శ్రీనగర్ : కాశ్మీర్ షోపియాన్ జిల్లాలోని జమియా ట్రెంజ్ మసీదులో గురువారం గ్రేనెడ్ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 11 మంది గాయపడ్డారని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఉదయం మసీదులో ప్రార్థనలు ముగిసిన అనంతరం ఈ పేలుడు సంభవించిందని తెలిపారు. మసీదు ప్రాంగణంలో లోహ పదార్థంతో తయారు చేసిన వస్తువును స్థానికులు గుర్తించారు. దీంతో దానిని వెలికి తీసే క్రమంలో ఈ పేలుడు సంభవించిందని చెప్పారు.
ఇదిలా ఉండగా ఇదే ప్రాంతంలో బుధవారం గస్తీ తిరుగుతున్న భద్రత దళాలపైకి ఆగంతకులు గ్రేనెడ్ విసిరారు. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో పోలీసు ఉన్నతాధికారి, ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లుతో పాటు ఓ పౌరుడు ఉన్నారని ఉన్నతాధికారులు వివరించారు.