Hosni Mubarak
-
హోస్నీ ముబారక్ కన్నుమూత
కైరో: ఈజిప్టు మాజీ అధ్యక్షుడు, సుమారు 30 ఏళ్లపాటు మధ్యప్రాచ్యంలో శాంతి, సుస్థిరతలకు ప్రతీకగా చెప్పుకునే నేత హోస్నీ ముబారక్ (91) మంగళవారం మరణించారు. ఆయన ఆరోగ్య సమస్యల కారణంగా మరణించినట్లు ఈజిప్టు టెలివిజన్ ప్రకటించింది. అధ్యక్షుడిగా ఉన్నంత కాలం అమెరికాకు సన్నిహితుడిగా మెలిగారు. అయితే 2011లో ఈజిప్టు యువత సుమారు 18 రోజుల పాటు కైరోలోని సెంట్రల్ తహ్రీర్ స్క్వేర్‌లో జరిపిన ఆందోళనల కారణంగా మిలటరీ వర్గాలు హోస్నీ ముబారక్‌తో బలవంతంగా రాజీనామా చేయించాయి. ఈజిప్ట్ చరిత్రలోనే మొదటిసారి ఒక అధ్యక్షుడిని పదవీచ్యుతుడిని చేయడమే కాకుండా జైల్లో పెట్టడం ముబారక్ విషయంలోనే జరిగింది. అరబ్ స్పింగ్ ఆందోళన సమయంలో 900 మంది ఆందోళనకారుల మరణాలను నిలువరించడంలో విఫలమయ్యారన్న ఆరోపణలపై న్యాయస్థానాలు 2012 జూన్‌లో ముబారక్‌ను దోషిగా నిర్ధారించి యావజ్జీవ జైలుశిక్ష విధించాయి. అయితే ఈజిప్టు ఉన్నత న్యాయస్థానం 2014లో వీరిద్దరినీ నిర్దోషులుగా విడుదల చేసింది. -
మాజీ అధ్యక్షుడికి మూడేళ్ల జైలుశిక్ష
ఈజిప్టు మాజీ అధ్యక్షుడు హోస్నీ ముబారక్‌కు మూడేళ్ల జైలుశిక్ష పడింది. దాదాపు 90 కోట్ల రూపాయల మేర ఆయన అక్రమాలకు పాల్పడినట్లు అక్కడి కోర్టు తేల్చింది. తన అధికారిక భవనాలను పునరుద్ధరించుకోడానికి ఈ డబ్బు ఖర్చుపెట్టినట్లుగా ఆయన చూపించారు. అయితే ఈ క్రమంలో అవినీతికి పాల్పడినట్లు తేలడంతో ముబరాక్కు మూడేళ్ల జైలుశిక్ష విధించారు. ఇవే ఆరోపణలపై ముబారక్ ఇద్దరు కుమారులకు నాలుగేసి ఏళ్ల జైలుశిక్ష పడింది. నాలుగేళ్ల క్రితం ఈజిప్టులో వచ్చిన విప్లవం ఫలితంగా ముబారక్ ఈజిప్టు అధ్యక్ష పదవి కోల్పోవాల్సి వచ్చింది. -
జైల్లోంచి విడుదల కానున్న ముబారక్!
