
పట్టాలపై శవం.. పోలీసుల జగడం
పెంపుడు కుక్కను రైల్వే ట్రాక్ పైకి తీసుకెళ్లి దాని చావుకు కారణమయ్యాడని ఓ వ్యక్తిపై కేసు నమోదయిన సంఘటన ఇప్పుడు హైదరాబాద్లో చర్చనీయాంశమైంది. ఇక్కడిలా కుక్క కోసం హైరానా జరగగా.. రైల్వే ట్రాక్పై చనిపోయిన మనిషి విషయంలో మాత్రం తీవ్రంగా వాదులాడుకుని దాదాపు ఆరుగంటలపాటు శవాన్ని అలాగే వదిలేశారు ఘనత వహించిన పోలీసులు. ఆ సమయంలో ఆ శవం మీదుగా 17 రైళ్లు రాకపోకలు సాగించాయి. పోలీసుల తీరును, వ్యవస్థల మధ్య సమన్వయలోపాన్ని బయటపెట్టిన ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని క్విలా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
హౌరా నుంచి అమృత్సర్ ప్రయాణిస్తోన్న అకల్తక్త్ ఎక్స్ప్రెస్ రైలు.. బరేలీ జిల్లా కేంద్రానికి సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ప్రమాదం గురువారం ఉదయం ఆరు గంటలకు జరిగింది. ప్రమాదాన్ని గుర్తించిన రైలు డ్రైవర్.. బరేలీ స్టేషన్ మాస్టర్కు సమాచారం అందిచాడు. ఆ మాస్టర్.. జీఆర్పీఎఫ్ బలగాలను పురమాయించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న జీఆర్పీఎఫ్ సిబ్బంది శవాన్ని తొలగిద్దామనే అనుకున్నారు. కానీ..
ఎందుకొచ్చిన తలనొప్పిలే అనుకుని స్థానిక సివిల్ పోలీసులకు కబురుపెట్టారు. ట్రాక్ వద్దకు చేరుకున్న సివిల్ పోలీసులు.. 'శవం ట్రాక్ పైన ఉంది కదా.. దానిని మేమెలా స్వాధీనం చేసుకుంటాం? అని కొర్రీ వేశారు. నిజమే. ట్రాక్ నుంచి అటు 30 మీటర్లు, ఇటు 30 మీటర్లు (కొన్నిసార్లు ఈ కొలత మారుతూ ఉంటుంది) రైల్వే శాఖదే. అయితే శవాన్ని తీసుకెళ్లేందుకు తమ వద్ద సరంజామా సిద్ధంగా లేదని, మీరే ఎదో ఒకటి చెయ్యండని సివిల్ పోలీసుల్ని రైల్వే పోలీసులు అడిగారు. వాళ్లేమో 'మా ఉన్నతాధికారుల్ని అడిగి చెప్తాం' అన్నారు. ఇలా వీళ్లు జగడమాడుతుండగానే.. శవం పడి ఉన్న ట్రాక్పై నుంచి రైళ్లు వెళుతూ వస్తూనే ఉన్నాయి. దాదాపు ఆరు గంటలు.. అంటే మద్యాహ్నం పన్నెండు గంటల తర్వాత గానీ పంచాయితీ ఓ కొలిక్కిరాలేదు.
చివరికి క్విలా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆదేశాలతో యువకుడి శవాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్ట్మార్టం నిర్వహించారు. ఇప్పటికింకా ఆ యువకుడి ఆచూకీ తెలియరాలేదని, 72 గంటల్లోగా స్పందన రాకుంటే మున్సిపాలిటీ వారితో అంత్యక్రియలు నిర్వహిస్తామని ఇన్స్పెక్టర్ కమ్రూల్ హసన్ చెప్పారు.