దోమకాటుకు 10 మంది చిన్నారుల బలి
మల్కాన్గిరి: దోమ కాటుకు ఒడిశాలో 10 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. గిరిజనులు అధికంగా నివసించే మల్కాన్గిరి జిల్లాలో నెల రోజుల వ్యవధిలో ఈ మరణాలు సంభవించినట్టు అధికారులు తెలిపారు. మృతులంతా ఏడాది నుంచి నాలుగేళ్ల వయసున్న పిల్లలు. దోమకాటు వల్ల సంభవించిన ఇన్ఫెక్షన్ కారణంగా వీరు మృతి చెందారు. వీరు మల్కాన్గిరి జిల్లాలోని కొరకుండ, బలిమెల, కలిమెల బ్లాకులకు చెందివారు.
దోమకాటుకు గురైన బాధితుల రక్తనమూనాలను భువనేశ్వర్, పుణే ప్రయోగశాలలకు పంపించినట్టు మల్కాన్గిరి జిల్లా ముఖ్య వైద్యాధికారి ఉదయ్నాథ్ మిశ్రా తెలిపారు. దోమ కాటుతో వచ్చిన ఇన్ఫెక్షన్ కారణంగా రోగం బారిన పడి పిల్లలు మృతి చెందారన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రయోగశాలల నుంచి నివేదికలు వచ్చిన తర్వాతే కచ్చితమైన కారణం తెలుస్తుందన్నారు. మరోవైపు నాలుగు వైద్యబృందాలు బాధిత ప్రాంతాల్లో పర్యటించాయి.