
సచివాలయం తరలింపును అడ్డుకుంటాం
వైఎస్సార్‌సీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి శివకుమార్
సాక్షి, హైదరాబాద్: సచివాలయాన్ని తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ తెలిపారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల 16వ తేదీన తమ పార్టీ నేతృత్వంలో ఆందోళన చేపడుతున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నేతలు, తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కూడా పాల్గొంటారని ఆయన వెల్లడించారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు పార్టీ కృషి చేస్తుందని పేర్కొన్నారు.
హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన ఏపీ సీఎం చంద్రబాబు ఉమ్మడి రాజధానిని వదిలి అమరావతికి పారిపోయారని, దాంతో ఏపీకి కేటాయించిన భవనాలన్నీ ఖాళీగానే ఉన్నాయని అన్నారు. వాటిని వాడుకోకుండా వందల కోట్లు వెచ్చించి కొత్త నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించడం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్ నిర్ణయాలపై ప్రజల్లో వ్యతిరేకత కన్పిస్తోందన్నారు. తక్షణమే ప్రభుత్వం సెక్రటేరియట్ తరలింపు నిర్ణయాన్ని విరమించుకోవాలని శివకుమార్ డిమాండ్ చేశారు.