Tennis
-
Olympics–2024: ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్ ఈవెంట్లో తొలి అడుగు..!
'ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్ ఈవెంట్లో టేబుల్ టెన్నిస్ క్రీడాంశంలో భారత్ నుంచి టీమ్ ప్రాతినిధ్యం ఎన్నడూ లేదు. వ్యక్తిగత విభాగాల్లో మన ప్లేయర్లు బరిలోకి దిగినా ఏనాడూ పతకానికి చేరువగా రాలేదు. అయితే ఈతరంలో కొత్తగా దూసుకొచ్చిన టీటీ బృందం ఆశలు రేపుతోంది. ఇటీవల వరుస విజయాలతో భారత జట్టు పారిస్ ఒలింపిక్స్–2024కు అర్హత సాధించింది. సమష్టి ప్రదర్శనలతో మన ప్యాడ్లర్లు ఆకట్టుకున్నారు. అటు పురుషుల, ఇటు మహిళల విభాగాల్లోనూ తొలిసారి భారత జట్టు.. టీమ్ ఈవెంట్స్ బరిలోకి దిగనుండటం విశేషం. దేశం తరఫున ఒలింపిక్స్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న ఆ పది మంది ప్లేయర్ల వివరాలను చూస్తే..' ఆచంట శరత్ కమల్: భారత టేబుల్ టెన్నిస్‌లో నిస్సందేహంగా ఆల్‌టైమ్ గ్రేట్. చెన్నైకి చెందిన 41 ఏళ్ల శరత్ కమల్‌కి ఏకంగా 10సార్లు జాతీయ చాంపియన్‌గా నిలిచిన ఘనత ఉంది. సుదీర్ఘ కాలంగా భారత టీటీకి దిక్సూచిలా, మార్గదర్శిలా ముందుండి నడిపిస్తున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో పలు కీలక విజయాలతో ప్రతిసారీ మన దేశ ఆశలు మోస్తున్న సీనియర్ ప్లేయర్. 2006 నుంచి 2022 మధ్య ఆరుసార్లు కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొన్న శరత్ కమల్ 7 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలు గెలుచుకున్నాడు. రెండు ఆసియా క్రీడల కాంస్యాలు కూడా అతని ఖాతాలో ఉన్నాయి. 2004 ఒలింపిక్స్‌లో పాల్గొన్న అతను ఇప్పుడు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ ఒలింపిక్స్ బరిలోకి దిగుతుండటం విశేషం. క్రీడా పురస్కారాలు అర్జున, ఖేల్‌రత్నలతో పాటు పౌర పురస్కారం పద్మశ్రీ కూడా అందుకున్నాడు. సత్యన్ జ్ఞానశేఖరన్: 31 ఏళ్ల సత్యన్ స్వస్థలం చెన్నై. నాలుగేళ్ల క్రితం ప్రపంచ టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో 24వ స్థానానికి చేరిన సత్యన్.. టాప్–25లోకి అడుగు పెట్టిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటికీ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో భారత్ తరఫున అతనే అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కామన్వెల్త్ క్రీడల్లో 2 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యాలు సాధించిన సత్యన్ ఆసియా క్రీడల్లోనూ ఒక కాంస్యం అందుకున్నాడు. 2018లో అతనికి అర్జున అవార్డు దక్కింది. మానవ్ ఠక్కర్: ప్రపంచ టేబుల్ టెన్నిస్ అండర్–18 స్థాయి ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌కు చేరుకోవడంతో మానవ్ ఠక్కర్‌కు తొలిసారి చెప్పుకోదగ్గ గుర్తింపు లభించింది. ఆ తర్వాత అండర్–21లోనూ అతను నంబర్‌వన్‌గా నిలిచాడు. 23 ఏళ్ల ఠక్కర్ స్వస్థలం గుజరాత్‌లోని రాజ్‌కోట్. ఇప్పటి వరకు ఆసియా క్రీడల్లో ఒక కాంస్యం, ఆసియా చాంపియన్‌షిప్‌లో 3 కాంస్యాలు సాధించాడు. శరత్ కమల్, సత్యన్ జ్ఞానశేఖరన్ తర్వాత ప్రపంచంలోని ప్రతిష్ఠాత్మక టీటీ లీగ్ బుందేస్లిగాలో ఆడిన మూడో భారత ఆటగాడిగా నిలిచాడు. భారత వర్ధమాన ఆటగాళ్లలో అందరికంటే ప్రతిభావంతుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఠక్కర్ ఒలింపిక్స్‌లో పతకం గెలవడమే తన లక్ష్యంగా పెట్టుకున్నాడు. హర్మీత్ దేశాయ్: గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన హర్మీత్ దేశాయ్ కామన్వెల్త్ క్రీడల్లో 2 స్వర్ణాలు, 1 కాంస్యంతో పాటు ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించాడు. ఆసియా చాంపియన్‌షిప్‌లో 3 కాంస్యాలు కూడా అతని ఖాతాలో ఉన్నాయి. వరల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్న భారత జట్టులో హర్మీత్ సభ్యుడిగా ఉన్నాడు. 30 ఏళ్ల హర్మీత్ గుజరాత్ నుంచి జాతీయ విజేతగా నిలిచిన తొలి ఆటగాడిగా గుర్తింపు పొందాడు. క్రీడా పురస్కారం అర్జున అవార్డు అతని ఖాతాలో ఉంది. మనుష్ షా: 22 ఏళ్ల మనుష్ షా స్వస్థలం గుజరాత్‌లోని వడోదరా. రెండేళ్ల క్రితం సీనియర్ నేషనల్స్‌లో కాంస్యం సాధించడంతో వెలుగులోకి వచ్చిన అతను అంతే వేగంగా దూసుకుపోయాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్ నుంచి టాప్–100లోకి వచ్చిన పిన్న వయస్కుడిగా అతను గుర్తింపు పొందాడు. 10 ఏళ్ల క్రికెటర్‌గా మారే ప్రయత్నంలో అతను సాధన కొనసాగించాడు. అయితే స్కూల్లో ఎత్తు నుంచి పడిపోవడంతో డాక్టర్ల సూచనతో అవుట్డోర్ ఆటకు గుడ్‌బై చెప్పాల్సి వచ్చింది. అప్పుడు అతను టేబుల్ టెన్నిస్‌ను ఎంచుకున్నాడు. నిలకడైన ప్రదర్శనతో ఇప్పుడు భారత్ తరఫున టీమ్ ఈవెంట్లలో రెగ్యులర్ సభ్యుడిగా మారాడు. ఆకుల శ్రీజ: హైదరాబాద్‌కు చెందిన 25 ఏళ్ల ఆకుల శ్రీజ ఇప్పుడు భారత్ తరఫున అత్యంత విజయ వంతమైన ప్లేయర్‌గా కొనసాగుతోంది. 2021 సీనియర్ నేషనల్స్‌లో రన్నరప్‌గా నిలిచిన శ్రీజ తర్వాతి ఏడాది మరింత మెరుగైన ప్రదర్శన కనబరచింది. 2022లో జాతీయ సీనియర్ చాంపియన్‌షిప్‌లో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో ఆమె విజేతగా నిలిచింది. 1964లో మీర్ ఖాసిం అలీ తర్వాత హైదరాబాద్ నుంచి టీటీలో జాతీయ చాంపియన్‌గా నిలిచిన తొలి ప్లేయర్ శ్రీజ కావడం విశేషం. రెండేళ్ల క్రితం బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించడం ఆమె కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన. చదువులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న శ్రీజ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగిగా పని చేస్తోంది. ప్రస్తుతం భారత నంబర్‌వన్‌గా ఉన్న ఈ అమ్మాయి ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా సన్నద్ధమవుతోంది. రెండేళ్ల క్రితం శ్రీజ అర్జున అవార్డు కూడా గెలుచుకుంది. మనికా బత్రా: రెండేళ్ల క్రితం అర్చనా కామత్‌తో కలసి మనికా బత్రా ప్రపంచ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానానికి చేరింది. ఏ విభాగంలోనైనా ఇప్పటి వరకు భారత్ తరఫున ఇదే అత్యుత్తమ ర్యాంకింగ్. సుదీర్ఘ కాలంగా వరుస విజయాలతో భారత టేబుల్ టెన్నిస్‌లో తనదైన ముద్ర వేసింది. కామన్వెల్త్ క్రీడల్లో 2 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్యం గెలుచుకున్న ఆమె ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించింది. ఇంట్లో సోదర, సోదరీలను చూసి టీటీ వైపు ఆసక్తి పెంచుకున్న 28 ఏళ్ల మనికా ఇప్పుడు భారత జట్టులో కీలక సభ్యురాలు. అర్జున, ఖేల్‌రత్న అవార్డులను అందుకున్న ఈ ఢిల్లీ ప్లేయర్‌కు మున్ముందు మరిన్ని ఘనతలు సాధించగల సత్తా ఉంది. ఆటతో పాటు అందం ఉన్న మనికకు మంచి బ్రాండింగ్ సంస్థల నుంచి మోడలింగ్ అవకాశాలు వచ్చినా.. టీటీపైనే దృష్టి పెట్టేందుకు వాటన్నింటినీ తిరస్కరించింది. ఐహికా ముఖర్జీ: కోల్‌కతా శివార్లలోని నైహతి ఐహికా స్వస్థలం. గత ఏడాది ఆసియా క్రీడల్లో మహిళల డబుల్స్‌లో సుతీర్థ ముఖర్జీతో కలసి ఐహికా సెమీఫైనల్‌కు చేరింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో గెలిచి కాంస్యం సొంతం చేసుకున్న ఈ జోడి ఆసియా క్రీడల మహిళల డబుల్స్‌లో భారత్‌కు తొలిసారి పతకాన్ని అందించింది. వరల్డ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో చైనా దిగ్గజం సున్ యింగ్షాపై సాధించిన పలు విజయాలు ఐహిక ఖాతాలో ఉన్నాయి. ఇటీవలే ఐహికకు అర్జున అవార్డు కూడా దక్కింది. దియా చిటాలే: ముంబైకి చెందిన 21 ఏళ్ల దియా చిటాలే జాతీయ స్థాయిలో చెప్పుకోదగ్గ ప్రదర్శనలతో గుర్తింపులోకి వచ్చింది. అండర్–15 స్థాయి నుంచి వరుసగా కేడెట్, జూనియర్ స్థాయిలలో వేర్వేరు వయో విభాగాల్లో ఆమె విజేతగా నిలిచింది. ఆటతో పాటు రెండేళ్ల క్రితం చెలరేగిన ఒక వివాదంతో దియా వార్తల్లో నిలిచింది. 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల కోసం ఎంపిక చేసిన భారత జట్టులో తనకు చోటు దక్కకపోవడంతో దియా కోర్టును ఆశ్రయించింది. తన ప్రదర్శన, రికార్డులతో ఆమె కోర్టులో పోరాడింది. చివరకు న్యాయస్థానం ఆదేశాలతో దియాకు భారత జట్టులో స్థానం లభించడం విశేషం. అర్చనా కామత్: 23 ఏళ్ల అర్చనా కామత్ స్వస్థలం బెంగళూరు. తల్లిదండ్రులిద్దరూ వైద్యులే. 11 ఏళ్ల వయసులో రాష్ట్రస్థాయి చాంపియన్‌షిప్ అండర్–12, అండర్–18 టైటిల్స్ సాధించి సంచలనం సృష్టించింది. 14 ఏళ్లకే అండర్–21లో కూడా విజేతగా నిలవడంతో మరింత గుర్తింపు లభించింది. 2018లో తొలిసారి సీనియర్ నేషనల్స్ గెలిచిన తర్వాత ఆమె వేగంగా దూసుకుపోయింది. 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడలకు ముందుగా జట్టులో ఎంపికై ఆ తర్వాత దియా చిటాలేకు వచ్చిన అనుకూల కోర్టు తీర్పుతో చోటు కోల్పోయింది. అయితే తర్వాతి ఏడాది సీనియర్ జాతీయ ర్యాంకింగ్ టోర్నీలో విజేతగా నిలిచి సత్తా చాటింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో డబుల్స్‌లో కొంతకాలంగా టాప్–15లో కొనసాగుతోంది. — మొహమ్మద్ అబ్దుల్ హాది ఇవి చదవండి: PSL 2024: నిరాశపరిచిన బాబర్.. ఫైనల్‌కు చేరిన షాదాబ్ ఖాన్ జట్టు -
సూపర్ సుమీత్..
దాదాపు నాలుగున్నరేళ్ల క్రితం.. న్యూయార్క్‌లో టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ తొలి రౌండ్ మ్యాచ్. ఆల్‌టైమ్ గ్రేట్ ప్లేయర్ రోజర్ ఫెడరర్ బరిలోకి దిగాడు. అతని ఎదురుగా ఉన్న 22 ఏళ్ల కుర్రాడికి అదే తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ. క్వాలిఫయింగ్ ద్వారా మెయిన్ డ్రాకి అర్హత సాధించాడు. అంతకు ముందెప్పుడూ అతను అంత పెద్ద స్టేడియంలో ఆడలేదు. సహజంగానే ఎవరూ ఆ మ్యాచ్‌లో ఫెడరర్ ప్రత్యర్థి గురించి పట్టించుకోలేదు. కానీ ఒక సెట్ ముగిసే సరికి అందరిలో చర్చ మొదలైంది. ఆ యువ ఆటగాడు తొలి సెట్‌ను 6–4తో గెలుచుకొని అందరినీ ఆశ్చర్యపరచాడు. ఒక్కసారిగా షాక్‌కు గురైన ఫెడరర్ కోలుకొని ఆ తర్వాత తన స్థాయి ప్రదర్శనతో మ్యాచ్‌ను గెలుచుకున్నాడు. కానీ గ్రాండ్‌స్లామ్‌లో ఒక కొత్త ఆటగాడు అలా అందరూ గుర్తుంచుకునేలా పరిచయమయ్యాడు. ఆరంభం గుర్తుంచుకునేలా ఉన్నా.. ఆ తర్వాత ఆ కుర్రాడి కెరీర్ తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. ఆటలో ఓటములతో పాటు గాయాలు, ఆర్థిక సమస్యలూ చుట్టుముట్టాయి. టెన్నిస్‌ను కొనసాగించేందుకు కనీస స్థాయిలో కూడా డబ్బుల్లేని స్థితి. ఆటను వదిలిపెట్టేందుక్కూడా అతను సిద్ధమయ్యాడు. కానీ అతనిలోని పట్టుదల మళ్లీ పోరాడేలా చేసింది. సన్నిహితుల సహకారం మళ్లీ ఆటపై దృష్టి పెట్టేలా చేసింది. దాంతో వరుసగా చాలెంజర్ టోర్నీల్లో విజయాలు.. ఇప్పుడు సింగిల్స్‌లో వరల్డ్ టాప్–100 ర్యాంకింగ్స్‌లోకి ప్రవేశించిన అరుదైన భారత ఆటగాళ్ల జాబితాలో చోటు. ఆ కుర్రాడి పేరే సుమీత్ నగాల్. ఎన్నో ప్రతికూలతలను అధిగమించి ప్రస్తుతం భారత నంబర్‌వన్‌గా కొనసాగుతున్న ఈ ఆటగాడు మరిన్ని పెద్ద ఘనతలు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. మొహమ్మద్ అబ్దుల్ హాది ‘నా బ్యాంకు ఖాతాలో 80 వేల రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఏడాదంతా కలిపి 24 టోర్నీలు ఆడినా వచ్చే డబ్బు ఖర్చులకే సరిపోవడం లేదు. నా జీతం, కొన్ని సంస్థలు చేసే ఆర్థిక సహాయం మొత్తాన్ని కూడా టెన్నిస్‌లోనే పెట్టేశా. అంతర్జాతీయ టెన్నిస్‌లో విజయాలు, రికార్డుల సంగతి తర్వాత.. కనీసం ఒక ఆటగాడిగా కొనసాగాలన్నా ఏడాదికి రూ. 80 లక్షల నుంచి రూ.1 కోటి వరకు ఖర్చవుతుంది. ఫిజియో, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్‌లను పెట్టుకునే స్థాయి లేక కేవలం ఒకే ఒక ట్రావెలింగ్ కోచ్‌తో టోర్నీలకు వెళుతున్నా. మన దేశంలో టెన్నిస్‌కు ఉన్న ఆదరణ, ప్రోత్సాహం చాలా తక్కువ!’ కొన్నాళ్ల క్రితమే సుమీత్ నగాల్ వెలిబుచ్చిన ఆవేదన అది. ఆ మాటల్లో ఆశ్చర్యమేమీ లేదు. అంతర్జాతీయ టెన్నిస్ చాలా ఖర్చులతో కూడుకున్న వ్యవహారం. శిక్షణ, సాధన మొదలు ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు టోర్నీల్లో ఆడాలంటే చాలా డబ్బు కావాలి. టోర్నీల్లో ఆడితేనే ఫలితాలు, ర్యాంకింగ్స్ వస్తాయి. స్థాయి పెరిగేందుకు అవకాశం ఉంటుంది. అందుకే జూనియర్ స్థాయిలో మంచి ఫలితాలు సాధించిన తర్వాత కూడా ఆర్థిక సమస్యల కారణంగానే చాలామంది ముందుకు వెళ్లకుండా ఆగిపోతారు. నగాల్ తన కెరీర్లో ఇలాంటి దశను చాలాసార్లు ఎదుర్కొన్నాడు. అయితే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా టెన్నిస్‌ను అమితంగా ప్రేమిస్తూ ఆటపైనే దృష్టి పెట్టాడు. అందుకే ఇప్పుడు అతను సాధించిన రికార్డు, గెలిచిన టోర్నీలు ఎంతో ప్రత్యేకం. కెరీర్ ఆరంభంలోనే వేగంగా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 130కి చేరి ఆపై రెండేళ్ల వ్యవధిలో 638కి పడిపోయిన నగాల్.. ప్రస్తుతం టాప్–100లోకి రావడం అతని ఆటలోని పురోగతిని చూపిస్తోంది. ప్రతిభాన్వేషణతో వెలుగులోకి వచ్చి.. నగాల్ది సాధారణ కుటుంబ నేపథ్యం. ఢిల్లీకి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఝఝర్ అతని స్వస్థలం. తండ్రి ఉపాధ్యాయుడు. తల్లి గృహిణి. ఆరంభంలో తన ఈడు పిల్లల్లాగే క్రికెట్‌నే అతను ఎక్కువగా ఇష్టపడ్డాడు. మిత్రులతో కలసి గల్లీ క్రికెట్ ఆడుతూ వచ్చాడు. అయితే ఎనిమిదేళ్ల వయసులో టీమ్ ఈవెంట్ కాకుండా ఒక వ్యక్తిగత క్రీడాంశంలో అతడిని చేర్పించాలనే తండ్రి ఆలోచన నగాల్‌ను టెన్నిస్ వైపు నడిపించింది. రెండేళ్లు స్థానిక క్లబ్లో అతను టెన్నిస్ నేర్చుకున్నాడు. అయితే పదేళ్ల వయసులో ఒక ఘటన నగాల్ కెరీర్‌ను మార్చింది. అప్పటికే భారత టాప్ టెన్నిస్ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న మహేశ్ భూపతి తన అకాడమీలో శిక్షణ ఇచ్చేందుకు ప్రతిభాన్వేషణ కార్యక్రమం నిర్వహించాడు. చాలా మందితో పాటు అతను కూడా సెలక్షన్స్‌కు హాజరయ్యాడు. అందరిలాగే హిట్టింగ్ చేస్తూ వచ్చాడు. కానీ భూపతి దృష్టి నగాల్‌పై పడలేదు. చాలాసేపటి తర్వాత ఆ పదేళ్ల కుర్రాడు ధైర్యం చేసి నేరుగా భూపతి వద్దకే వెళ్లాడు. ‘సర్, కాస్త నా ఆట కూడా చూడండి’ అని కోరాడు. ఆశ్చర్యపడ్డ భూపతి అతనిలోని పట్టుదలను గమనించి ప్రత్యేకంగా నగాల్‌తో ప్రాక్టీస్ చేయించాడు. వెంటనే అతని ఆట ఆకట్టుకోవడంతో తన ఎంపిక పూర్తయింది. ‘నేను ఆ ఒక్క మాట ఆ రోజు అనకుండా ఉంటే నన్ను ఎవరూ పట్టించుకోకపోయేవారేమో. ఎందుకంటే అంత డబ్బు పెట్టి మావాళ్లు టెన్నిస్ నేర్పించలేకపోయేవారు’ అని నగాల్ గుర్తు చేసుకుంటాడు. అది ఆ అకాడమీకి మొదటి బ్యాచ్. బెంగళూరులో రెండేళ్ల శిక్షణ తర్వాత భూపతి అకాడమీ కార్యకలాపాలు ఆగిపోయినా.. అప్పటికే మెరుగుపడ్డ నగాల్ ప్రదర్శన అతనికి సరైన దిశను చూపించింది. కుటుంబ మిత్రుల సహకారంతో విదేశాల్లో మరింత మెరుగైన శిక్షణతో అతని ఆట రాటుదేలింది. క్రికెట్‌పై తన చిన్ననాటి ఇష్టాన్ని వదులుకోని నగాల్.. తర్వాతి రోజుల్లో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడేందుకు వెళ్లి మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ నెట్స్‌లో క్రికెట్ ఆడి తన సరదా తీర్చుకోగలిగాడు. జూనియర్ గ్రాండ్‌స్లామ్‌తో.. 18 ఏళ్ల వయసులో నగాల్ ప్రొఫెషనల్‌గా మారాడు. హైదరాబాద్‌లో జరిగిన ఐటీఎఫ్ టోర్నీలో విజయం సాధించి కెరీర్లో తొలి టైటిల్‌ని అతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఒక మేజర్ టోర్నీ విజయం నగాల్‌కు గుర్తింపు తెచ్చింది. 2015 జూనియర్ వింబుల్డన్ డబుల్స్‌లో (భాగస్వామి వియత్నాం ఆటగాడు హోంగా నామ్) నగాల్ విజేతగా నిలిచాడు. జూనియర్ గ్రాండ్‌స్లామ్ నెగ్గిన ఆరో భారత ఆటగాడిగా పేరొందాడు. కెరీర్లో ఎదిగే క్రమంలో మూడేళ్ల వ్యవధిలో 9 ఐటీఎఫ్ ఫ్యూచర్ టైటిల్స్‌ను అతను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే చెప్పుకోదగ్గ మలుపు ఏటీపీ చాలెంజర్ టోర్నీ రూపంలో వచ్చింది. 2017లో బెంగళూరులో నగాల్ తన తొలి చాలెంజర్ టైటిల్ సాధించాడు. ఆ తర్వాత రెండేళ్లకు అర్జెంటీనాలో బ్యూనస్ ఎయిరీస్ టోర్నీ రెండో టైటిల్ రూపంలో చేరింది. అయితే ఆ తర్వాత అంతా ఒక్కసారిగా మారిపోయింది. పరాజయాల బాటను వీడి.. నాలుగేళ్ల పాటు నగాల్ కెరీర్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దాదాపు రెండేళ్లు కోవిడ్ సమయంలోనే వెళ్లిపోగా.. మిగిలిన రెండేళ్లలో అతనికి గాయాలు, వాటికి శస్త్రచికిత్సలు. ఫామ్ కోల్పోయి మానసికంగా కూడా కుంగుబాటుకు గురైన స్థితి. టోక్యో ఒలింపిక్స్‌లోనూ ప్రభావం చూపలేకపోయాడు. వీటికి తోడు అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) నుంచి క్రమశిక్షణరాహిత్యం ఆరోపణలు. ఇలాంటివాటిని దాటి గత ఏడాది నగాల్ మళ్లీ సరైన దారిలో పడ్డాడు. అప్పటి వరకు ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే 2023లో నగాల్ సాధించిన విజయాలు అతని కెరీర్లో ఎంతో విలువైనవిగా కనిపిస్తాయి. ఇటలీ, ఫిన్లండ్ చాలెంజర్ టోర్నీ టైటిల్స్, మరో రెండు టోర్నీలు ఆస్ట్రియా, హెల్సింకీలలో రన్నరప్ నగాల్‌కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఇక ఈ ఏడాదికి వచ్చే సరికి అతని ఆట మరింత పదునెక్కింది. గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్ తొలి రౌండ్లో అలెగ్జాండర్ బబ్లిక్‌పై సంచలన విజయం సాధించిన నగాల్.. 1989 (రమేశ్ కృష్ణన్) తర్వాత గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఒక సీడెడ్æఆటగాడిని ఓడించిన తొలి భారతీయుడిగా నిలవడం విశేషం. ఆపై కొద్దిరోజులకే చెన్నై ఓపెన్ చాలెంజర్ టోర్నీలో చాంపియన్‌గా సొంతగడ్డపై తొలి టైటిల్‌తో నగాల్ విజయనాదం చేశాడు. కొన్నాళ్ల క్రితం ఆటనే వదిలేయాలనుకున్న వ్యక్తి.. ప్రతికూలతలపై పోరాడి ఇప్పుడు సాధిస్తున్న విజయాలను చూస్తుంటే.. ఆ పట్టుదలకున్న పదును అర్థమవుతోంది. ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే రాబోయే రోజుల్లో కూడా నగాల్ తన ప్రదర్శనతో మరిన్ని అద్భుతాలు చేయగలడని భారత టెన్నిస్ ప్రపంచం విశ్వసిస్తోంది. -
సంచలనం.. నెంబర్ వన్ స్వియాటెకు షాకిచ్చిన స్వితోలినా
లండన్: గత ఏడాది అక్టోబర్‌లో పాపకు జన్మనిచ్చి... ఏప్రిల్‌లో మళ్లీ రాకెట్ పట్టిన ఉక్రెయిన్ టెన్నిస్ స్టార్ ఎలీనా స్వితోలినా వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో పెను సంచలనం సృష్టించింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో స్వితోలినా 7–5, 6–7 (5/7), 6–2తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్)ను బోల్తా కొట్టించింది. 2019 తర్వాత మళ్లీ వింబుల్డన్ టోర్నీలో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరిన స్వితోలినాకు వింబుల్డన్ నిర్వాహకులు ‘వైల్డ్ కార్డు’ కేటాయించారు. స్వియాటెక్‌తో 2 గంటల 51 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో స్వితోలినా ఐదు ఏస్‌లు సంధించింది. తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పో యి, స్వియాటెక్ సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. నెట్ వద్దకు 14 సార్లు దూసుకొచ్చి తొమ్మిదిసార్లు పాయింట్లు నెగ్గిన స్వితోలినా 25 విన్నర్స్ కొట్టింది. నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గి, తొలిసారి వింబుల్డన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరిన స్వియాటెక్ 41 అనవసర తప్పిదాలు చేసింది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 76వ స్థానంలో ఉన్న స్వితోలినా సెమీఫైనల్ చేరిన క్రమంలో నలుగురు గ్రాండ్‌స్లామ్ చాంపియన్స్‌ను ఓడించడం విశేషం. తొలి రౌండ్లో వీనస్ విలియమ్స్ (అమెరికా)పై, రెండో రౌండ్లో సోఫియా కెనిన్ (అమెరికా)పై, నాలుగో రౌండ్లో విక్టోరియా అజరెంకా (బెలారస్)లపై స్వితోలినా గెలిచింది. సెమీఫైనల్లో చెక్ రిపబ్లిక్కు చెందిన మర్కెటా వొండ్రుసోవాతో స్వితోలినా తలపడుతుంది. మరో క్వార్టర్ ఫైనల్లో 42వ ర్యాంకర్ వొండ్రుసోవా 6–4, 2–6, 6–4తో ప్రపంచ నాలుగో ర్యాంకర్, నాలుగో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా)పై సంచలన విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్లో బోపన్న జోడీ పురుషుల డబుల్స్ మూడో రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) ద్వయం 7–5, 4–6, 7–6 (10/7) తో డేవిడ్ పెల్ (నెదర్లాండ్స్)–రీస్ స్టాడ్లెర్ (అమెరికా) జంటను ఓడించింది. జూనియర్ బాలుర సింగిల్స్ రెండో రౌండ్లో మానస్ ధామ్నె (భారత్) 1–6, 4–6తో సియర్లీ (బ్రిటన్) చేతిలో ఓడిపోయాడు. A five-star performance 🌟@ElinaSvitolina defeats the world No.1 Iga Swiatek 7-5, 6-7(5), 6-2 to reach the semi-finals at #Wimbledon once again pic.twitter.com/l6nUu17KHj — Wimbledon (@Wimbledon) July 11, 2023 -
18 ఏళ్లకే సంచలనాలు.. 70వ దశకాన్ని శాసించిన టెన్నిస్ దిగ్గజం
21 ఏళ్ల వయసు వచ్చే సరికే టెన్నిస్ చరిత్రలో దిగ్గజ ఆటగాళ్లలో ఒకడిగా అతను గుర్తింపు తెచ్చుకోగలిగాడు. 26 ఏళ్ల వయసు వచ్చేసరికి ఎందరికో సాధ్యం కాని ఘనతలను అతను సొంతం చేసుకున్నాడు. ఆధునిక టెన్నిస్ తరంలో ఏ ఆటగాడి కెరీర్ కూడా అంత తక్కువ సమయంలో అంత అద్భుతంగా లేదు. చాంపియన్‌షిప్ విజయాలు, ఫలితాలు మాత్రమే కాదు.. అతను వాటిని సాధించిన తీరు కూడా అబ్బురపరచాయి. 18 ఏళ్ల వయసుకే ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గి అప్పటికి అత్యంత పిన్న వయస్కుడిగా అతను గుర్తింపు తెచ్చుకున్నాడు. రెండు పూర్తిగా భిన్నమైన వేదికలపై వరుసగా మూడేసి సార్లు గ్రాండ్‌స్లామ్ గెలవడం అతనికి మాత్రమే సాధ్యమైన ఘనత. ఆ పొడవాటి జట్టు, హెడ్ బ్యాండ్ సుదీర్ఘ సమయం పాటు ప్రపంచ టెన్నిస్‌పై చెరగని ముద్ర వేశాయి. వరల్డ్ టెన్నిస్‌లో ఆల్‌టైమ్ గ్రేట్‌గా నిలిచిన ఆ స్వీడిష్ స్టార్ ప్లేయర్ బోర్న్ బోర్గ్. టీనేజ్ సంచలనంగా తన కెరీర్ మొదలు పెట్టిన బోర్గ్ తన ఆకర్షణీయమైన ఆటతో 70వ దశకపు టెన్నిస్ ప్రపంచాన్ని శాసించాడు. 'మేమందరం టెన్నిస్ ఆడుతున్నాం. అతను మాత్రం అంతకు మించి ఆడుతున్నాడు'.. 1976 వింబుల్డన్ ఫైనల్లో బోర్గ్ చేతిలో ఓడిన తర్వాత అతని ప్రత్యర్థి, అప్పటి ఫేవరెట్ ఎలీ నాస్టెస్ చేసిన వ్యాఖ్య అది. 20 ఏళ్ల బోర్గ్ ఆ మ్యాచ్‌లో చూపిన ప్రదర్శన అలాంటిది మరి. మంచి ఫిట్నెస్.. చక్కటి నైపుణ్యంతో పాటు వైవిధ్యమైన శైలి బోర్గ్‌ను ప్రత్యేకంగా నిలబెట్టాయి. అటు ఫోర్‌హ్యాండ్‌ను, ఇటు బ్యాక్‌హ్యాండ్‌ను కూడా సమర్థంగా వాడగల ప్రతిభ బోర్గ్ అద్భుతమైన కెరీర్‌కి బలాలుగా నిలిచాయి. హాకీలో స్లాప్ షాట్ తరహాలో రెండు చేతులతో అతను ఆడే బ్యాక్‌హ్యాండ్‌కు ప్రత్యర్థి ఎవరైనా సరే.. ఓటమిని ఒప్పుకోవాల్సిందే. 13 ఏళ్ల వయసులోనే స్వీడన్ లో 18 ఏళ్ల ఆటగాళ్లందరినీ ఓడించి వచ్చిన బోర్గ్ ఆటపై ఆ దేశపు అభిమానులు పెట్టుకున్న అంచనాలు ఎప్పుడూ తప్పు కాలేదు. బోర్గ్ తండ్రి తనకు స్థానిక పోటీల్లో బహుమతిగా వచ్చిన ఒక రాకెట్‌ను కొడుకు చేతుల్లో పెట్టినప్పుడు అతనికి తొలిసారి ఆటపై ఆసక్తి కలిగింది. ఆ తర్వాత మొదలైన అతని సాధన బోర్గ్‌ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లింది. ఆటలో ఓనమాలు నేర్చుకున్నప్పుడు అతను బేస్‌లై¯Œ కే ప్రాధాన్యమిచ్చాడు. సుదీర్ఘ ర్యాలీలు ప్రాక్టీస్ చేయడంతో పాటు బ్యాక్‌హ్యాండ్‌పై దృష్టి పెట్టాడు. ప్రొఫెషనల్‌గా మారిన తర్వాత కూడా బోర్గ్ సర్వీస్ కాస్త బలహీనంగానే ఉండేది. అయితే వింబుల్డ¯Œ లాంటి పెద్ద టోర్నీలు నెగ్గాలంటే సాధారణ ఆట సరిపోదని భావించి తన సర్వ్ అండ్ వ్యాలీని పటిష్ఠపరచుకున్నాడు. చివరకు అది గొప్ప విజయాలను అందించింది. ఆటలో ఎలాంటి కఠిన పరిస్థితుల్లోనూ ఒత్తిడిని దరి చేరనీయకుండా, ఓటమి తర్వాత కూడా ప్రశాంతంగా కనిపించగల అతని తత్వం బోర్గ్‌కు ‘ఐస్‌బర్గ్’ అనే పేరు తెచ్చి పెట్టింది. ఫ్రెంచ్ ఓపెన్‌తో మొదలు.. స్వీడన్ తరఫున డేవిస్ కప్ టీమ్‌లో ఆడే అవకాశం బోర్గ్‌కు పదిహేనవ ఏటనే వచ్చింది. కెరీర్ తొలి మ్యాచ్‌లో అతను చక్కటి విజయంతో శుభారంభం చేసినా టీమ్ ముందుకు వెళ్లలేకపోయింది. మరో రెండేళ్ల పాటు అక్కడక్కడా కొన్ని ఆకట్టుకునే ప్రదర్శనలు చేసినా.. చెప్పుకోదక్క టైటిల్‌ను మాత్రం అందుకోలేదు. అయితే 1974.. అతని కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆక్లాండ్‌లో గ్రాస్‌కోర్టుపై తొలి టోర్నీ నెగ్గి సంబరాలు చేసుకున్న బోర్గ్ అదే ఏడాది గ్రాండ్‌స్లామ్ చాంప్‌గా కూడా అవతరించాడు. రోమ్‌లో ఇటాలియన్ ఓపెన్ గెలవడంతో అతనిపై అంచనాలు పెరిగిపోయాయి. వాటిని నిలబెట్టుకుంటూ అతను మరికొద్ది రోజులకే రోలండ్గారోస్లో సత్తా చాటాడు. ఫైనల్లో ఐదు సెట్ల సమరంలో మ్యాన్యూల్ ఒరెంటెస్ (స్పెయిన్)ను ఓడించి 18 ఏళ్లకే ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ అయ్యాడు. ఆ ఏడాది మొత్తం 8 టోర్నీల్లో విజేతగా నిలిచి బోర్గ్ తన రాకను ఘనంగా చాటాడు. తర్వాతి ఏడాది కూడా ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను నిలబెట్టుకున్న అతను మరో నాలుగు ట్రోఫీలతో తన జోరును కొనసాగించాడు. 1975.. అతనికి మరో మధురానుభూతిని మిగిల్చింది. 