* మహబూబ్‌నగర్ జిల్లా పరామర్శ యాత్రలో షర్మిల
* అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల కోసం తపించారు
* పేదవాడిని తన భుజాలపై మోశారు
* ప్రాంతాలు, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేశారు
* రెండోరోజు యాత్రలో మూడు కుటుంబాలకు ఓదార్పు
* నాగర్‌కర్నూలు, అచ్చంపేట, కొల్లాపూర్‌లో జన నీరాజనం
పరామర్శ యాత్ర నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: అధికారం ఉన్నా లేకున్నా నిత్యం ప్రజల పక్షాన నిలిచి వారి సంక్షేమం గురించి తపించిన నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అని షర్మిల కొనియాడారు. పేదవాడిని తన భుజాలపై మోసిన రాజశేఖరరెడ్డి తెలుగు ప్రజల హృదయాల్లో రాజన్నగా కొలువయ్యారన్నారు. ఒక వ్యక్తి మరణిస్తే వందలాది మంది గుండెలాగి ప్రాణాలు కోల్పోవడం దేశ చరిత్రలో ఎక్కడా లేదని, ప్రజల ప్రేమ, అభిమానం ఎంతగానో ఉంటే తప్ప ఇలా జరగదని పేర్కొన్నారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను ఓదార్చేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన పరామర్శ యాత్ర మహబూబ్‌నగర్ జిల్లాలో రెండోరోజుకు చేరుకుంది. మంగళవారం ఉదయం అమ్రాబాద్ మండల కేంద్రంలో భోగం రంగయ్య కుటుంబాన్ని పరామర్శించిన షర్మిల.. అక్కడ్నుంచి అచ్చంపేట, నాగర్ కర్నూలు మీదుగా కోడేరు మండలంలోని ఎత్తెం గ్రామానికి చేరుకున్నారు.
అక్కడ పుట్టపాగ నర్సింహ కుటుంబాన్ని, కొల్లాపూర్‌లో కటికె రాంచంద్రయ్య కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబీకులకు ధైర్యం చెప్పారు. ఒక్కో కుటుంబంతో గంటకు పైగా గడిపారు. పిల్లల చదువులు, ఇతర స్థితిగతులను తెలుసుకున్నారు. పేద కుటుంబాలకు వైఎస్ కుటుంబం ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. షర్మిల వచ్చిన విషయాన్ని తెలుసుకొని ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అమ్రాబాద్, అచ్చంపేట, కొల్లాపూర్‌లలో ప్రజలనుద్దేశించి షర్మిల ప్రసంగించారు.
ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించారు..
ప్రజలు తమ ప్రాణం కన్నా మిన్నగా నాన్నను ప్రేమించారని, అందుకే ఆయన మరణాన్ని తట్టుకోలేక గుండెలు పగిలి చనిపోయారని, వారికి, వారి కుటుంబాలకు శిరసు వంచి నమస్కరిస్తున్నానని షర్మిల ఉద్వేగంతో అన్నారు. రాజశేఖరరెడ్డి బతికుంటే రాష్ట్రం లో పేదరికం ఉండేది కాదని, గుడిసె అనేదే లేకుండా చేసేవారని చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, పింఛన్లు, 108 వంటి పథకాల ద్వారా లక్షలాది మంది పేదలను ఆదుకున్నారన్నారు.
రుణమాఫీ, విద్యుత్ బకాయిల రద్దు, ఇన్‌పుట్ సబ్సిడీ, మద్దతు ధరల పెంపు వంటి నిర్ణయాలతో రైతు పక్షపాతిగా నిలిచారని గుర్తుచేశారు. రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా చేయాలని కలలుగని, ఎన్నో ప్రాజెక్టులకు అంకురార్పణ చేశారని చెప్పారు. వైఎస్సార్‌సీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ... ఈ యాత్ర రాజకీయాల కోసం చేయడం లేదన్నారు. వైఎస్ మరణానంతరం నల్లకాలువ వద్ద జగన్ ఇచ్చిన మాట కోసమే యాత్ర చేస్తున్నట్లు చెప్పారు.
మహబూబ్‌నగర్ జిల్లా పార్టీ కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి మాట్లాడుతూ... తెలంగాణలో రైతులకు ప్రభుత్వం భరోసా కల్పించడం లేదని, అందుకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, పార్టీ నేతలు రెహమాన్, శివకుమార్, నల్లా సూర్యప్రకాశ్ రావు, సత్యం శ్రీరంగం, మామిడి శ్యాంసుం దర్ రెడ్డి, భీష్వ రవీందర్, జి.రాంభూపాల్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, కొండా రాఘవరెడ్డి, భగవంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రజల గుండెల్లో ‘రాజన్న’గా వైఎస్
Published Wed, Dec 10 2014 1:02 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement