Mohammed Morsi
-
మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష
ఈజిప్టు మాజీ అధ్యక్షుడు మహ్మద్ మోర్సీకి అక్కడి కోర్టు మరణశిక్ష విధించింది. 2011లో జైలు నుంచి భారీ సంఖ్యలో ఖైదీలు తప్పించుకుని వెళ్లిన ఘటనలో ఆయనకీ శిక్ష పడింది. కాగా, ఆయన అధికారంలో ఉండగా నిరసనకారులను అరెస్టు చేయాలని, చిత్రహింసలు పెట్టాలని ఆదేశించినందుకు ఇప్పటికే ఆయనకు 20 ఏళ్ల జైలుశిక్ష పడింది. 2013 జూలై నెలలో మోర్సీ పాలనపై తీవ్రస్థాయిలో నిరసనలు చెలరేగడంతో.. సైనిక తిరుగుబాటుతో ఆయనను పదవి నుంచి దించేశారు. అప్పటి నుంచి ఆయన స్థాపించిన ముస్లిం బ్రదర్హుడ్ ఉద్యమాన్ని నిషేధించి, ఆయన మద్దతుదారుల్లో వేలాదిమందిని అరెస్టు చేశారు. అయితే.. మోర్సీ మద్దతుదారులు మాత్రం ఇదంతా ఆయనపై జరుగుతున్న రాజకీయ కుట్ర అని, ఇప్పటికే చేసిన కుట్రను న్యాయబద్ధంగా చూపించుకోడానికి ఆయనకు మరణశిక్ష వేశారని అంటున్నారు. ఈజిప్టులో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మొట్టమొదటి అధ్యక్షుడు మోర్సీయే. -
ఈజిప్టులో 529 మందికి మరణశిక్ష
కైరో: ఈజిప్టు పదవీచ్యుత అధ్యక్షుడు మహమ్మద్ మోర్సీ మద్దతుదారుల్లో 529 మందికి మనియాలోని ఓ కోర్టు సోమవారం మరణశిక్ష విధించింది. ముస్లిం బ్రదర్‌హుడ్‌కు చెందిన వీరిని ఓ పోలీసు అధికారి హత్య కేసు, ప్రజలపై దాడుల కేసుల్లో దోషులుగా నిర్ధారించి శిక్ష వేసింది. ఆధునిక ఈజిప్టు చరిత్రలో ఇంతమందికి మరణదండన విధించడం ఇదే తొలిసారని భావిస్తున్నారు. కోర్టు తీర్పుపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. -
వధ్యశాల ఈజిప్టు!
సంపాదకీయం: ఈజిప్టు ఇప్పుడు శోకతప్త అయింది. నైలు నదిలో నీళ్లు కాదు... నెత్తురు ప్రవహిస్తోంది. ఈజిప్టు చరిత్రలో తొలిసారి ఏర్పడిన పౌర ప్రభుత్వానికి నేతృత్వం వహించిన మహమ్మద్ మోర్సీపై దేశంలో నెలకొన్న అసంతృప్తిని ఆసరాచేసుకుని గత నెలలో అధికారాన్ని చేజిక్కించుకున్న సైనిక మండలి దేశాన్ని వధ్యశాలగా మార్చింది. బుధవారం ఒక్కరోజు జరిగిన కాల్పుల్లోనే 2,200 మంది పౌరులు మరణించగా దాదాపు 4,000 మంది గాయపడ్డారు. రాజధాని కైరో శివార్లలో ఆందోళన చేస్తున్నవారిపై సైన్యం బుల్డోజర్లు, హెలికాప్టర్లతో దాడికి దిగింది. క్షతగాత్రులకు చికిత్స అందించడానికి ఏర్పాటు చేసిన ఆస్పత్రి కొన్ని నిమిషాల్లోనే శవాల గుట్టగా మారింది. మృతదేహాలన్నిటికీ తలలు ఛిద్రమైన తీరు గమనిస్తే సైన్యం అమానుషత్వం వెల్లడవుతుంది. మోర్సీ మద్దతుదారులైన ముస్లిం బ్రదర్ హుడ్ కార్యకర్తలు ఆయుధాలు చేబూని నేరుగా సైన్యంతో కాల్పులకు తలపడటంతో దేశంలో అంతర్యుద్ధ పరిస్థితులు ఏర్పడ్డాయి. రెండేళ్లక్రితం అప్పటి సైనిక పాలకుడు ముబారక్‌ను గద్దెదించడం కోసం తెహ్రీర్ స్క్వేర్ వేదికగా సాగిన ఉద్యమ స్ఫూర్తిని గ్రహించి అందుకనుగుణంగా దేశ పునర్నిర్మాణానికి పూనుకోవడంలో ప్రజాస్వామికవాదులు, ఉదార వాదులు విఫలమైన పర్యవసానంగా మళ్లీ సైన్యం పడగ నీడలోకి ఈజిప్టు వెళ్లిపోయింది. ముబారక్‌ను సాగనంపాక దేశంలో నెలకొన్న గందరగోళ పరిస్థితుల్ని, ఏదోరకంగా తన పట్టును కొనసాగించుకోవడానికి ప్రయత్నిస్తున్న సైన్యం ఎత్తుగడలను ఉద్యమకారులు గ్రహించలేకపోయారు. గత ఏడాది జూన్‌లో దేశాధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ముస్లింబ్రదర్హుడ్ పార్టీ అభ్యర్ధి మహమ్మద్ మోర్సీ విజయం సాధించారు. తెహ్రీర్ స్క్వేర్‌లో ప్రజలు ఎందుకోసం ఉద్యమించారో, ఏ విలువల పునరుద్ధరణకు ప్రాణాలు బలిపెట్టారో గ్రహించని మోర్సీ ముబారక్ బాటలోనే నడవడం ప్రారంభించారు. నిజానికి ముబారక్ పాలనలో ముస్లిం బ్రదర్హుడ్ తీవ్ర నిర్బంధాన్ని చవిచూసింది. ఆ సంస్థకు చెందిన వేలాది మంది ఊచకోతకు గురికాగా, లక్షల మంది జైళ్లలో మగ్గారు. ఈ చర్యల పర్యవసానంగా ముస్లిం బ్రదర్‌హుడ్‌కి వచ్చిన సానుభూతి మోర్సిని అధ్యక్ష స్థానానికి తీసుకెళ్లింది. ముబారక్ పాలనలో అస్తవ్యస్థంగా తయారైన ఆర్థికవ్యవస్థను చక్కదిద్దడం, దేశాన్నే జైలుగా మార్చిన నిర్బంధ చట్టాలను రద్దుచేయడం, మారణకాండకు కారకులైనవారిపై విచారణ నిర్వహించి శిక్షించడం వంటి చర్యలు చేపట్టాల్సిన మోర్సీ తాను మరో ముబారక్గా మారడానికి ప్రయత్నించారు. తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి డిక్రీలను జారీచేయడం ప్రారంభించారు. మహిళల, మైనారిటీల ప్రయోజనాలను దెబ్బతీసే అధికరణాలతో అప్రజాస్వామికమైన రాజ్యాంగాన్ని రూపొందించారు. ఈ చర్యలను నిరసిస్తూ సాగిన ఉద్యమాలను ఆయన లెక్కచేయలేదు. అధికారానికొచ్చిన ఆరునెలలలోనే ఆయన ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు. ఒకపక్క ఈ అసంతృప్తి ఆనాటికానాటికి విస్తరిస్తుంటే మోర్సీ తన వైఖరిని మార్చుకోలేదు. ప్రజాస్వామిక ఉద్యమకారులు కోరుతున్నదేమిటో, వారి డిమాండ్లలో నెరవేర్చదగ్గవేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించని ముస్లిం బ్రదర్ హుడ్... సైన్యాన్ని ప్రసన్నం చేసుకోవడానికే తన సమయాన్నంతా వెచ్చించింది. వారిని తనకు అనుకూలంగా మార్చుకుంటే ఎదురు ఉండదని భావించింది. సరిగ్గా ఈ వ్యూహమే బెడిసికొట్టింది. దశాబ్దాలపాటు దేశాన్ని తన ఉక్కు పిడికిట్లో బంధించిన సైన్యం అన్యులెవరికో ఛత్రం పట్టాల్సిన అవసరమేముంటుంది? అందువల్లే మోర్సీ గద్దె దిగాలంటూ ఉద్యమం వెల్లువలా వచ్చిపడినప్పుడు అది మౌనంగా ఉండిపోయింది. అప్పుడైనా మోర్సీకి జ్ఞానోదయమై ఉద్యమకారులతో చర్చించి అవగాహనకొచ్చి ఉంటే ఫలితం వేరుగా ఉండేది. కానీ, ఆయన ఒంటెత్తుపోకడలకు పోయారు. సరిగ్గా ఈ క్షణం కోసమే పొంచివున్న సైన్యం గత నెలలో ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట అధికారాన్ని హ స్తగతం చేసుకుంది. మోర్సీని గృహ నిర్బంధంలో ఉంచింది. అటుతర్వాత ముస్లిం బ్రదర్హుడ్ సంస్థదంతా ఒంటరిపోరే. కైరో వీధులను ఆక్రమించుకున్న ఆ సంస్థ కార్యకర్తలను సైన్యం, పోలీసులు అరెస్టుచేసి తీసుకెళ్తుంటే ఇళ్లలోనుంచి బయటికొచ్చిన ప్రజలు వారికి నీరాజనం పట్టారు. మూడు దశాబ్దాల ముబారక్ సైనిక పాలనలో ఆ కార్యకర్తలను కడుపులో పెట్టుకు చూసుకున్న జనం ఇప్పుడు ఆశ్రయమివ్వడానికే నిరాకరించారు. నిజానికి ఈ పరిస్థితిని సైన్యం ముందుగానే ఊహించింది. మోర్సీ పాలిస్తుండగానే తన పెత్తనానికి ఢోకాలేకుండా చూసుకుంది. ఆయనను అదను చూసి గద్దె దించిననాడు అమెరికా, ఇతర పాశ్చాత్యదేశాలూ ఆర్థిక ఆంక్షలు విధించవచ్చన్న అనుమానంతో గల్ఫ్ దేశాల నుంచి ముందుగానే 1,200 కోట్ల డాలర్ల రుణం పొందింది. అయితే, పాశ్చాత్యదేశాలు అది ఊహించినపాటి నిరసన కూడా వ్యక్తం చేయలేదు. ఒక్క డెన్మార్క్ మాత్రం 53 లక్షల డాలర్ల సాయాన్ని నిలిపివేసింది. ఇంత నరమేథం జరిగాక కూడా అమెరికా ఉమ్మడి సైనిక విన్యాసాలను నిలిపేయడం మినహా ఎలాంటి చర్యలనూ ప్రకటించలేదు. అయితే, ఈజిప్టు ప్రజలకు తెహ్రీర్ స్క్వేర్ చాలా పాఠాలు నేర్పింది. అందువల్లే తన పాలనను సుస్థిరం చేసుకోవడానికి సైన్యం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదు. కొత్త రాజ్యాంగాన్ని రూపొందించడానికి సైనిక పాలకుడు జనరల్ అబ్దుల్ సిసి నియమించిన 50 మంది సభ్యుల కమిటీకి... ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇస్లామిస్టు గ్రూపులు మొదలుకొని అందరి నుంచీ తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్నది. ఈజిప్టు మరోసారి జూలు విదిల్చి ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాణ ప్రతిష్ట చేస్తుందని ఈ పరిణామాలు ఆశ కలిగిస్తున్నాయి. నియంతలు ఏ రూపంలో ఉన్నా వారిని ఓ కంట కనిపెట్టగల సత్తా దానికుందని భరోసా ఇస్తున్నాయి. -
ఈజిప్ట్‌లో 2వేల మంది ఊచకోత
కైరో: ఈజిప్ట్‌లో దశాబ్దాల నిరంకుశ పాలనకు చరమగీతం పాడిన ‘అరబ్ వసంతం’ వాడిపోతోంది. హోస్నీ ముబారక్ శకం ముగిసిన తర్వాత ప్రజాస్వామ్యయుతంగా అధ్యక్షుడిగా ఎన్నికై, సైన్యం చేతిలో పదవీచ్యుతుడైన మహమ్మద్ మోర్సి మద్దతుదారులకు.. సైన్యం ఏర్పాటు చేసిన కొత్త ప్రభుత్వానికి మధ్య పోరు తారస్థాయి చేరింది. మోర్సి మద్దతుదారుల ఆందోళన శిబిరాలపై బుధవారం ఉక్కుపాదం మోపిన ‘ఆర్మీ’ ప్రభుత్వం.. వందలాది మందిని ఊచకోత కోసింది. ఆర్మీ వాహనాలు, బుల్డోజర్లు, హెలికాప్టర్లు, టియర్‌గ్యాస్‌తో విరుచుకుపడింది. శిబిరాల్లోని వారిపై విచ్చలవిడిగా కాల్పులు జరిపింది. ఈ దాడిలో 2,200 మంది వరకూ మరణించారని, దాదాపు 10 వేల మంది గాయపడ్డారని మోర్సికి చెందిన ముస్లిం బ్రదర్హుడ్ పార్టీ పేర్కొనగా... ‘ఆర్మీ’ ప్రభుత్వం మాత్రం 525 మంది వరకూ మరణించారని ప్రకటించింది. మోర్సి ప్రభుత్వంపై వ్యతిరేకత, ఆందోళనల నేపథ్యంలో జూలై 3న సైన్యం ఆయన ప్రభుత్వాన్ని కూల్చేసి, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఆయన మద్దతుదారులు, ముస్లిం బ్రదర్హుడ్ నేతలు, కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. రాజధాని కైరో శివార్లలోని రాబా అల్అదవేయా, అల్నహ్దా ప్రాంతాల్లో వేలాది మంది గుమిగూడి ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘ఆర్మీ’ తాత్కాలిక ప్రభుత్వం బుధవారం నుంచి దేశంలో అత్యవసర పరిస్థితిని విధించింది. చాలా నగరాల్లో కర్ఫ్యూ ప్రకటించింది. అనంతరం ఆందోళనకారుల శిబిరాలపై సైన్యంతో దాడి చేసింది. ఈ అత్యవసర పరిస్థితి ప్రకటన, ఆందోళనకారులపై దాడి నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ.. ఉపాధ్యక్షుడు ఎల్‌బరాదీ రాజీనామా చేయడం గమనార్హం. ఈ ఘటనల్లో బ్రిటన్, దుబాయ్‌కు చెందిన ముగ్గురు జర్నలిస్టులు కూడా మరణించారు. కాగా, ఈ దాడిని సైన్యం ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వంలో ప్రధానమంత్రి హాజెమ్ ఎల్బబ్లావీ సమర్థించుకున్నారు. ‘‘ఆందోళనకారులు ఆస్పత్రులు, పోలీస్స్టేషన్లపై కూడా దాడికి దిగారు. పరిస్థితిని అదుపుచేయడానికే సైన్యాన్ని ప్రయోగించాం’’ అని పేర్కొన్నారు. మరోవైపు తమ ఆందోళనలు కొనసాగుతాయని ముస్లిం బ్రదర్హుడ్ ప్రకటించింది. ‘‘‘ఆర్మీ’ ప్రభుత్వం ఎన్ని కుటిల యత్నాలు చేసినా మేం వెనక్కి తగ్గం. మిలటరీ పాలనను అంతం చేసేవరకూ పోరాడుతాం’’ అని ముస్లిం బ్రదర్హుడ్ ప్రతినిధి గెహద ఎల్ హడ్డాడ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. మరో 30 రోజుల పాటు మోర్సి నిర్బంధం: పదవీచ్యుతుడైన అధ్యక్షుడు మోర్సి నిర్బంధాన్ని మరో 30 రోజుల పాటు పొడిగిస్తూ కైరోలోని ఓ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముబారక్‌ను గద్దె దించేందుకు నిర్వహించిన ఆందోళనల సమయంలో పోలీస్స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలపై దాడులను మోర్సి ప్రోత్సహించారని, ఉగ్రవాద సంస్థ హమాస్‌తో ఆయనకు సంబంధం ఉందనే ఆరోపణలపై మోర్సిని ‘ఆర్మీ’ ప్రభుత్వం అరెస్టు చేసింది. మరోవైపు పాలస్తీనా కేంద్రంగా కొనసాగే హమాస్ సంస్థ మోర్సి మద్దతుదారుల ఆందోళనలకు తోడ్పడుతోందని, ఈ మేరకు భద్రతా కారణాల రీత్యా పాలస్తీనాతో ఉన్న గాజా సరిహద్దులను మూసివేస్తున్నామని సైన్యం ప్రకటించింది. ఊచకోత ఘటనపై ప్రపంచవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. ఇది అత్యంత దుర్మార్గమైన చర్య అని యూరోపియన్ యూనియన్, బ్రిటన్, ఇరాన్, ఖతార్ తదితర దేశాలు మండిపడ్డాయి. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి వెంటనే సమావేశమై చర్చించాలని, తగిన చర్యలు చేపట్టాలని టర్కీ ప్రధానమంత్రి తయిప్ ఎర్డొగన్ విజ్ఞప్తి చేశారు. ఈజిప్ట్‌లో మరోసారి అంతర్యుద్ధం తలెత్తే ప్రమాదం ఉందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలాండ్ పేర్కొన్నారు. ఆందోళనకారులపై ఈజిప్ట్ సైనిక ప్రభుత్వం జరిపిన మారణకాండపై అమెరికా నిరసన వ్యక్తం చేసింది. ఆ దేశంతో తాము నిర్వహించనున్న ఉమ్మడి మిలటరీ విన్యాసాలను రద్దు చేసుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటించారు. -
మోర్సీ మద్దతుదారులు 40 మంది హతం
ఈజిప్టులో తిరుగుబాటుదారులపై విరుచుకుపడ్డ సైన్యం శిబిరాలు బుల్డోజర్లతో నేలమట్టం కైరో: ఈజిప్టు రాజధాని కైరో బుధవారం బుల్డోజర్ల పదఘట్టనలు, తుపాకీ కాల్పుల మోతలతో దద్ధరిల్లింది. పదవీచ్యుతుడైన ఈజిప్టు అధ్యక్షుడు మహమ్మద్ మోర్సీకి మద్దతిస్తున్న 40 మంది తిరుగుబాటుదారులను సైన్యం హతమార్చింది. మోర్సీ మద్దతుదారులపై సైన్యం బుల్డోజర్లతో విరుచుకుపడి శిబిరాలను పెకలించింది. ఈ ఘర్షణలో 300 మంది మరణించినట్లు ముస్లిం బ్రదర్హుడ్ నేతలు పేర్కొనగా 40 మంది మృత్యువాత పడినట్లు అల్‌జజీరా చానల్‌ను ఉటంకిస్తూ కొన్ని వర్గాలు వెల్లడించాయి. అధ్యక్ష పీఠం మోర్సీకి తిరిగి అప్పగించాలని డిమాండ్ చేస్తున్న తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా సైన్యం సరైన చర్యలు చేపడుతున్నట్లు అంతర్గతశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. నాజర్ నగరంలో 200 మందిని, గిజాలో 150 మందిని అరెస్టు చేసినట్లు ప్రకటించింది. తిరుగుబాటుదారుల్లో ప్రాసిక్యూషన్ చేయాల్సిన వారు మినహా మిగతావారు సురక్షితంగా నిష్ర్కమించేందుకు అవకాశం ఇస్తామని పేర్కొంది. మరోవైపు ముగ్గురు భద్రతా సిబ్బంది సహా తొమ్మిది మంది చనిపోయినట్లు ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.