కైరో: ఈజిప్టు మాజీ అధ్యక్షుడు హోస్నీ ముబారక్ త్వరలో జైలు నుంచి విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆయన పదవీచ్యుతుడైన తర్వాత నమోదైన ఈ అవినీతి కేసు విచారణ సరిగా జరగలేదని గుర్తించిన ఆ దేశ ఉన్నత న్యాయస్థానం... దానిపై పునర్విచారణ చేపట్టాలని ఆదేశించింది. ఈజిప్టును మూడు దశాబ్దాల పాటు పాలించిన నియంత హోస్నీ ముబారక్ తన పాలనా సమయంలో దాదాపు రూ. 90 కోట్ల ప్రభుత్వ నిధులను తన అవసరాలకు వాడుకున్నారనే ఆరోపణలపై గత మేలో మూడేళ్ల కారాగార శిక్ష పడింది. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. ఈ కేసు పునర్విచారణ నేపథ్యంలో ముబారక్ శనివారం విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. -
హోస్నీ ముబారక్‌కు మూడేళ్ల జైలు
కైరో: ఈజిప్టు పదవీచ్యుత అధ్యక్షుడు హోస్నీ ముబారక్(86)కు భారీ ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో ఇక్కడి క్రిమినల్ కోర్టు బుధవారం మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఆయన ఇద్దరు తనయులు అలా, గమాల్ను కూడా దోషులుగా తేల్చి నాలుగేళ్ల జైలుశిక్ష వేసింది. అధ్యక్ష భవన నవీకరణకు ఉద్దేశించిన 1.79 కోట్ల డాలర్లను వీరు కాజేశారని నిర్ధారించిన కోర్టు 1.76 కోట్ల డాలర్ల జరిమానా విధించింది. 29 లక్షల డాలర్లను ప్రభుత్వ ఖజనాకు తిరిగి చెల్లించాలని ఆదేశించింది. -
చరిత్రపై నెత్తుటి చేవ్రాలు ‘బ్రదర్హుడ్’
ఇదొక ప్రపంచ సమస్య. అల్‌కాయిదా సమస్యను మించినది. ప్రభుత్వాలతో విభేదిస్తూనే 80 ఏళ్లుగా మనుగడ సాగిస్తున్న సంస్థ ముస్లిం బ్రదర్హుడ్. పిరమిడ్లలో ఉన్న మమ్మీలు కూడా ఈజిప్ట్ వర్తమాన సన్నివేశాలను చూసి నవ్వుకుంటాయనిపిస్తుంది. మధ్యయుగాల నాటి ఎన్ని దురంతాలను గుర్తుకు తెచ్చుకుందో నైలు నది! ఒకరకం మౌఢ్యానికి పరాకాష్ట అనిపించే ఆ ఐదురోజులలో (ఈ నెల 14 నుంచి) ఈజి ప్ట్లో జరిగిన రక్తపాతాన్ని చూసి ప్రపంచం విస్తుపోకుండా ఉండటం సాధ్యంకాదు. 900 మంది ఆ హింసాకాండలో ప్రాణాలు కోల్పోయారు. తమ పురాతన నాగరికతా చిహ్నాలనీ, చారిత్రక సాక్ష్యాలనీ కూడా మతోన్మాదంతో ఊగిపోతున్న యువకులు ధ్వంసం చేస్తున్నారు. ఈజిప్ట్ రాజధాని కైరోకు మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న మిన్యా పురావస్తు ప్రదర్శనశాల నుంచి దాదాపు వేయి కళాఖండాలను ఉన్మాదులు దోచుకుపోయారు. ఇంతకాలం భద్రంగా ఉన్న మమ్మీలను ధ్వంసం చేశారు. 2011లో హోస్నీ ముబారక్ హయాంలో ప్రారంభమైన విధ్వం సకాండకీ, ఇప్పటికీ కొంచెం తేడా ఉంది. అప్పుడు రెండు లక్షల అపురూపు గ్రంథాలను ఛాందసం నెత్తికెక్కిన విధ్వంసకారులు ధ్వం సం చేశారు. ఇప్పుడు కళాఖండాలనూ, అవశేషాలనూ నాశనం చేస్తున్నారు. ఈ రెండేళ్లలోనే ఈజిప్ట్ సాంస్కృతికంగా, సామాజికం గా తన మౌలికతను చాలా నాశనం చేసుకుం ది. ‘ముస్లిం బ్రదర్హుడ్’ నిర్వాకం ఇది. 2005లో ఈజిప్ట్ అధ్యక్షునిగా హోస్నీ ముబారక్ ఉన్న కాలంలో ప్రధానస్రవంతి రాజకీయాలను ప్రభావితం చేయడానికి వచ్చి న అవకాశాన్ని బ్రదర్హుడ్ అందిపుచ్చుకుం ది. కానీ 2013 లోనే పతనదశకు చేరుకుంది కూడా. అరబ్ దేశాలతో పాటు ఇప్పటికీ చాలా దేశాలలో వేళ్లూనికుని ఉన్న బ్రదర్హుడ్ 1928, మార్చిలో ఈజిప్ట్‌లోని ఇస్మాలియా అనే చోట రూపుదాల్చింది. పండితుడు, ఉపాధ్యాయుడు హసన్ అల్ బన్నా దీని స్థాపకుడు. సూయెజ్ కాలువ పనిలో ఉన్న ఆరుగురు శ్రామికులతో మొదలైన బ్రదర్హుడ్ ఎంతో వేగంగా విస్తరించి రెండో ప్రపంచయుద్ధం ముగిసేనాటికి రెండు లక్షల మంది సభ్యులను ఆకర్షించింది. 1948 నాటికి పలు దేశాలలో రెండువేల శాఖలతో, ఐదులక్షల మంది సభ్యులతో బలపడింది. బ్రదర్హుడ్ తన వ్యతిరేకులను నిర్మూలిస్తుందని మొదటి నుం చి ఆరోపణలు ఉన్నాయి. 1948 నాటి ఈజిప్ట్ అధ్యక్షుడు మహ్మద్ ఫాహిం అన్నూ క్రిషిపాషా హత్య వెనుక ఈ సంస్థ ప్రమేయం ఉం దని ఆరోపణలు ఉన్నాయి. ఆ సంవత్సరంలోనే ఇది నిషేధానికి గురైంది. ఈజిప్ట్ ప్రభుత్వంతో బ్రదర్‌హుడ్‌కు ఎక్కువ కాలం సంఘర్షణే కనిపిస్తుంది. అబ్దుల్ నాసర్ (1954) ఈ సం స్థను అదుపులో పెట్టే ప్రయత్నం చేశాడు. ఈ ఆటుపోట్లతో 1970లో ఈ సంస్థ హింసాకాండను వీడి, రాజకీయపార్టీ అవతారం ఎత్తాలని అనుకుంది. కానీ ఎన్నికలలో పోటీ చేయడానికి అప్పటికే అర్హత కోల్పోయింది. దీనితో దీని సభ్యులు ఇండిపెండెంట్లుగా పోటీ చేసేవారు. అలా మొదలైన ఎన్నికల ప్రయాణం 2005 నాటికి 88 స్థానాల దాకా చేరింది. 2011లో ముబారక్‌ను పదవీచ్యుతుని చేయడంలో బ్రదర్హుడ్ కీలకపాత్ర వహించి, చట్టబద్ధత సాధించింది. ఈ ‘విప్లవం’లోనే బ్రదర్‌హుడ్‌కు సైన్యం మద్దతు పలికింది. ఎన్నికలలో పోటీ చేసే వీలులేకపోవడంతో అనుబంధంగా ఫ్రీడమ్ అండ్ జస్టిస్ పార్టీని ఏర్పాటు చేసింది. దీని అధ్యక్షుడే మహ్మద్ మొర్సీ. 2000-2005 మధ్య పార్లమెంట్ సభ్యుడు. 2012 అధ్యక్ష ఎన్నికలలో బ్రదర్హుడ్, ఫ్రీడమ్ అండ్ జస్టిస్ పార్టీ అభ్యర్థిగా అధ్యక్ష ఎన్నికలలో ఇతడే పోటీ చేశాడు. ఓటర్లలో అరవైశాతం మొర్సీకే ఓటేశారు. 508 స్థానాలు ఉన్న పార్లమెంటులో మొర్సీ పార్టీ, ఈ పార్టీ మద్దతు ఉన్న వారు 235 మంది గెలిచారు. ఇంత మద్దతు ఉన్నా కేవలం జూన్ 30, 2012 నుంచి జూలై 3, 2013 వరకు మాత్రమే పాలించాడు. హద్దుల్లేని అధికారాలు చేజిక్కిం చుకోవడంతో సంక్షోభం ఏర్పడింది. సైన్యం నాయకత్వంలో తాత్కాలిక సైనిక ప్రభుత్వం ఏర్పాటైంది. ఇప్పుడు జరుగుతున్న హింసాకాండ ఆ ప్రభుత్వం పుణ్యమే. ఈజిప్ట్‌లో మైనారిటీగా ఉన్న క్రైస్తవులపై దాడులతో బ్రదర్హుడ్ పూర్తిగా అప్రతిష్టపాలైంది. ఉదారవాదులపై కక్ష కట్టడం మరొక అంశం. అయితే తాత్కాలిక ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం సులభం కాదు. బ్రదర్హుడ్ రకరకాల పేర్లతో బహ్రెయిన్, సిరియా, జోర్డాన్, ఇరాన్, ఇరాక్, పాలస్తీనా, సౌదీ అరేబియా, కువైట్, యొమెన్, కెన్యా (బరాక్ ఒబామా సవతి సోదరుడు మాలిక్ ఒబామాకు దీనితో సంబంధాలు ఉన్నాయని చెబుతారు), అల్జీరియా, సూడాన్, సోమాలియా, ట్యునిషి యా, లిబియా, మారిటేనియా, రష్యా (2003 లో నిషేధించారు), అమెరికా, బ్రిటన్, ఇండోనేషియా, భారత ఉపఖండం (అబ్దుల్ అలా మౌదుది 1941లో లాహోర్‌లో స్థాపించిన జమాతె ఎ ఇస్లాం అదే)లో పనిచేస్తున్నది. అంటే ఇదొక ప్రపంచ సమస్య. అల్‌కాయిదా సమస్యను మించినది. ప్రభుత్వాలతో విభేదిస్తూనే 80 ఏళ్లుగా మనుగడ సాగిస్తున్న సం స్థ ఇది. అయినా ప్రపంచంలో కొన్నిచోట్ల ప్ర భుత్వాలు ఇప్పటికీ ఉగ్రవాద సంస్థలను పోషిస్తున్నాయి. అందుకే మమ్మీలకు నవ్వు తెప్పిం చే పరిణామాలే ఇప్పుడు ఎక్కువ. - డా॥గోపరాజు నారాయణరావు -
బ్రదర్హుడ్ పార్టీ అగ్రనేత అరెస్ట్
ఈజిప్టు రాజధాని కైరోలో ముస్లిం బ్రదర్హుడ్ పార్టీ అగ్రనేత మహ్మద్ బడీని అరెస్ట్ చేసినట్లు స్థానిక మీడియా ఎమ్ఈఎన్ఏ మంగళవారం ఇక్కడ వెల్లడించింది. ఆయనతోపాటు ఆ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న ఇద్దరు సభ్యులు యూసఫ్ తలత్త్, హస్సన్ మాలిక్‌లను కూడా ఆదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. సోమవారం సాయంత్రం కైరోలోని నాసర్ నగరంలోని టైరన్ విధిలో మహ్మద్ బడీ నివాసంలో వారిని అరెస్ట్ చేసినట్లు వివరించారు. వారందరిని భద్రతా కారణాల రీత్యా తొరహ్ కారాగారానికి తరలించినట్లు తెలిపారు. ఈజిప్టు అధ్యక్ష పదవి నుంచి మహ్మద్ మొర్సీ పదవీచ్యుతుడయ్యారు. మొర్సిని తిరిగి అధికార పీఠంపై కూర్చొబెట్టేందుకు ముస్లిం బ్రదర్హుడ్ పార్టీ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ నేపథ్యంలో మొర్సి మద్దతుదారులకు, వ్యతిరేకదారులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆ ఘర్షణలో వేలాది మంది ఆశువులు బాసిన సంగతి తెలిసిందే. దాంతో ఆ పార్టీ అగ్రనేతలను అరెస్ట్ చేయాలని ప్రస్తుత ప్రాసిక్యూటర్ జనరల్ అహ్మద్ ఈజీ ఈల్ దిన్ ఉత్తర్వులు జారీ చేశారు. ముస్లిం బ్రదర్హుడ్ అగ్రనేతలను తరలించిన జైలుల్లోనే ఈజిప్టు మాజీ అధ్యక్షుడు ముబారక్‌తోపాటు ఆయన కుమారులు ఇద్దరు ఖైదీలుగా ఉన్న సంగతి తెలసిందే. -
త్వరలో హోస్నీ ముబారక్ విడుదల: న్యాయవాది
