
కైరో: ఈజిప్టు మాజీ అధ్యక్షుడు, సుమారు 30 ఏళ్లపాటు మధ్యప్రాచ్యంలో శాంతి, సుస్థిరతలకు ప్రతీకగా చెప్పుకునే నేత హోస్నీ ముబారక్ (91) మంగళవారం మరణించారు. ఆయన ఆరోగ్య సమస్యల కారణంగా మరణించినట్లు ఈజిప్టు టెలివిజన్ ప్రకటించింది. అధ్యక్షుడిగా ఉన్నంత కాలం అమెరికాకు సన్నిహితుడిగా మెలిగారు. అయితే 2011లో ఈజిప్టు యువత సుమారు 18 రోజుల పాటు కైరోలోని సెంట్రల్ తహ్రీర్ స్క్వేర్‌లో జరిపిన ఆందోళనల కారణంగా మిలటరీ వర్గాలు హోస్నీ ముబారక్‌తో బలవంతంగా రాజీనామా చేయించాయి.
ఈజిప్ట్ చరిత్రలోనే మొదటిసారి ఒక అధ్యక్షుడిని పదవీచ్యుతుడిని చేయడమే కాకుండా జైల్లో పెట్టడం ముబారక్ విషయంలోనే జరిగింది. అరబ్ స్పింగ్ ఆందోళన సమయంలో 900 మంది ఆందోళనకారుల మరణాలను నిలువరించడంలో విఫలమయ్యారన్న ఆరోపణలపై న్యాయస్థానాలు 2012 జూన్‌లో ముబారక్‌ను దోషిగా నిర్ధారించి యావజ్జీవ జైలుశిక్ష విధించాయి. అయితే ఈజిప్టు ఉన్నత న్యాయస్థానం 2014లో వీరిద్దరినీ నిర్దోషులుగా విడుదల చేసింది.