15వేల ఏళ్ల కిందటే కుక్కలు ఉన్నాయి!
మానవులకు మంచి విశ్వాసపాత్రులైన కుక్కల పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి? వీటి మూలాలు ఎక్కడ?.. ఈ అంశాలపై చాలా ఏళ్లుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు. కుక్కలు తోడేళ్ల నుంచి పరిణామం చెందాయనే విషయాన్ని చాలావరకు అంగీకరిస్తున్న శాస్త్రవేత్తలు వాటి మూలాల విషయంలోనే భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. యూరప్లో, తూర్పు దేశాలలో, సైబెరియాలో, దక్షిణ చైనాలో వీటి మూలాలు ఉన్నట్టు గతంలో భావించారు. తాజాగా విస్తృతంగా జరిగిన పరిశోధనల్లో కుక్కల జన్మస్థలం మధ్య ఆసియా అని తేలింది. నేపాల్, మంగోలియాలో వాటి మూలాలు ఉన్నట్టు గుర్తించారు. ఇవి 15 ఏళ్ల కిందటే భూమి మీద ఉనికిలోకి వచ్చాయని నిర్ధారించారు.
కార్నెల్ యూనివర్సిటీకి చెందిన లారా ఎం షనాన్, ఆడమ్ ఆర్ బాయ్కో అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం కుక్కలపై పెద్ద ఎత్తున పరిశోధనలు జరిపింది. కేవలం మేలుజాతి కుక్కలపైనే కాకుండా, వీధి కుక్కలు, పల్లె కుక్కలు.. ఇలా భూమిపై ఉన్న వందకోట్ల కుక్కలకు చెందిన వివిధ తెగలపై అధ్యయనం చేశారు. కుక్కలకు చెందిన విభిన్న జాతులు, తెగలకు చెందిన మూడు రకాల డీఎన్ఏలను షనాన్ విశ్లేషించారు. ఇందుకోసం భారత్తోపాటు 38 దేశాలకు చెందిన 549 పల్లె కుక్కలు, 161 జాతులకు చెందిన 4,500 కుక్కలపై అధ్యయనం చేశారు. తద్వారా జన్యుపరంగా తమ పూర్వీకులకు దగ్గరగా ఉన్న ఆధునిక కుక్కలు, వాటి భౌగోళిక ప్రాంతాన్ని అంచనా వేశారు.
మధ్య ఆసియా, ముఖ్యంగా నేపాల్, మంగోలియాలోని పూర్వీకుల నుంచి ప్రస్తుతమున్న అన్ని కుక్కలు వచ్చాయని తమ అధ్యయనంలో తేలిందని బాయ్కో తెలిపారు. అయితే శుకనాలు కచ్చితంగా ఎంతకాలం కిందట ఉనికిలోకి వచ్చాయో తెలియనప్పటికీ, సుమారు 15వేల సంవత్సరాల కిందట అవి ఆవిర్భవించి ఉంటాయని చెప్పారు. ఈ పరిశోధన అంశాలను అమెరికా నుంచి వెలువడుతున్న 'ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్' జర్నల్లో ప్రచురించారు.