ఈజిప్ట్‌లో 2వేల మంది ఊచకోత
కైరో: ఈజిప్ట్‌లో దశాబ్దాల నిరంకుశ పాలనకు చరమగీతం పాడిన ‘అరబ్ వసంతం’ వాడిపోతోంది. హోస్నీ ముబారక్ శకం ముగిసిన తర్వాత ప్రజాస్వామ్యయుతంగా అధ్యక్షుడిగా ఎన్నికై, సైన్యం చేతిలో పదవీచ్యుతుడైన మహమ్మద్ మోర్సి మద్దతుదారులకు.. సైన్యం ఏర్పాటు చేసిన కొత్త ప్రభుత్వానికి మధ్య పోరు తారస్థాయి చేరింది. మోర్సి మద్దతుదారుల ఆందోళన శిబిరాలపై బుధవారం ఉక్కుపాదం మోపిన ‘ఆర్మీ’ ప్రభుత్వం.. వందలాది మందిని ఊచకోత కోసింది. ఆర్మీ వాహనాలు, బుల్‌డోజర్లు, హెలికాప్టర్లు, టియర్‌గ్యాస్‌తో విరుచుకుపడింది. శిబిరాల్లోని వారిపై విచ్చలవిడిగా కాల్పులు జరిపింది.
ఈ దాడిలో 2,200 మంది వరకూ మరణించారని, దాదాపు 10 వేల మంది గాయపడ్డారని మోర్సికి చెందిన ముస్లిం బ్రదర్‌హుడ్ పార్టీ పేర్కొనగా... ‘ఆర్మీ’ ప్రభుత్వం మాత్రం 525 మంది వరకూ మరణించారని ప్రకటించింది. మోర్సి ప్రభుత్వంపై వ్యతిరేకత, ఆందోళనల నేపథ్యంలో జూలై 3న సైన్యం ఆయన ప్రభుత్వాన్ని కూల్చేసి, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఆయన మద్దతుదారులు, ముస్లిం బ్రదర్‌హుడ్ నేతలు, కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. రాజధాని కైరో శివార్లలోని రాబా అల్‌అదవేయా, అల్‌నహ్దా ప్రాంతాల్లో వేలాది మంది గుమిగూడి ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘ఆర్మీ’ తాత్కాలిక ప్రభుత్వం బుధవారం నుంచి దేశంలో అత్యవసర పరిస్థితిని విధించింది. చాలా నగరాల్లో కర్ఫ్యూ ప్రకటించింది.
అనంతరం ఆందోళనకారుల శిబిరాలపై సైన్యంతో దాడి చేసింది. ఈ అత్యవసర పరిస్థితి ప్రకటన, ఆందోళనకారులపై దాడి నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ.. ఉపాధ్యక్షుడు ఎల్‌బరాదీ రాజీనామా చేయడం గమనార్హం. ఈ ఘటనల్లో బ్రిటన్, దుబాయ్‌కు చెందిన ముగ్గురు జర్నలిస్టులు కూడా మరణించారు. కాగా, ఈ దాడిని సైన్యం ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వంలో ప్రధానమంత్రి హాజెమ్ ఎల్‌బబ్లావీ సమర్థించుకున్నారు. ‘‘ఆందోళనకారులు ఆస్పత్రులు, పోలీస్‌స్టేషన్లపై కూడా దాడికి దిగారు. పరిస్థితిని అదుపుచేయడానికే సైన్యాన్ని ప్రయోగించాం’’ అని పేర్కొన్నారు. మరోవైపు తమ ఆందోళనలు కొనసాగుతాయని ముస్లిం బ్రదర్‌హుడ్ ప్రకటించింది. ‘‘‘ఆర్మీ’ ప్రభుత్వం ఎన్ని కుటిల యత్నాలు చేసినా మేం వెనక్కి తగ్గం. మిలటరీ పాలనను అంతం చేసేవరకూ పోరాడుతాం’’ అని ముస్లిం బ్రదర్‌హుడ్ ప్రతినిధి గెహద ఎల్ హడ్డాడ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
మరో 30 రోజుల పాటు మోర్సి నిర్బంధం: పదవీచ్యుతుడైన అధ్యక్షుడు మోర్సి నిర్బంధాన్ని మరో 30 రోజుల పాటు పొడిగిస్తూ కైరోలోని ఓ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముబారక్‌ను గద్దె దించేందుకు నిర్వహించిన ఆందోళనల సమయంలో పోలీస్‌స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలపై దాడులను మోర్సి ప్రోత్సహించారని, ఉగ్రవాద సంస్థ హమాస్‌తో ఆయనకు సంబంధం ఉందనే ఆరోపణలపై మోర్సిని ‘ఆర్మీ’ ప్రభుత్వం అరెస్టు చేసింది.
మరోవైపు పాలస్తీనా కేంద్రంగా కొనసాగే హమాస్ సంస్థ మోర్సి మద్దతుదారుల ఆందోళనలకు తోడ్పడుతోందని, ఈ మేరకు భద్రతా కారణాల రీత్యా పాలస్తీనాతో ఉన్న గాజా సరిహద్దులను మూసివేస్తున్నామని సైన్యం ప్రకటించింది. ఊచకోత ఘటనపై ప్రపంచవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. ఇది అత్యంత దుర్మార్గమైన చర్య అని యూరోపియన్ యూనియన్, బ్రిటన్, ఇరాన్, ఖతార్ తదితర దేశాలు మండిపడ్డాయి. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి వెంటనే సమావేశమై చర్చించాలని, తగిన చర్యలు చేపట్టాలని టర్కీ ప్రధానమంత్రి తయిప్ ఎర్డొగన్ విజ్ఞప్తి చేశారు. ఈజిప్ట్‌లో మరోసారి అంతర్యుద్ధం తలెత్తే ప్రమాదం ఉందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలాండ్ పేర్కొన్నారు. ఆందోళనకారులపై ఈజిప్ట్ సైనిక ప్రభుత్వం జరిపిన మారణకాండపై అమెరికా నిరసన వ్యక్తం చేసింది. ఆ దేశంతో తాము నిర్వహించనున్న ఉమ్మడి మిలటరీ విన్యాసాలను రద్దు చేసుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటించారు.