trs membership drive
-
పార్టీ కార్యకర్తలే దేవుళ్లు.. విపక్షాల గూడుపుఠాణీ సాగదు
సాక్షి, సిద్దిపేట: ‘టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఏర్పాటు కోసం పుట్టింది. ఇక్కడి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటుంది. ఎన్నో త్యాగాలు, లాఠీ దెబ్బలు, ఆత్మబలిదానాల పునాదులతో ఏర్పడిన పార్టీ మాది. ఇంత అంకితభావం ఉన్న పార్టీ దగ్గర విపక్షాల గూడుపుఠాణీ, కుమ్మక్కు రాజకీయాలు చెల్లవు..’అని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా శనివారం సిద్దిపేట జిల్లా పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్ని పార్టీలు నూటా అరవై ఏళ్లు.. మరికొన్ని నలభై ఏళ్ల చరిత్ర ఉందని గొప్పలు చెప్పుకొంటూ ప్రజలకు మాయమాటలు చెబుతున్నాయని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఏ పార్టీ కూడా నోరు విప్పలేదన్నారు. మంత్రి పదవులు, ఎంపీ, ఎమ్మెల్యేల పదవులను గడ్డిపోచలా భావించి రాజీనామా చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీకి ఉందన్నారు. 2001లో గులాబీ జెండా పట్టుకున్న తమ నాయకుడు కేసీఆర్‌ను చూసి తెలంగాణ తెస్తారా..? అని ఎద్దేవా చేసిన నాయకులు ఇప్పుడు తెలంగాణ ప్రజల ముందు మొసలికన్నీరు కారుస్తున్నారన్నారు. రాష్ట్ర సాధనకోసం రోడ్లపైకి వచ్చి.. ధర్నాలు, రాస్తారోకోలు చేసి, అరెస్టులు, లాఠీ దెబ్బలు తిన్నది టీఆర్ఎస్ నాయకులన్నారు. నాటి నుంచి నేటి వరకు పార్టీ కార్యకర్తలే దేవుళ్లుగా పనిచేస్తున్న పార్టీ టీఆర్ఎస్ అన్నారు. పార్టీకి పునాది రాళ్లు అయిన కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకుంటామన్నారు. రాష్ట్రంలో ప్రతీ ఇంటిని టీఆర్ఎస్ ప్రభుత్వ ఫలాలు తలుపు తట్టాయని వివరించారు. సంక్షేమ పథకాల అమలులో పార్టీ కార్యకర్తల భాగస్వామ్యాన్ని పెంచుతామని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతీ కార్యకర్తకు సభ్యత్వం ఇవ్వాలని సూచించారు. నియోజకవర్గానికి 50 వేల సభ్యత్వాలకు తగ్గకుండా చేయాలన్నారు. సభ్యత్వ నమోదును ఉద్యమంలా చేపట్టి జిల్లాను అగ్రభాగాన నిలపాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. చదవండి: (ఫిబ్రవరి 20 నుంచి పాదయాత్ర చేస్తా: కోమటిరెడ్డి) -
మీ పదవులు కేసీఆర్ భిక్షమే: కేటీఆర్
సాక్షి, సిరిసిల్ల: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పదేపదే విమర్శలు చేస్తున్న రాష్ట్ర కాంగ్రెస్, బీజేపీ నేతలపై మంత్రి కె. తారక రామారావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘ఇప్పుడు ఎగిరెగిరి పడుతున్న టీ కాం గ్రెస్, టీ బీజేపీ నాయకులకు ఆ పదవులు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్ పెట్టిన బిచ్చం. ఉమ్మడి రాష్ట్రంలో మీ బతుకులు జీ హుజూర్ తప్ప ఇంకేముందో ఆలోచించాలి. తెలంగాణ కోసం రాజీనామాలు కోరితే పారిపోయిన సన్నాసులు మీరు. చీకటిలో చిరుదివ్వెలాగా కేసీఆర్ ఒక్కరే ఎత్తిన జెండా దించకుండా స్వరాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు. అలాంటి నాయకుడిని నిందిస్తే ఊరుకొనేది లేదు’అని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ సాధనే లక్ష్యంగా... రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగిన టీఆర్ఎస్ సభ్యత్వాల నమోదు కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2001లో కేసీఆర్ అనే పదమే లేదని, చంద్రశేఖర్‌రావు ఒక్కడే మొండిధైర్యంతో మూడు పదవులకు రాజీనామా చేసి పార్టీ స్థాపించి ముందుకు సాగాడని కేటీఆర్ గుర్తుచేశారు. ‘ఆనాడు కేసీఆర్‌కు సినిమా హంగులు లేవు.. డబ్బులు లేవు.. కుల బలం లేదు.. అయినా తెలంగాణ ఆత్మగౌరవాన్ని సజీవంగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. తెలంగాణ సమాజం రాజకీయ నాయకులను నమ్మే పరిస్థితి లేదు. కేసీఆర్‌కు మజిల్ పవర్, మనీ పవర్, మీడియా పవర్ లేకుండానే ప్రతికూల పరిస్థితుల్లో మొండి ధైర్యంతో తెలంగాణ సాధనకు ముందుకు సాగారు. అన్నీ ఖిలాఫ్ ఉన్నా.. అందరూ వ్యతిరేకంగా ఉన్నా.. గులాబీ జెండాను నమ్ముకొని తెలంగాణ సాధనే లక్ష్యంగా సాగారు. దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి, మెప్పించి కేసీఆర్ తెలంగాణ సాధించారు. వాస్తవానికి అప్పుడు నేను కూడా లేను. అప్పుడు అమెరికాలో ఉన్నా’అని కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్రం మన పథకాలను బాగున్నాయంటే.