వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే పది మంది సిబ్బందితో ఏర్పాటు: జగన్
- 11 నుంచి అక్టోబర్ 2 దాకా ‘వైఎస్సార్ కుటుంబం’ కార్యక్రమం
- అక్టోబర్ 27 నుంచి ఆరు నెలల పాటు పాదయాత్ర
- 91210 91210 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే పార్టీ సభ్యత్వం
సాక్షి ప్రతినిధి, కడప: ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అధికార వికేంద్రీకరణతో జరిగే విప్లవాత్మక పాలనలో భాగంగా ప్రతి గ్రామంలో గ్రామ సెక్రటేరియట్ (సచివాలయం) ఏర్పాటు చేస్తాం. ఈ సెక్రటేరియట్‌లో ఆ గ్రామానికి చెందిన వివిధ సామాజిక వర్గాల వారికి పది మందికి ఉద్యోగాలు ఇస్తాం. మిస్డ్ కాల్ ద్వారా తమ సమస్యలు తెలియజేసుకున్న వారి సమస్యలు యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తాం. సమస్యల పరిష్కారం కోసం ప్రజలెవరూ ఎమ్మెల్యే చుట్టూ, మంత్రుల చుట్టూ తిరక్కుండా అక్కడికక్కడే పరిష్కరించే ఏర్పాటు చేస్తాం’ అని ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.
వైఎస్సార్ జిల్లా పులివెందులలోని వైఎస్సార్ ఆడిటోరియంలో శనివారం సాయంత్రం ఆయన ‘వైఎస్సార్ కుటుంబం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి కుటుంబాన్ని ‘వైఎస్సార్ కుటుంబం’లో సభ్యులుగా చేయడానికి పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమా నులు ఇంటింటికీ వెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంపై శనివారం నుంచి ప్రారంభమైన శిక్షణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బూత్ కన్వీనర్లకు ఈ నెల 11వ తేదీ దాకా కొనసాగుతుందని చెప్పారు. ఈ నెల 11వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ దాకా రాష్ట్రం లోని ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమం జరుగుతుం దని ప్రకటించారు. అక్టోబర్ 27న తాను ప్రారంభించే పాదయాత్ర ఆర్నెల్లపాటు జరుగుతుం దని, ఈ యాత్ర ద్వారా చంద్రబాబు ప్రజా వ్యతిరేక పాలనను అంతం చేయడానికి అందరూ ఆశీస్సులు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జగన్‌మోహన్‌రెడ్డి ఇంకా ఏమన్నారంటే...
అది స్వర్ణ యుగం
‘‘రాష్ట్రంలో ఎవరి దగ్గరికి పోయి వైఎస్ హయాంలో మీకు మేలు జరిగిందా? అని అడిగితే ప్రతి చెయ్యి అవునని పైకి లేస్తుంది. వైఎస్ హయాంలో ఎమ్మెల్యేలు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు గర్వంగా ఊళ్లలోకి పోయే వాళ్లు. ఫలానా పని మేం చేశామని తలెత్తుకుని చెప్పేవారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ íపింఛన్, రేషన్ కార్డు వచ్చేది. గ్రామాల్లో ఇళ్లు లేని వారే లేకుండా చేసేలా ప్రతి ఒక్కరికీ ఇల్లు ఇచ్చాం. ప్రతి విద్యార్థికి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చాం. అనారోగ్యం వల్ల పేదవారు అప్పుల పాలు కాకుండా ఉండేలా ఉచితంగా వైద్యం చేయించాం. అది వైఎస్ కాలపు స్వర్ణయుగమని గర్వంగా చెప్పవచ్చు. ఆ కాలాన్ని రాజన్న రాజ్యంగా ఇంకా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు గ్రామాల్లో పరిస్థితి ఏమిటి? ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతి పేదవాడికి మూడు సెంట్ల స్థలం ఇస్తామన్నాడు. ఇల్లు కట్టిస్తామన్నాడు. జాబు కావాలంటే బాబు రావాలన్నాడు.
జాబు ఇవ్వకపోతే ఇంటికి రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు. మూడున్నర సంవత్సరాల్లో ఇంటికి రూపాయైనా వచ్చిందా? ఇంటికి రూ.2 వేలు చొప్పున ఇప్పటికి 40 నెలలకు గాను ఒక్కో కుటుంబానికి రూ.80 వేలు నిరుద్యోగ భృతి బాకీ పడ్డాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే, రూ.87,612 కోట్ల రైతు రుణాలు బేషరతుగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. మూడున్నర సంవత్సరాలైంది బంగారం మీ ఇంటికి వచ్చిందా? ఇప్పటి వరకు ఇచ్చిన రుణమాఫీ సొమ్ము వడ్డీకి కూడా సరిపోవడం లేదు. డ్వాక్రా రుణాలన్నీ బేషరతుగా మాఫీ కావాంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. ఒక్క రూపాయి అయినా మాఫీ అయ్యిందా? ఏ వాగ్దానం కూడా నెరవేర్చని పరిస్థితి ఉంది. ఇలా చంద్రబాబు అన్ని వర్గాల వారిని మోసం చేశాడు. మనకు ఎలాంటి నాయకుడు కావాలి? మాట ఇస్తే మడమ తిప్పని, మాట మీద నిలబడే నాయకుడా? లేక బాబు లాగా జీవితంలో నిజం చెప్పని మాట మీద నిలబడని నాయకుడా?
11 నుంచి 2 దాకా ‘వైఎస్సార్ కుటుంబం’
వైఎస్సార్ కుటుంబం కార్యక్రమానికి ఏ పేపర్లు తీసుకుని పోవాలి? ప్రజలకు ఏం చెప్పాలి? అనే విషయాలను 11వ తేదీ వరకు జరిగే శిక్షణలో వివరించి చెబుతారు. ఈ నెల 11వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు 20 రోజులపాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. గ్రామంలో బూత్ కమిటీలో 10 మంది ఉంటే ఒక్కొక్కరు రోజుకు రెండు కుటుంబాలను కలవాలి. ప్రతి బూత్ కమిటీ సభ్యుడు ప్రతి ఇంట్లో కనీసం 20 నిమిషాలు కూర్చొని వారితో మాట్లాడి బాబు మూడున్నరేళ్ల పాలనకు సంబంధించి తయారు చేసిన 100 ప్రశ్నలకు వారితోనే మార్కులు వేయించాలి. వైఎస్సార్ హయాంలో జరిగిన మేలును గుర్తు చేయాలి.
నవరత్నాల గురించి వివరించాలి. చంద్రబాబునాయుడు మోసాలను, వైఎస్సార్ హయాంలో జరిగిన అభివృద్ధి.. సంక్షేమ పథకాలు, ఆయన స్వర్ణయుగం పాలన గురించి వివరించాలి. ఈ రకంగా చేసిన తర్వాత కుటుంబంలో కనీసం ఒక్కరి నుంచి 91210 91210 నంబరుకు మిస్డ్ కాల్ ఇప్పించాలి. ఇలా మిస్డ్ కాల్ ఇచ్చిన వెంటనే నా ఆఫీసుకు ఫోన్ వస్తుంది. రెండు మూడు రోజుల్లో మిస్డ్ కాల్ ఇచ్చిన ఫోన్ నంబరుకు నేరుగా ఫోన్ చేసి మాట్లాడి వివరాలు తీసుకుంటారు. ఫోన్ చేసిన వ్యక్తికి పింఛన్, రేషన్ కార్డు, ఇల్లు, ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ ఇలా ఏ సమస్య ఉన్నా రాసుకుంటారు. ఇలా చేస్తే రాష్ట్రంలోని కుటుంబాలు వైఎస్సార్ కుటుంబంలో సభ్యులవుతాయి. ఈ కార్యక్రమంతో చంద్రబాబు దిమ్మ తిరగాలి.
మీ అందరి ఆశీస్సులు కావాలి
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ అమలు చేయని చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పట్టిన శని. ఆయన రాజకీయాల్లో ఉన్నంత కాలం రాజకీయాలకు విశ్వసనీయత ఉండదు. ప్రజలు చంద్రబాబును కాలర్ పట్టుకుని నిలదీసే రోజులు రావాలి. అప్పుడే ప్రజలకు మేలు జరుగుతుంది. ఇది జరగాలంటే ప్రతి కార్యకర్త ప్రతి ఇంటికి పోయి చంద్రబాబు చేసిన మోసాలను వివరించాలి. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన మంచి పనుల గురించి మరోసారి గుర్తు చేయాలి. మనం అధికారంలోకి రాగానే అమలు చేయబోయే నవరత్నాల పథకాల వల్ల జరిగే మేలు గురించి వివరించాలి.
ఈ పథకాల విశ్వసనీయత గురించి అర్థమయ్యేలా చెప్పాలి. అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ సెక్రటేరియట్ (సచివాలయం) ఏర్పాటు చేసి ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కరించేలా విప్లవాత్మక మార్పులు తీసుకువస్తాం. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం నెలల తరబడి ప్రజాప్రతినిధుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. చంద్రబాబు తన పాలనలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు. ఇలాంటి చంద్రబాబు పాలనను బంగాళాఖాతంలో కలిపేసేందుకు అక్టోబర్ 27వ తేదీ నుంచి నేను పాదయాత్ర ప్రారంభిస్తున్నాను. ఈ పాదయాత్ర ఆరు నెలలు జరుగుతుంది. ఈ పాదయాత్రతో చంద్రబాబు ప్రభుత్వాన్ని సాగనంపుదాం. ఇది ఒక్క జగన్ వల్లే అయ్యేది కాదు. జగన్‌కు మీ అందరి ఆశీస్సులు కావాలి. ప్రతి కార్యకర్త ఈ బాధ్యతను తమ భుజస్కంధాల మీద వేసుకుని నాకు అండగా నిలిచి చంద్రబాబు పాలనకు చరమగీతం పాడటంలో భాగస్వామ్యం కావాలి. వైఎస్సార్ స్వర్ణయుగం మళ్లీ తేవాలి.
బాబు పాలనను చూసి ఓట్లేయలేదు
చంద్రబాబు ఉపఎన్నికలో గెలిచామని సంబరపడిపోతున్నాడు. కానీ ఉప ఎన్నికలో ప్రజలు బాబు మూడున్నరేళ్ల పాలనను చూసి ఓట్లేయలేదు. ఆయన రూ.200 కోట్లు ఖర్చు పెట్టారు. ఒకసారి, రెండుసార్లు, మూడుసార్లు కూడా ఓటుకు రూ.2 వేలు చొప్పున పంచాడు. ఓటేయకపోతే పింఛన్, రేషన్‌కార్డు కత్తిరిస్తామని, ఇల్లు రాకుండా చేస్తామని బెదిరించారు. పోలీసులను, అధికారులను అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగం చేశాడు. ఆయనకు ఓటు వేయకపోయినా ఇంకా ఏడాదిన్నర అధికారంలో ఉంటాడు. తమకు ఇబ్బందులు వస్తాయనే భయంతో ఆయన ఇచ్చిన డబ్బులు తీసుకుని ఆయనకు ఓటేశారు.
అంతే కానీ మూడున్నరేళ్ల పాలన బాగుందనో, ఎన్నికల సమయంలో ఆయన ఇచ్చిన హామీలు నిలుపుకున్నారనో కాదు’’ అని జగన్ పేర్కొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, అంజద్‌బాషా, కొరముట్ల శ్రీనివాసులు, ఎస్.రఘురామిరెడ్డి, పి.రవీంద్రనాథరెడ్డి, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీ డి.సి. గోవిందరెడ్డి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి పాల్గొన్నారు.