19 ఏళ్ల వయసులో అతను స్వీడన్‌ను తొలిసారి డేవిస్ కప్ విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. అదే సమయంలో డేవిస్ కప్‌లో 19 వరుస విజయాలు సాధించి ఆ ఘనత అందుకున్న తొలి ఆటగాడిగానూ కొత్త రికార్డు సృష్టించాడు. ట్రిపుల్ ధమాకా.. రెండు ఫ్రెంచ్ టైటిల్స్ సాధించినా గ్రాస్ కోర్టుపై ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ గెలవని లోటు అప్పుడే బోర్గ్‌కు కనిపించింది. దాంతో తన ఆటలో స్వల్ప మార్పులతో ప్రత్యేక దృష్టి పెట్టాడు. చివరకు ఆ సాధన అద్భుతమైన ఫలితాలను అందించింది. 1976లో ఒక్క సెట్ కూడా కోల్పోకుండా తొలిసారి అతను వింబుల్డన్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ మెగా ఈవెంట్‌పై అతని హవా మరో నాలుగేళ్లు సాగడం విశేషం. 1976 నుంచి 1980 వరకు వరుసగా ఐదేళ్ల పాటు బోర్గ్ వింబుల్డన్ చాంపియన్‌గా నిలిచాడు. రెండో టైటిల్ సాధించిన సమయంలో మొదటిసారి ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ కూడా బోర్గ్ రాకెట్లో చిక్కింది. మరో వైపు రోలండ్ గారోస్ క్లే కోర్టుపై కూడా పట్టు కోల్పోలేదు. రెండేళ్ల విరామం తర్వాత 1978లో మూడో ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకున్న అతను ఆ తర్వాత మరో మూడు టైటిల్స్‌ను తన కోర్ట్‌లో వేసుకున్నాడు. ఆ క్రమంలో బోర్గ్ ప్రపంచ టెన్నిస్ చరిత్రలో మరెవరికీ సాధ్యం కాని, ఈతరం ఆటగాళ్లు కూడా అందుకోలేని ఒక అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. గ్రాండ్‌స్లామ్‌లో తక్కువ వ్యవధిలో పూర్తిగా రెండు భిన్న సర్ఫేస్ (క్లే, గ్రాస్)లపై జరిగే ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ లను అతను వరుసగా మూడేళ్ల పాటు గెలిచాడు. 1979లో ఏకంగా 13 టైటిల్స్‌తో అతను సంచలనం సృష్టించాడు. 1980.. వింబుల్డన్ ఫైనల్ అయితే చరిత్రలోనే అత్యుత్తమ మ్యాచ్‌లలో ఒకటిగా నిలిచిపోయింది. అందులో బోర్గ్ .. తన చిరకాల ప్రత్యర్థి జాన్ మెకన్రోపై 16, 75, 63, 67 (16/18), 86తో విజయం సాధించాడు. ముగింపు...పునరాగమనం... బోర్గ్ తన ఇరవై ఆరవ ఏట.. ఒక రోజు.. అనూహ్యంగా తాను టెన్నిస్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. టెన్నిస్‌లో చక్కగా ఎదిగే వయసు.. ఎదుగుతున్న సమయంలో.. అతని ఆ ప్రకటన అందరికీ ఆశ్చర్యం కలిగించింది. 1982లో ఒకే ఒక టోర్నీ ఆడిన అతను సన్నిహితులు ఎందరు వారించినా తగిన కారణం కూడా లేకుండా రిటైర్మెంట్ ప్రకటించాడు. 1981లో గెలిచిన ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ అతని ఆఖరి గ్రాండ్‌స్లామ్. ఆ తర్వాత అతను తన బ్రాండ్‌ను వాడుకుంటూ వేర్వేరు వ్యాపారాల్లోకి వెళ్లిపోయాడు. అయితే దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ ఆటపై మనసు మళ్లడంతో తన పాత ఫ్యాషన్ స్టయిల్లో, పాతతరం వుడెన్ రాకెట్‌తో మళ్లీ కోర్టులోకి అడుగు పెట్టాడు. ఊహించినట్లుగానే ఆ ప్రయత్నం సఫలం కాలేదు. ఆ టైమ్‌కి టెన్నిస్ పూర్తిగా మారిపోయిందని బోర్గ్‌కు అర్థమైంది. ఆడిన 12 మ్యాచ్‌లలో ఒక్కటి కూడా గెలవకుండా ఈసారి శాశ్వతంగా గుడ్‌బై చెప్పేశాడు. అయితే 11 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ సాధించిన ఘనత, 66 టైటిల్స్, 109 వారాల పాటు వరల్డ్ నంబర్‌వన్... వీటన్నింటితో పాటు ఎన్నో గొప్ప మ్యాచ్‌లను అందించిన శాశ్వత కీర్తితో అభిమానుల మదిలో నిలిచిపోవడంలో మాత్రం బోర్గ్ సఫలమయ్యాడు. - మొహమ్మద్ అబ్దుల్ హాది చదవండి: Ashes 2023: ఇంగ్లండ్ కోచ్ మెక్‌కల్లమ్‌కు చేదు అనుభవం..