ఈజిప్టు మాజీ అధ్యక్షుడు హోస్నీ ముబారక్ వారం రోజుల్లోగా జైలు నుంచి విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆయనపై ఉన్న చిట్టచివరి అవినీతి కేసు రాబోయే రెండు రోజుల్లో తేలిపోతుందని, అందువల్ల ఆయన విడుదల కావచ్చని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. కేవలం పాలనాపరమైన కొన్ని అంశాలు మాత్రం మిగిలిపోయాయని, అవి పూర్తి చేయగానే ఆయన విడుదలవుతారని న్యాయవాది ఫరీద్ అల్ దీబ్ చెప్పినట్లు సిన్హువా వార్తా సంస్థ తెలిపింది. అధికార దుర్వినియోగం, సమాచార శాఖ మంత్రి నుంచి బహుమతులు తీసుకోవడం వంటి నేరాలు ముబారక్‌పై ఉన్నాయి. ఆ బహుమతుల విలువకు తగిన మొత్తాన్ని ఆయన తిరిగి చెల్లిస్తారని న్యాయవాది చెప్పారు. అధ్యక్ష భవనాల నిర్వహణకు కేటాయించిన సొమ్మును దోచుకున్నారని కూడా ముబారక్‌పై ఆరోపణలున్నాయి. ఇప్పటికే ముబారక్ నిర్బంధం సమయం ముగిసినట్లు అలీ మాషల్లా అనే న్యాయ నిపుణుడు తెలిపారు. అయితే, చిట్టచివరి అవినీతి కేసు ఇంకా తేలకపోతే మాత్రం ముబారక్ మరో 45 రోజులు జైల్లోనే ఉండాల్సి వచ్చే అవకాశం ఉందన్నారు. -
ఈజిప్ట్‌లో 2వేల మంది ఊచకోత
కైరో: ఈజిప్ట్‌లో దశాబ్దాల నిరంకుశ పాలనకు చరమగీతం పాడిన ‘అరబ్ వసంతం’ వాడిపోతోంది. హోస్నీ ముబారక్ శకం ముగిసిన తర్వాత ప్రజాస్వామ్యయుతంగా అధ్యక్షుడిగా ఎన్నికై, సైన్యం చేతిలో పదవీచ్యుతుడైన మహమ్మద్ మోర్సి మద్దతుదారులకు.. సైన్యం ఏర్పాటు చేసిన కొత్త ప్రభుత్వానికి మధ్య పోరు తారస్థాయి చేరింది. మోర్సి మద్దతుదారుల ఆందోళన శిబిరాలపై బుధవారం ఉక్కుపాదం మోపిన ‘ఆర్మీ’ ప్రభుత్వం.. వందలాది మందిని ఊచకోత కోసింది. ఆర్మీ వాహనాలు, బుల్డోజర్లు, హెలికాప్టర్లు, టియర్‌గ్యాస్‌తో విరుచుకుపడింది. శిబిరాల్లోని వారిపై విచ్చలవిడిగా కాల్పులు జరిపింది. ఈ దాడిలో 2,200 మంది వరకూ మరణించారని, దాదాపు 10 వేల మంది గాయపడ్డారని మోర్సికి చెందిన ముస్లిం బ్రదర్హుడ్ పార్టీ పేర్కొనగా... ‘ఆర్మీ’ ప్రభుత్వం మాత్రం 525 మంది వరకూ మరణించారని ప్రకటించింది. మోర్సి ప్రభుత్వంపై వ్యతిరేకత, ఆందోళనల నేపథ్యంలో జూలై 3న సైన్యం ఆయన ప్రభుత్వాన్ని కూల్చేసి, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఆయన మద్దతుదారులు, ముస్లిం బ్రదర్హుడ్ నేతలు, కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. రాజధాని కైరో శివార్లలోని రాబా అల్అదవేయా, అల్నహ్దా ప్రాంతాల్లో వేలాది మంది గుమిగూడి ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘ఆర్మీ’ తాత్కాలిక ప్రభుత్వం బుధవారం నుంచి దేశంలో అత్యవసర పరిస్థితిని విధించింది. చాలా నగరాల్లో