త్వరలో హోస్నీ ముబారక్ విడుదల: న్యాయవాది
ఈజిప్టు మాజీ అధ్యక్షుడు హోస్నీ ముబారక్ వారం రోజుల్లోగా జైలు నుంచి విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆయనపై ఉన్న చిట్టచివరి అవినీతి కేసు రాబోయే రెండు రోజుల్లో తేలిపోతుందని, అందువల్ల ఆయన విడుదల కావచ్చని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. కేవలం పాలనాపరమైన కొన్ని అంశాలు మాత్రం మిగిలిపోయాయని, అవి పూర్తి చేయగానే ఆయన విడుదలవుతారని న్యాయవాది ఫరీద్ అల్ దీబ్ చెప్పినట్లు సిన్హువా వార్తా సంస్థ తెలిపింది.
అధికార దుర్వినియోగం, సమాచార శాఖ మంత్రి నుంచి బహుమతులు తీసుకోవడం వంటి నేరాలు ముబారక్పై ఉన్నాయి. ఆ బహుమతుల విలువకు తగిన మొత్తాన్ని ఆయన తిరిగి చెల్లిస్తారని న్యాయవాది చెప్పారు. అధ్యక్ష భవనాల నిర్వహణకు కేటాయించిన సొమ్మును దోచుకున్నారని కూడా ముబారక్పై ఆరోపణలున్నాయి. ఇప్పటికే ముబారక్ నిర్బంధం సమయం ముగిసినట్లు అలీ మాషల్లా అనే న్యాయ నిపుణుడు తెలిపారు. అయితే, చిట్టచివరి అవినీతి కేసు ఇంకా తేలకపోతే మాత్రం ముబారక్ మరో 45 రోజులు జైల్లోనే ఉండాల్సి వచ్చే అవకాశం ఉందన్నారు.