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో అమలవుతున్న పథకాలు బాగున్నాయని పార్లమెంట్ వేదికగా కితాబిస్తే రాష్ట్రంలోని సన్నాసులకు అవి అర్థం కావని.. ఒకవేళ అర్థమైనా అర్థం కానట్లుగా నటిస్తున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీలకు ఇతర రాష్ట్రాల్లోని ప్రయోజనాలు ముఖ్యమని, కానీ టీఆర్ఎస్ మాత్రం తెలంగాణ ఇంటి పార్టీ అని పేర్కొన్నారు. త్వరలోనే సోషల్ మీడియా కమిటీలు... టీఆర్ఎస్ కన్నతల్లి లాంటిదని, పార్టీ సభ్యత్వాలను మొక్కుబడిగా చేయొద్దని.. ఇంటింటికీ వెళ్లి నమోదు చేయాలని కేటీఆర్ సూచించారు. ఈసారి క్రీయాశీల సభ్యత్వాలకు గుర్తింపు కార్డులు జారీ చేస్తామని చెప్పారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ రూ. 2 లక్షల ప్రమాద బీమా ఉంటుందన్నారు. త్వరలోనే సోషల్ మీడియా కమిటీలు ఏర్పాటు చేసి జిల్లాలవారీగా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తామని వివరించారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శులు బండి రమేశ్, గూడూరి ప్రవీణ్, కర్ర శ్రీహరి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. సీఎం అనే గౌరవం లేకుండా.. ‘సీఎం అనే గౌరవం లేకుండా టీ కాంగ్రెస్, టీ బీజేపీ నేతలు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నరు. ఎవడు పడితే వాడే మాట్లాడుతున్నడు. కనీసం కేసీఆర్ వయసుకైనా గౌరవం ఇవ్వడం లేదు. ఒకటి, రెండు గెలవంగనే ఎగిరెగిరి పడుతున్నరు. మరి రాష్ట్రంలో 32 జెడ్పీ స్థానాలు, 130 మున్సిపల్ స్థానాలు, 9,500 గ్రామపంచాయతీలను గెలిచిన మనమెంత మాట్లాడాలి. ఓపికకూ ఓ హద్దు ఉంటుంది. ఎలా బుద్ధి చెప్పాలో మాకు తెలుసు. సీఎం లనే ఉరికించిన చరిత్ర టీఆర్ఎస్ది. తెలంగాణ అనే పదాన్నే నిషేధించిన సభ నుంచి వాళ్లనే తరిమేశాం. నోరు పారేసుకోవడం మొదలు పెడితే.. పీఎంను, కేంద్ర మంత్రులను విడిచిపెట్టం. మర్యాదగా మాట్లాడటమే మా అసమర్థతగా భావించవద్దు’అని విపక్షాలపై మండిపడ్డారు. -
వైఎస్సార్ సీపీని మోసం చేసి.. బయటికొచ్చిన మూర్ఖుడిని
వైరా: ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మోసం చేసి బయటకు వచ్చిన మూర్ఖుడిని, మోసగాడిని’ అని వైరా ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్ అన్నారు. గురువారం ఖమ్మం జిల్లా వైరాలో టీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆ పార్టీ కార్యకర్తలు దాడులు చేసుకున్నారు. దీంతో వారినుద్దేశించి ఎమ్మెల్యే మదన్‌లాల్ చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే..‘తెలంగాణ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మనుగడ సాధించదని అనుకొని, ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరాను. పార్టీ కార్యకర్తలు తనను వద్దంటే చెప్పండి వెళ్లిపోతాను.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన న్ని రోజులు నేను ఏనాడూ అభాసు పాలైన సంఘటనలు లేవు. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం చేర్పించే వారు దమ్ముంటే ముందుకు రావాలి. నలుగుర్ని పోగేసుకుని విమర్శలు చేయడం సరైనది కాదు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి తప్పుచేస్తే బహిరంగ క్షమాపణ అడుగుతాను. అవసరమైతే సీఎం కేసీఆర్ కాళ్లు పట్టుకుని వందల పుస్తకాలు తీసుకొస్తాను. నేను పార్టీలోకి రాకముందు ఒక్క వార్డు సభ్యుడు కూడా టీఆర్ఎస్లో లేడు. నేను టీఆర్ఎస్లో చేరిన తర్వాత వేలాది మంది పార్టీలో చేరుతున్నారు. గంటల తరబడి మాట్లాడితే రెండు ముక్కలు రాసే మీడియా కొద్దిపాటి ఘర్షణను జిల్లా అంతటా తెలిసేలా రాస్తుందని అన్నారు.