
వెయ్యేళ్ల విగ్రహం తునాతునకలు
రాయపూర్: ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులు మరోసారి పంజా విసిరారు. దంతెవాడ జిల్లాలోని ధోల్కల్ కొండపై ఉన్న అత్యంత పురాతన వినాయకుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రతిమను తునాతునకలు చేశారు. ఇది మావోయిస్టుల పనే పోలీసులు పేర్కొన్నారు. వినాయకుడిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు, యాత్రికులు ఇక్కడకు వస్తుండడంతో తమ ఉనికికి భంగం కలుగుతుందనే ఉద్దేశంతో మావోయిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడివుంటారని పోలీసులు అంటున్నారు.
విగ్రహ ధ్వంసంపై దర్యాప్తు చేపట్టామని దంతెవాడ ఎస్పీ కె. కశ్యప్ తెలిపారు. కలెక్టర్ సౌరభ్ కుమార్ తో కలిసి ఆయన ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కొండ దిగువ ప్రాంతంలో విగ్రహం శకలాలు గుర్తించామని, కొండ పైనుంచి విగ్రహాన్ని విసిరేసి ఉంటారని ఎస్పీ అన్నారు. దర్యాప్తు కొనసాగుతోందని ఛత్తీస్ గఢ్ పర్యాటక శాఖ మంత్రి దయాల్ దాస్ బాఘెల్ తెలిపారు.