
వేళ్లను తుపాకీలా గురిపెట్టినందుకు సస్పెండ్ చేశారు!
సినిమాల్లో హీరో స్టైల్‌గా విలన్ తలకు తుపాకీ గురిపెట్టి పేల్చడం.. తర్వాత నోటితో పొగను ఉఫ్‌మంటూ ఊదడం.. లాంటి సన్నివేశాలను పిల్లలు సరదాగా అనుకరిస్తుంటారు.
కొలంబస్: సినిమాల్లో హీరో స్టైల్‌గా విలన్ తలకు తుపాకీ గురిపెట్టి పేల్చడం.. తర్వాత నోటితో పొగను ఉఫ్‌మంటూ ఊదడం.. లాంటి సన్నివేశాలను పిల్లలు సరదాగా అనుకరిస్తుంటారు. చేతివేళ్లను తుపాకీలా గురిపెట్టి పక్కవారిని కాల్చినట్లు నటించి సరదా తీర్చుకుంటుంటారు. అయితే అమెరికాలో ఐదో తరగతి చదువుతున్న ఓ పదేళ్ల విద్యార్థి తోటి విద్యార్థి తలకు చేతివేళ్లను గురిపెట్టి కాల్చేస్తానంటూ బెదిరించడంతో అతడిని స్కూలు ప్రిన్సిపల్ ఇటీవల మూడు రోజులపాటు సస్పెండ్ చేసేసింది! మిత్రుడితో జస్ట్ ఆడుకున్నానని, ‘ఉత్తుత్తి’గానే బెదిరించానని ఆ పిల్లాడు చెప్పినా.. ఆమె మాత్రం నిజంగానే బయటికి పంపేసింది.
ఓహియో రాష్ట్రం, కొలంబస్‌లోని డివోన్‌షైర్ ఆల్టర్‌నేటివ్ ఎలిమెంటరీ స్కూల్‌లో ఈ చిత్రం చోటుచేసుకుంది. పాఠశాలల్లో సైతం తరచూ ఉన్మాదుల తుపాకీ కాల్పుల ఘటనలతో అమెరికావాసులు ఉలిక్కిపడుతుండటం తెలిసిందే. దీనిపై కొలంబస్ జిల్లా అధికారులు స్పందిస్తూ.. స్కూల్లో ‘తుపాకీ ఆటలు’ మితిమీరుతుండటంతో ఇకపై ఎవరూ అలాంటి ఆటలు ఆడరాదంటూ రూల్స్ పెట్టారని, అవి అందరికీ తెలుసు కూడానని సెలవిచ్చారు. అయితే.. చిన్నపిల్లల మనస్తత్వంతో ఉన్న పెద్దలే ఇలాంటి చర్యలు చేపడతారని, స్కూలు ప్రిన్సిపల్ అత్యుత్సాహం ప్రదర్శించారని ఆ పిల్లాడి తండ్రి మాత్రం తీవ్రంగా మండిపడ్డాడట.