వైఎస్సార్ సీపీని మోసం చేసి.. బయటికొచ్చిన మూర్ఖుడిని
వైరా: ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మోసం చేసి బయటకు వచ్చిన మూర్ఖుడిని, మోసగాడిని’ అని వైరా ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్ అన్నారు. గురువారం ఖమ్మం జిల్లా వైరాలో టీఆర్‌ఎస్ నియోజకవర్గ స్థాయి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆ పార్టీ కార్యకర్తలు దాడులు చేసుకున్నారు.
దీంతో వారినుద్దేశించి ఎమ్మెల్యే మదన్‌లాల్ చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే..‘తెలంగాణ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మనుగడ సాధించదని అనుకొని, ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్ పార్టీలో చేరాను. పార్టీ కార్యకర్తలు తనను వద్దంటే చెప్పండి వెళ్లిపోతాను.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన న్ని రోజులు నేను ఏనాడూ అభాసు పాలైన సంఘటనలు లేవు. టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వం చేర్పించే వారు దమ్ముంటే ముందుకు రావాలి. నలుగుర్ని పోగేసుకుని విమర్శలు చేయడం సరైనది కాదు.
పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి తప్పుచేస్తే బహిరంగ క్షమాపణ అడుగుతాను. అవసరమైతే సీఎం కేసీఆర్ కాళ్లు పట్టుకుని వందల పుస్తకాలు తీసుకొస్తాను. నేను పార్టీలోకి రాకముందు ఒక్క వార్డు సభ్యుడు కూడా టీఆర్‌ఎస్‌లో లేడు. నేను టీఆర్‌ఎస్‌లో చేరిన తర్వాత వేలాది మంది పార్టీలో చేరుతున్నారు. గంటల తరబడి మాట్లాడితే రెండు ముక్కలు రాసే మీడియా కొద్దిపాటి ఘర్షణను జిల్లా అంతటా తెలిసేలా రాస్తుందని అన్నారు.