ఈజిప్టు రాజధాని కైరోలో ముస్లిం బ్రదర్హుడ్ పార్టీ అగ్రనేత మహ్మద్ బడీని అరెస్ట్ చేసినట్లు స్థానిక మీడియా ఎమ్ఈఎన్ఏ మంగళవారం ఇక్కడ వెల్లడించింది. ఆయనతోపాటు ఆ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న ఇద్దరు సభ్యులు యూసఫ్ తలత్త్, హస్సన్ మాలిక్లను కూడా ఆదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. సోమవారం సాయంత్రం కైరోలోని నాసర్ నగరంలోని టైరన్ విధిలో మహ్మద్ బడీ నివాసంలో వారిని అరెస్ట్ చేసినట్లు వివరించారు.
వారందరిని భద్రతా కారణాల రీత్యా తొరహ్ కారాగారానికి తరలించినట్లు తెలిపారు. ఈజిప్టు అధ్యక్ష పదవి నుంచి మహ్మద్ మొర్సీ పదవీచ్యుతుడయ్యారు. మొర్సిని తిరిగి అధికార పీఠంపై కూర్చొబెట్టేందుకు ముస్లిం బ్రదర్హుడ్ పార్టీ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ నేపథ్యంలో మొర్సి మద్దతుదారులకు, వ్యతిరేకదారులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
ఆ ఘర్షణలో వేలాది మంది ఆశువులు బాసిన సంగతి తెలిసిందే. దాంతో ఆ పార్టీ అగ్రనేతలను అరెస్ట్ చేయాలని ప్రస్తుత ప్రాసిక్యూటర్ జనరల్ అహ్మద్ ఈజీ ఈల్ దిన్ ఉత్తర్వులు జారీ చేశారు. ముస్లిం బ్రదర్హుడ్ అగ్రనేతలను తరలించిన జైలుల్లోనే ఈజిప్టు మాజీ అధ్యక్షుడు ముబారక్తోపాటు ఆయన కుమారులు ఇద్దరు ఖైదీలుగా ఉన్న సంగతి తెలసిందే.