అధికార పార్టీకి ‘ఉప’ సవాల్
ముందున్న వరంగల్ పార్లమెంటు, నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలు
- ప్రభుత్వ వైఫల్యాలే ప్రచారాస్త్రాలు అంటున్న విపక్షాలు
- ఎలా గట్టెక్కాలా అన్న యోచనలో టీఆర్‌ఎస్
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ‘ఉప ఎన్నికల’ అస్త్రాన్ని పదేపదే ఉపయోగించిన టీఆర్‌ఎస్‌కు ఇప్పుడు ఆ ఉప ఎన్నికలే సవాల్‌గా నిలవనున్నాయి. కడియం శ్రీహరి ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో వరంగల్ పార్లమెంటు స్థానం ఖాళీ కాగా, మెదక్ జిల్లా నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన పి.కిష్టారెడ్డి అకాల మరణంతో ఆ స్థానం కూడా ఖాళీ అయ్యింది. ఇపుడు ఈ రెండు స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది.
బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు చివరి దశ ముగిసేలోగా ఈ రెండు స్థానాలకు షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బీజేపీ, టీడీపీ మధ్య పొత్తు వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. మరోవైపు వామపక్షాలన్నీ కలసి ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపాలని భావిస్తున్నాయి. కాంగ్రెస్ కూడా ఇక్కడ గెలవాలన్న కసిమీద ఉంది. అభ్యర్థుల విషయంలో ఇప్పటికిప్పుడు ఏమీ తేలకున్నా, విపక్షాలన్నీ ఎవరి స్థాయిలో వారు ఈ నియోజకవర్గాల్లో ప్రజలను కలిసే ప్రయత్నం చేస్తున్నాయి. టీఆర్‌ఎస్‌లో వరంగల్ ఉప ఎన్నిక గుబులు రేపుతోంది.
వ్యతిరేక అంశాలపై ఆందోళన
వరంగల్ పార్లమెంటు స్థానం నుంచి టికె ట్ ఆశిస్తున్న గులాబీ నేతల సంఖ్య తక్కువేం లేదు. కానీ, తమ అధినేత మదిలో ఎవరున్నారో, ఎవరి అభ్యర్ధిత్వం పట్ల మొగ్గు చూపుతారో అంతుపట్టక ఆందోళన చెందుతున్నారు. అన్నిటికన్నా టీఆర్‌ఎస్‌కు ప్రతికూలంగా ఉన్న అంశాలపైనే పార్టీలోనూ, బయటా చర్చ జరుగుతోంది. విపక్షాలు ఏ అంశాలను ప్రచారాస్త్రాలుగా ఉపయోగించుకోనున్నాయో గులాబీ నేతలు ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చారు.
- పెన్షన్ లబ్ధిదారుల ఎంపికలో జరిగిన కిరికిరి, రుణమాఫీపై రైతుల్లో ఉన్న అసంతృప్తి, బ్యాంకు రుణాలు అందకపోవడం, గుడుంబా నియంత్రణ పేర చీప్‌లిక్కర్ తేవడానికి జరిగిన ప్రయత్నాలు ప్రభుత్వంపై వ్యతిరేక అభిప్రాయాన్ని పెంచుతున్నాయని అంటున్నారు. పార్టీ అధికారం చేపట్టి 15 నెలలు గడిచినా, డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఊసు లేకపోవడం, ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు చెల్లించకపోవడం, ప్రాజెక్టుల ప్రకటనలే కానీ అడుగుముందుకు పడకపోవడం వంటి అంశాలపై విపక్షాలు ప్రచారం షురూ చేశాయి. పార్టీ ఫిరాయింపులూ ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత పార్టీ అభ్యర్థికి ప్రతికూలంగా మారే ముప్పు ఉందని టీఆర్‌ఎస్ నేతలు మధనపడుతున్నారు.
- నారాయణ ఖేడ్ అసెంబ్లీ స్థానం విషయంలోనూ టీఆర్‌ఎస్‌లో ఆందోళన కనిపిస్తోంది. ఈ ఉప ఎన్నికలో అన్ని పక్షాలు పక్కకు తప్పుకుని, కిష్టారెడ్డి కుటుంబ సభ్యుల్లో ఒకరి ఏకగ్రీవ ఎన్నికకు నిర్ణయం తీసుకుంటారా? లేక పోటీ చేస్తారా అన్నది తేలాల్సి ఉంది.
గత ఎన్నికల ఫలితాన్ని బట్టి చూస్తే, టీఆర్‌ఎస్ ఆందోళనకు అర్థం ఉంద ంటున్నారు. గిరిజన ఓట్లు ఎక్కువున్న ఈ స్థానంలో తనకే టికెట్ కావాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ ఒకరు ప్రయత్నాలు మొదలు పెట్టారు. దీంతో ఇక్కడ పార్టీలో వర్గ పోరు తప్పేలా లేదు. మొత్తంగా ఈ రెండు స్థానాల్లో ఉప ఎన్నికల గండం నుంచి ఎలా గట్టెక్కాలా అన్న చర్చ పార్టీలో మొదలైంది.