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వైరా ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల అండదండలతోనే గెలుపొందామని, వారి రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేమని అన్నారు. నియోజకవర్గాన్ని మోడల్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానని, ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారధ్యంలో పార్టీకి సేవలందిస్తామన్నారు. కార్యకర్తలకు నిత్యం అండగా ఉంటానని, ఏ క్షణంలోనైనా వారి సమస్యలు పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. పొంగులేటికి తొలి వినతిపత్రం... ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వైరా ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్‌కు మండలంలోని చెరుకు రైతులు, ముసలిమడుగు గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. వైరా రిజర్వాయర్ నుంచి ప్రస్తుతం సాగులో ఉన్న చెరకు పంటకు సాగు నీరు విడుదల చేయాలని, గ్రామంలో పెండింగ్‌లో ఉన్న ఇళ్లు, రహదారుల నిర్మాణం చేపట్టాలని కోరారు. గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలన్నారు. దీనికి స్పందించిన పొంగులేటి సాగునీటి సమస్యపై వెంటనే నీటిపారుదల శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. సమస్యలన్నీ పరిష్కారమయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ బొర్రా ఉమాదేవి, వైరా, గరికపాడు సర్పంచ్‌లు బాణోత్ వాలీ, శీలం కరుణాకర్‌రెడ్డి, ఎంపీటీసీలు తన్నీరు జ్యోతి, తడికమళ్ల నాగేశ్వరరావు, నాయకులు బొర్రా రాజశేఖర్, గుమ్మా రోషయ్య, షేక్ లాల్‌మహ్మద్, తన్నీరు నాగేశ్వరరావు, చింతనిప్పు రాంబాబు, కొరివి నర్సింహరావు, సుబ్బిరెడ్డి, దేవరాజ్, కౌసర్, తేలప్రోలు నర్సింహరావు, బాణోత్ కృష్ణ పాల్గొన్నారు. -
వైరా నియోజకవర్గాన్ని..మోడల్‌గా తీర్చిదిద్దుతా
కొణిజర్ల, న్యూస్‌లైన్: నవ తెలంగాణ రాష్ట్రంలో వైరా నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని, మోడల్‌గా తీర్చిదిద్దుతానని వైరా ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్ అన్నారు. ఎమ్మెల్యేగా గెలుపొం దిన తరువాత మొదటిసారిగా శనివారం కొణిజర్ల వచ్చిన ఆయనకు పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. కొణిజర్ల సెంటర్లోని వైఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం, విలేకరులతో ఆయన మా ట్లాడుతూ... అధిక మెజార్టీతో తనను గెలిపించిన వైరా నియోజకవర్గ ప్రజలకు, వైఎస్ఆర్సీపీ-సీపీఎం శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. తనను వెనుక ఉండి నడిపించిన ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వైరా నియోజకవర్గ ప్రజలందరి తరఫున రుణపడి ఉంటానన్నారు. పొంగులేటి శ్రీనన్న నాయకత్వంలో, ఆయన సహాయ సహకారాలతో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. నియోజకవర్గ కేంద్రమైన వైరాలో అగ్నిమాపక కేంద్రం, సబ్‌ట్రెజరీ కార్యాలయం ఏర్పా టు చేయిస్తానని; వైరా రిజర్వాయర్ ద్వారా అన్ని మండలాల్లోకు తాగునీరందేలా కృషి చేస్తానని అన్నారు. అభివృద్ధికి ఆమడ దూరంలోగల గిరిజన తండాలు వైరా నియోజకవర్గం లో అనేకం ఉన్నాయన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోని, తం డాల్లోని సమస్యలు తనకు తెలుసునని అన్నారు. వీటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. వ్యవసాయ సమస్యలపై దృష్టి పెడతానని; ఏన్కూర్, జూలూరుపాడు, కారేపల్లి మండలాలకు సాగు నీరందించేందుకు కృషి చేస్తానని అన్నారు. జూలూరుపాడు మండలంలోని పోలారం చెరువును పునర్నిర్మిస్తే సుమారు 14వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. ప్రజలందరికీ రుణపడి ఉంటా... కారేపల్లి: తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలందరికీ రుణపడి ఉంటానని ఎమ్మెల్యే మదన్‌లాల్ అన్నారు. ఆయన శనివారం కారేపల్లిలోని ఎస్ఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... రాజకీయాలకు అతీతంగా అందరి సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కారేపల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ప్రయత్నిస్తానని అన్నారు. తొలుత, మదన్‌లాల్‌కు ఎస్ఆర్ఆర్ కళాశాల సెక్రటరీ కె.ఉపేందర్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో వైఎస్ఆర్ సీపీ మండల కన్వీనర్ రావూరి శ్రీనివాసరావు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు గుమ్మా రోషయ్య, ఇమ్మడి తిరుపతిరావు పాల్గొన్నారు. ఘన స్వాగతం గొల్లెనపాడు (వైరా): ఎమ్మెల్యేగా ఎన్నికైనం అనంతరం శనివారం గొల్లెనపాడుకు తొలిసారిగా వచ్చిన బాణోత్ మదన్‌లాల్‌కు వైఎస్ఆర్ సీపీ, సీపీఎం నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు భారీ ర్యాలీతో ఘనస్వాగతం పలికారు. గ్రామంలోని ఇంటింటికీ మదన్‌లాల్ వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆర్సీఎం చర్చిలో ప్రార్థన చేశారు. గ్రామంలోని డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడ గ్రామస్తులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ... తనను గెలిపించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు చెప్పారు. తొలి వినతిపత్రం స్వీకరణ ఎమ్మెల్యేగా తొలి వినతిపత్రాన్ని మదన్‌లాల్ స్వీకరించారు. స్థానిక ఇబ్బందులను, అంగన్వాడీ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గ్రామస్తులు వినతిపత్రం ఇచ్చా రు. వీటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హమీ ఇచ్చారు. సీపీఎం నాయకులతో సమావేశం వైరాలోని సీపీఎం కార్యాలయంలో ఆ పార్టీ నాయకులతో మదన్‌లాల్ సమావేశమయ్యారు. తన విజయానికి సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో వైఎస్ఆర్ సీపీ ఖమ్మం అసెంబ్లీ అభ్యర్థి కూరాకుల నాగభూషణం, మండల కన్వీనర్ షేక్ లాల్‌మహ్మద్, నాయకులు గుమ్మా రోషయ్య, తన్నీరు నాగేశ్వరరావు, తేలప్రోలు నర్సింహా రావు, తాతా నిర్మల, వెంపటి చంద్రశేఖర్, వెంకటయ్య, ఏసు, సీపీఎం నాయకులు ఆళ్ళ వెంకట్రావ్, చిత్తారి రాంబాబు, మేకల వెంకటేశ్వర్లు, ఈరుపార్శపు భాస్కర్‌రావు, ఖాసీం, ఖానాపురం మారుబొయిన ఏడుకొండలు, వేమిరెడ్డి వెంకటకోటరెడ్డి, విజయలక్ష్మి, వేల్పుల రామారావు, ప్రగడవరపు పాపయ్య, యాదయ్య, వెంకటనారాయణ, గొల్లపూడి సర్పంచ్ ముత్తారపు కళావతి తదితరులు పాల్గొన్నారు.