సిరిసిల్లలో టీఆర్‌ఎస్ సభ్యత్వాన్ని అందిస్తున్న మంత్రి కేటీఆర్
సాక్షి, సిరిసిల్ల: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పదేపదే విమర్శలు చేస్తున్న రాష్ట్ర కాంగ్రెస్, బీజేపీ నేతలపై మంత్రి కె. తారక రామారావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘ఇప్పుడు ఎగిరెగిరి పడుతున్న టీ కాం గ్రెస్, టీ బీజేపీ నాయకులకు ఆ పదవులు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్ పెట్టిన బిచ్చం. ఉమ్మడి రాష్ట్రంలో మీ బతుకులు జీ హుజూర్ తప్ప ఇంకేముందో ఆలోచించాలి. తెలంగాణ కోసం రాజీనామాలు కోరితే పారిపోయిన సన్నాసులు మీరు. చీకటిలో చిరుదివ్వెలాగా కేసీఆర్ ఒక్కరే ఎత్తిన జెండా దించకుండా స్వరాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు. అలాంటి నాయకుడిని నిందిస్తే ఊరుకొనేది లేదు’అని కేటీఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణ సాధనే లక్ష్యంగా...
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగిన టీఆర్‌ఎస్ సభ్యత్వాల నమోదు కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2001లో కేసీఆర్ అనే పదమే లేదని, చంద్రశేఖర్‌రావు ఒక్కడే మొండిధైర్యంతో మూడు పదవులకు రాజీనామా చేసి పార్టీ స్థాపించి ముందుకు సాగాడని కేటీఆర్ గుర్తుచేశారు. ‘ఆనాడు కేసీఆర్‌కు సినిమా హంగులు లేవు.. డబ్బులు లేవు.. కుల బలం లేదు.. అయినా తెలంగాణ ఆత్మగౌరవాన్ని సజీవంగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. తెలంగాణ సమాజం రాజకీయ నాయకులను నమ్మే పరిస్థితి లేదు. కేసీఆర్‌కు మజిల్ పవర్, మనీ పవర్, మీడియా పవర్ లేకుండానే ప్రతికూల పరిస్థితుల్లో మొండి ధైర్యంతో తెలంగాణ సాధనకు ముందుకు సాగారు. అన్నీ ఖిలాఫ్ ఉన్నా.. అందరూ వ్యతిరేకంగా ఉన్నా.. గులాబీ జెండాను నమ్ముకొని తెలంగాణ సాధనే లక్ష్యంగా సాగారు. దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి, మెప్పించి కేసీఆర్ తెలంగాణ సాధించారు. వాస్తవానికి అప్పుడు నేను కూడా లేను. అప్పుడు అమెరికాలో ఉన్నా’అని కేటీఆర్ పేర్కొన్నారు.
కేంద్రం మన పథకాలను బాగున్నాయంటే..
కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో అమలవుతున్న పథకాలు బాగున్నాయని పార్లమెంట్ వేదికగా కితాబిస్తే రాష్ట్రంలోని సన్నాసులకు అవి అర్థం కావని.. ఒకవేళ అర్థమైనా అర్థం కానట్లుగా నటిస్తున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీలకు ఇతర రాష్ట్రాల్లోని ప్రయోజనాలు ముఖ్యమని, కానీ టీఆర్‌ఎస్ మాత్రం తెలంగాణ ఇంటి పార్టీ అని పేర్కొన్నారు.
త్వరలోనే సోషల్ మీడియా కమిటీలు...
టీఆర్‌ఎస్ కన్నతల్లి లాంటిదని, పార్టీ సభ్యత్వాలను మొక్కుబడిగా చేయొద్దని.. ఇంటింటికీ వెళ్లి నమోదు చేయాలని కేటీఆర్ సూచించారు. ఈసారి క్రీయాశీల సభ్యత్వాలకు గుర్తింపు కార్డులు జారీ చేస్తామని చెప్పారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ రూ. 2 లక్షల ప్రమాద బీమా ఉంటుందన్నారు. త్వరలోనే సోషల్ మీడియా కమిటీలు ఏర్పాటు చేసి జిల్లాలవారీగా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తామని వివరించారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శులు బండి రమేశ్, గూడూరి ప్రవీణ్, కర్ర శ్రీహరి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
సీఎం అనే గౌరవం లేకుండా..
‘సీఎం అనే గౌరవం లేకుండా టీ కాంగ్రెస్, టీ బీజేపీ నేతలు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నరు. ఎవడు పడితే వాడే మాట్లాడుతున్నడు. కనీసం కేసీఆర్ వయసుకైనా గౌరవం ఇవ్వడం లేదు. ఒకటి, రెండు గెలవంగనే ఎగిరెగిరి పడుతున్నరు. మరి రాష్ట్రంలో 32 జెడ్పీ స్థానాలు, 130 మున్సిపల్ స్థానాలు, 9,500 గ్రామపంచాయతీలను గెలిచిన మనమెంత మాట్లాడాలి. ఓపికకూ ఓ హద్దు ఉంటుంది. ఎలా బుద్ధి చెప్పాలో మాకు తెలుసు. సీఎం లనే ఉరికించిన చరిత్ర టీఆర్‌ఎస్‌ది. తెలంగాణ అనే పదాన్నే నిషేధించిన సభ నుంచి వాళ్లనే తరిమేశాం. నోరు పారేసుకోవడం మొదలు పెడితే.. పీఎంను, కేంద్ర మంత్రులను విడిచిపెట్టం. మర్యాదగా మాట్లాడటమే మా అసమర్థతగా భావించవద్దు’అని విపక్షాలపై మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment