టాటా మోటార్స్ నుంచి 2 కొత్త మోడళ్లు
న్యూఢిల్లీ: టాటా మోటార్స్ కంపెనీ సోమవారం రెండు కొత్త మోడళ్లను ఆవిష్కరించింది. వాహన మార్కెట్లో కోల్పోయిన ప్రాభవాన్ని తిరిగి పొందడం లక్ష్యంగా ఈ జెస్ట్(కాంపాక్ట్ సెడాన్) బోల్ట్(హ్యాచ్‌బ్యాక్)లను తెస్తోంది. వీటి విక్రయాలను ఈ ఏడాది ద్వితీయార్ధం నుంచి ప్రారంభిస్తామని పేర్కొంది. టాటా మోటార్స్ కొత్తగా డెవలప్ చేసిన రెవోట్రాన్ ఇంజిన్‌లతో ఈ రెండు కార్లు నడుస్తాయి. విస్టా, మాంజా కార్లు తయారైన ఎక్స్1 ప్లాట్‌ఫామ్‌ను మరింత మెరుగుపరచి ఈ కార్లను అందిస్తున్నామని టాటా మోటార్స్ ప్రెసిడెంట్ (ప్యాసింజర్ వెహికల్స్) రంజిత్ యాదవ్ చెప్పారు. భారత్, ఇంగ్లండ్, కొరియా ఇంజనీర్లు అంతర్జాతీయ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ కార్లను డిజైన్ చేశారని వివరించారు. ఈ రెండు కార్లతో మార్కెట్ వాటా మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇండికా, ఇండిగోలు పటిష్టమై బ్రాండ్లని, వీటి అమ్మకాలను కొనసాగిస్తామని, వీటిని మార్కెట్ నుంచి ఉపసంహరింబోమని ఆయన స్పష్టం చేశారు. టాటా మోటార్స్, ఫోర్డ్ ఇండియా కొత్త మోడళ్ల ఆవిష్కరణతో కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో పోటీ వేడెక్కుతోంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10లో కాంపాక్ట్ సెడాన్‌ను నేడు(మంగళవారం) ప్రవేశపెట్టనుంది. వీటితో మారుతీ సుజుకి డిజైర్, హోండా అమేజ్ కార్లకు గట్టి పోటీ ఎదురవుతుందనేది పరిశ్రమ వర్గాల అంచనా.
జెస్ట్ కారు పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో... బోల్ట్ పెట్రోల్ ఇంజిన్‌తో లభ్యమవుతాయి.
జెస్ట్ డీజిల్ వేరియంట్ ఎఫ్-ట్రానిక్ 90 పీఎస్ పవర్‌డ్ ఇంజిన్‌తో రూపొందించారు.
ఎలక్ట్రానిక్ పవర్ అసిస్టెట్ సిస్టమ్(ఈపాస్) వంటి కొత్త ఫీచర్లతో ఈ రెండు కార్లను డెవలప్
చేశామని టాటా మోటార్స్ పేర్కొంది. జెస్ట్, బోల్ట్ రెండు కార్లలలో 5 అంగుళాల టచ్‌స్క్రీన్,
బ్లూటూత్ టెక్నాలజీ, స్మార్ట్ వాయిస్ రికగ్నిషన్, స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్, టచ్‌ఫోన్
నియంత్రిత ఇంటర్‌ఫేస్ తదితర ఫీచర్లున్నాయి.
జెస్ట్ కాంపాక్ట్ సెడాన్‌లో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, డే టైమ్ రన్నింగ్ లైట్స్, 15 అంగుళాల
అలాయ్ వీల్స్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.