అభ్యర్థిని నేడు ప్రకటిస్తాం: కడియం
* వరంగల్‌లో విజయం మాదే
* నవంబర్ 1న నియోజకవర్గ స్థాయి సమావేశాలు
* 17, 18 తేదీల్లో సీఎం ఎన్నికల ప్రచారం
* ఏడుగురు మంత్రులకు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: వరంగల్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం సాయంత్రం ప్రకటిస్తారని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. వరంగల్ జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారని, అభ్యర్థిని ఎంపిక చేసి, ప్రకటించే బాధ్యతను కేసీఆర్‌కే అప్పజెపుతూ సమావేశం తీర్మానించిందన్నారు.
తెలంగాణ భవన్‌లో గురువారం మంత్రులు చందూలాల్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ బి.వినోద్‌కుమార్‌లతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. వరంగల్ లోక్‌సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలవబోతున్నారని కడియం చెప్పారు. నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు ఏడుగురు మంత్రులకు సీఎం ఇన్‌చార్జి బాధ్యతలు అప్పజెప్పారని తెలిపారు. జిల్లాకు చెందిన తనతో పాటు, కరీనంగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్‌కు ఎన్నికల కార్యక్రమాల సమన్వయ బాధ్యత అప్పజెప్పారని వివరించారు. అభ్యర్థి ఎంపిక బాధ్యతను అధ్యక్షుడికి కట్టబెట్టామని చెప్పారు. నవంబర్ 17, 18 తేదీల్లో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని చెప్పారు.
మాకు పోటీనే లేదు..
నవంబర్ 1న ఏడు సెగ్మెంట్లలో నియోజకవర్గ స్థాయి సమావేశాలు జరుగుతాయని కడి యం తెలిపారు. స్థానిక ఎమ్మెల్యేతో పాటు ఇన్‌చార్జులుగా నియమితులైన మంత్రులు, ఎమ్మెల్యేలు లేని చోట నియోజకవర్గ ఇన్‌చార్జి ఈ భేటీలో పాల్గొని ఎన్నికల ప్రచార ప్రణాళికను తయారు చేస్తారని వివరించారు. అభ్య ర్థి ఎప్పుడు నామినేషన్ దాఖలు చేయాలి, ఎంత మందిని ఈ కార్యక్రమానికి సమీకరించాలన్న అంశంపైనా చర్చిస్తామన్నారు. ఎవరెన్ని ఆరోపణలు చేసినా ఉప ఎన్నికల్లో విజయం తమదేనని, ఫలితాలు వచ్చాక విపక్షాలు విమర్శలు మానుకోవాల్సిందేనని పేర్కొన్నారు.
క్షేత్రస్థాయిలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు వారి బలాన్ని అంచనా వేసుకోవడంలో విఫలం అయ్యాయన్నారు. అభ్యర్థులు కరువవడంతో ఆ పార్టీలు పోటీ చేసేవారి కోసం బతిమిలాడుకుంటున్నాయని ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికలను ప్రభుత్వ పనితీరుకు రెఫరెండంగా ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాల తీరుపైనా కడియం స్పందించారు. ఢిల్లీ ఎన్నికలు, ఇప్పుడు జరుగుతున్న బిహార్ ఎన్నికలు కేంద్ర ప్రభుత్వ పనితీరుకు రెఫరెండమో కాదో చెప్పిన తర్వాత బీజేపీ మాట్లాడాలన్నారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ దరిదాపుల్లో ఏ పార్టీ లేదని, అసలు తమకు పోటీనే లేదన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో లేని హామీలను కూడా తమ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వానికి మరింత సమయం ఇవ్వాలని ప్రజలు భావిస్తున్నారని, వారంతా టీఆర్‌ఎస్ వెంటే ఉన్నారని పేర్కొన్నారు.
ఇన్‌చార్జి మంత్రులు వీరే
వరంగల్ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు ఏడుగురు మంత్రులను ఇన్‌చార్జులుగా నియమించారు. భూపాలపల్లి-పోచారం శ్రీనివాస్‌రెడ్డి, పరకాల-ఈటల రాజేందర్, వరంగల్(తూర్పు)-హరీశ్‌రావు, వరంగల్(పశ్చిమ)-కె.తారక రామారావు, వర్ధన్నపేట-జోగు రామన్న, స్టేషన్‌ఘన్‌పూర్-ఇంద్రకరణ్‌రెడ్డి, పాలకుర్తి-జగదీశ్వర్ రెడ్డికి బాధ్యతలు అప్పజెప్పారు. విలేకరుల సమావేశంలో వరంగల్ జిల్లా టీఆర్‌ఎస్ అధ్యక్షుడు టి.రవీందర్‌రావు, ఎమ్మెల్యే కిషన్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.