10 గంటల్లో 5 లక్షల మొబైల్స్ సేల్
మెట్రో నగరాల నుంచి భారీగా ఆర్డర్లు: ఫ్లిప్‌కార్ట్
న్యూఢిల్లీ: ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ పది గంటల్లో 5 లక్షల మొబైళ్లను విక్రయించింది. ద బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా ఈ స్థాయి అమ్మకాలు సాధించామని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. ఇంత తక్కువ వ్యవధిలో ఇన్నేసి ఫోన్లు విక్రయించడం రికార్డ్ అని ఫ్లిప్‌కార్ట్ హెడ్(కామర్స్ ప్లాట్‌ఫారమ్) ముకేశ్ బన్సాల్ పేర్కొన్నారు. ఈ నెల 13న ప్రారంభమైన ఈ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఈ నెల 17(శనివారం)న ముగుస్తుంది. బుధవారం అర్థరాత్రి నుంచి అమ్మకాలు మొదలు పెట్టామని, బెంగళూరు, ఢిల్లీ, ముంబై నుంచి భారీ సంఖ్యలో ఆర్డర్లు వచ్చాయని బన్సాల్ వివరించారు.
విశాఖపట్టణం, నాగ్‌పూర్, ఇండోర్, కోయంబత్తూర్ వంటి టైర్ టూ నగరాల నుంచి కూడా డిమాండ్ బాగా పెరిగిందని పేర్కొన్నారు. అమ్ముడైన ఈ 5 లక్షల మొబైల్ ఫోన్లలో మూడో వంతు వాటా 4జీ మొబైల్ ఫోన్లదేనని తెలిపారు. పది గంటల్లో ఐదు లక్షల మొబైల్ ఫోన్లు అమ్ముడవడం,. భారత్‌లో స్మార్ట్‌ఫోన్లకు పెరుగుతున్న డిమాండ్‌ను సూచి స్తోందని చెప్పారు. కాగా ఈ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభం రోజున 10 గంటల్లో 10 లక్షల వస్తువులను విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది. 70 కేటగిరీల్లో 3 కోట్ల వస్తువులను ఆఫర్ చేస్తున్నామని, 5 కోట్ల మంది నమోదిత వినియోగదారులున్నారని, రోజుకు కోటికి పైగా విజిట్స్ వస్తున్నాయని కంపెనీ అంటోంది.