కర్ఫ్యూ ప్రకటించింది. అనంతరం ఆందోళనకారుల శిబిరాలపై సైన్యంతో దాడి చేసింది. ఈ అత్యవసర పరిస్థితి ప్రకటన, ఆందోళనకారులపై దాడి నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ.. ఉపాధ్యక్షుడు ఎల్‌బరాదీ రాజీనామా చేయడం గమనార్హం. ఈ ఘటనల్లో బ్రిటన్, దుబాయ్‌కు చెందిన ముగ్గురు జర్నలిస్టులు కూడా మరణించారు. కాగా, ఈ దాడిని సైన్యం ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వంలో ప్రధానమంత్రి హాజెమ్ ఎల్బబ్లావీ సమర్థించుకున్నారు. ‘‘ఆందోళనకారులు ఆస్పత్రులు, పోలీస్స్టేషన్లపై కూడా దాడికి దిగారు. పరిస్థితిని అదుపుచేయడానికే సైన్యాన్ని ప్రయోగించాం’’ అని పేర్కొన్నారు. మరోవైపు తమ ఆందోళనలు కొనసాగుతాయని ముస్లిం బ్రదర్హుడ్ ప్రకటించింది. ‘‘‘ఆర్మీ’ ప్రభుత్వం ఎన్ని కుటిల యత్నాలు చేసినా మేం వెనక్కి తగ్గం. మిలటరీ పాలనను అంతం చేసేవరకూ పోరాడుతాం’’ అని ముస్లిం బ్రదర్హుడ్ ప్రతినిధి గెహద ఎల్ హడ్డాడ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. మరో 30 రోజుల పాటు మోర్సి నిర్బంధం: పదవీచ్యుతుడైన అధ్యక్షుడు మోర్సి నిర్బంధాన్ని మరో 30 రోజుల పాటు పొడిగిస్తూ కైరోలోని ఓ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముబారక్‌ను గద్దె దించేందుకు నిర్వహించిన ఆందోళనల సమయంలో పోలీస్స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలపై దాడులను మోర్సి ప్రోత్సహించారని, ఉగ్రవాద సంస్థ హమాస్‌తో ఆయనకు సంబంధం ఉందనే ఆరోపణలపై మోర్సిని ‘ఆర్మీ’ ప్రభుత్వం అరెస్టు చేసింది. మరోవైపు పాలస్తీనా కేంద్రంగా కొనసాగే హమాస్ సంస్థ మోర్సి మద్దతుదారుల ఆందోళనలకు తోడ్పడుతోందని, ఈ మేరకు భద్రతా కారణాల రీత్యా పాలస్తీనాతో ఉన్న గాజా సరిహద్దులను మూసివేస్తున్నామని సైన్యం ప్రకటించింది. ఊచకోత ఘటనపై ప్రపంచవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. ఇది అత్యంత దుర్మార్గమైన చర్య అని యూరోపియన్ యూనియన్, బ్రిటన్, ఇరాన్, ఖతార్ తదితర దేశాలు మండిపడ్డాయి. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి వెంటనే సమావేశమై చర్చించాలని, తగిన చర్యలు చేపట్టాలని టర్కీ ప్రధానమంత్రి తయిప్ ఎర్డొగన్ విజ్ఞప్తి చేశారు. ఈజిప్ట్‌లో మరోసారి అంతర్యుద్ధం తలెత్తే ప్రమాదం ఉందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలాండ్ పేర్కొన్నారు. ఆందోళనకారులపై ఈజిప్ట్ సైనిక ప్రభుత్వం జరిపిన మారణకాండపై అమెరికా నిరసన వ్యక్తం చేసింది. ఆ దేశంతో తాము నిర్వహించనున్న ఉమ్మడి మిలటరీ విన్యాసాలను రద్దు చేసుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటించారు.