
మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష
ఈజిప్టు మాజీ అధ్యక్షుడు మహ్మద్ మోర్సీకి అక్కడి కోర్టు మరణశిక్ష విధించింది. 2011లో జైలు నుంచి భారీ సంఖ్యలో ఖైదీలు తప్పించుకుని వెళ్లిన ఘటనలో ఆయనకీ శిక్ష పడింది. కాగా, ఆయన అధికారంలో ఉండగా నిరసనకారులను అరెస్టు చేయాలని, చిత్రహింసలు పెట్టాలని ఆదేశించినందుకు ఇప్పటికే ఆయనకు 20 ఏళ్ల జైలుశిక్ష పడింది. 2013 జూలై నెలలో మోర్సీ పాలనపై తీవ్రస్థాయిలో నిరసనలు చెలరేగడంతో.. సైనిక తిరుగుబాటుతో ఆయనను పదవి నుంచి దించేశారు.
అప్పటి నుంచి ఆయన స్థాపించిన ముస్లిం బ్రదర్హుడ్ ఉద్యమాన్ని నిషేధించి, ఆయన మద్దతుదారుల్లో వేలాదిమందిని అరెస్టు చేశారు. అయితే.. మోర్సీ మద్దతుదారులు మాత్రం ఇదంతా ఆయనపై జరుగుతున్న రాజకీయ కుట్ర అని, ఇప్పటికే చేసిన కుట్రను న్యాయబద్ధంగా చూపించుకోడానికి ఆయనకు మరణశిక్ష వేశారని అంటున్నారు. ఈజిప్టులో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మొట్టమొదటి అధ్యక్షుడు మోర్సీయే.