సంపాదకీయం: ఈజిప్టు ఇప్పుడు శోకతప్త అయింది. నైలు నదిలో నీళ్లు కాదు... నెత్తురు ప్రవహిస్తోంది. ఈజిప్టు చరిత్రలో తొలిసారి ఏర్పడిన పౌర ప్రభుత్వానికి నేతృత్వం వహించిన మహమ్మద్ మోర్సీపై దేశంలో నెలకొన్న అసంతృప్తిని ఆసరాచేసుకుని గత నెలలో అధికారాన్ని చేజిక్కించుకున్న సైనిక మండలి దేశాన్ని వధ్యశాలగా మార్చింది. బుధవారం ఒక్కరోజు జరిగిన కాల్పుల్లోనే 2,200 మంది పౌరులు మరణించగా దాదాపు 4,000 మంది గాయపడ్డారు. రాజధాని కైరో శివార్లలో ఆందోళన చేస్తున్నవారిపై సైన్యం బుల్‌డోజర్లు, హెలికాప్టర్లతో దాడికి దిగింది. క్షతగాత్రులకు చికిత్స అందించడానికి ఏర్పాటు చేసిన ఆస్పత్రి కొన్ని నిమిషాల్లోనే శవాల గుట్టగా మారింది. మృతదేహాలన్నిటికీ తలలు ఛిద్రమైన తీరు గమనిస్తే సైన్యం అమానుషత్వం వెల్లడవుతుంది. మోర్సీ మద్దతుదారులైన ముస్లిం బ్రదర్ హుడ్ కార్యకర్తలు ఆయుధాలు చేబూని నేరుగా సైన్యంతో కాల్పులకు తలపడటంతో దేశంలో అంతర్యుద్ధ పరిస్థితులు ఏర్పడ్డాయి.
రెండేళ్లక్రితం అప్పటి సైనిక పాలకుడు ముబారక్‌ను గద్దెదించడం కోసం తెహ్రీర్ స్క్వేర్ వేదికగా సాగిన ఉద్యమ స్ఫూర్తిని గ్రహించి అందుకనుగుణంగా దేశ పునర్నిర్మాణానికి పూనుకోవడంలో ప్రజాస్వామికవాదులు, ఉదార వాదులు విఫలమైన పర్యవసానంగా మళ్లీ సైన్యం పడగ నీడలోకి ఈజిప్టు వెళ్లిపోయింది. ముబారక్‌ను సాగనంపాక దేశంలో నెలకొన్న గందరగోళ పరిస్థితుల్ని, ఏదోరకంగా తన పట్టును కొనసాగించుకోవడానికి ప్రయత్నిస్తున్న సైన్యం ఎత్తుగడలను ఉద్యమకారులు గ్రహించలేకపోయారు.
గత ఏడాది జూన్‌లో దేశాధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ముస్లింబ్రదర్‌హుడ్ పార్టీ అభ్యర్ధి మహమ్మద్ మోర్సీ విజయం సాధించారు. తెహ్రీర్ స్క్వేర్‌లో ప్రజలు ఎందుకోసం ఉద్యమించారో, ఏ విలువల పునరుద్ధరణకు ప్రాణాలు బలిపెట్టారో గ్రహించని మోర్సీ ముబారక్ బాటలోనే నడవడం ప్రారంభించారు. నిజానికి ముబారక్ పాలనలో ముస్లిం బ్రదర్‌హుడ్ తీవ్ర నిర్బంధాన్ని చవిచూసింది.
ఆ సంస్థకు చెందిన వేలాది మంది ఊచకోతకు గురికాగా, లక్షల మంది జైళ్లలో మగ్గారు. ఈ చర్యల పర్యవసానంగా ముస్లిం బ్రదర్‌హుడ్‌కి వచ్చిన సానుభూతి మోర్సిని అధ్యక్ష స్థానానికి తీసుకెళ్లింది. ముబారక్ పాలనలో అస్తవ్యస్థంగా తయారైన ఆర్థికవ్యవస్థను చక్కదిద్దడం, దేశాన్నే జైలుగా మార్చిన నిర్బంధ చట్టాలను రద్దుచేయడం, మారణకాండకు కారకులైనవారిపై విచారణ నిర్వహించి శిక్షించడం వంటి చర్యలు చేపట్టాల్సిన మోర్సీ తాను మరో ముబారక్‌గా మారడానికి ప్రయత్నించారు. తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి డిక్రీలను జారీచేయడం ప్రారంభించారు.
మహిళల, మైనారిటీల ప్రయోజనాలను దెబ్బతీసే అధికరణాలతో అప్రజాస్వామికమైన రాజ్యాంగాన్ని రూపొందించారు. ఈ చర్యలను నిరసిస్తూ సాగిన ఉద్యమాలను ఆయన లెక్కచేయలేదు. అధికారానికొచ్చిన ఆరునెలలలోనే ఆయన ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు. ఒకపక్క ఈ అసంతృప్తి ఆనాటికానాటికి విస్తరిస్తుంటే మోర్సీ తన వైఖరిని మార్చుకోలేదు. ప్రజాస్వామిక ఉద్యమకారులు కోరుతున్నదేమిటో, వారి డిమాండ్లలో నెరవేర్చదగ్గవేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించని ముస్లిం బ్రదర్ హుడ్... సైన్యాన్ని ప్రసన్నం చేసుకోవడానికే తన సమయాన్నంతా వెచ్చించింది.
వారిని తనకు అనుకూలంగా మార్చుకుంటే ఎదురు ఉండదని భావించింది. సరిగ్గా ఈ వ్యూహమే బెడిసికొట్టింది. దశాబ్దాలపాటు దేశాన్ని తన ఉక్కు పిడికిట్లో బంధించిన సైన్యం అన్యులెవరికో ఛత్రం పట్టాల్సిన అవసరమేముంటుంది? అందువల్లే మోర్సీ గద్దె దిగాలంటూ ఉద్యమం వెల్లువలా వచ్చిపడినప్పుడు అది మౌనంగా ఉండిపోయింది. అప్పుడైనా మోర్సీకి జ్ఞానోదయమై ఉద్యమకారులతో చర్చించి అవగాహనకొచ్చి ఉంటే ఫలితం వేరుగా ఉండేది. కానీ, ఆయన ఒంటెత్తుపోకడలకు పోయారు. సరిగ్గా ఈ క్షణం కోసమే పొంచివున్న సైన్యం గత నెలలో ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట అధికారాన్ని హ స్తగతం చేసుకుంది. మోర్సీని గృహ నిర్బంధంలో ఉంచింది.
అటుతర్వాత ముస్లిం బ్రదర్‌హుడ్ సంస్థదంతా ఒంటరిపోరే. కైరో వీధులను ఆక్రమించుకున్న ఆ సంస్థ కార్యకర్తలను సైన్యం, పోలీసులు అరెస్టుచేసి తీసుకెళ్తుంటే ఇళ్లలోనుంచి బయటికొచ్చిన ప్రజలు వారికి నీరాజనం పట్టారు. మూడు దశాబ్దాల ముబారక్ సైనిక పాలనలో ఆ కార్యకర్తలను కడుపులో పెట్టుకు చూసుకున్న జనం ఇప్పుడు ఆశ్రయమివ్వడానికే నిరాకరించారు.
నిజానికి ఈ పరిస్థితిని సైన్యం ముందుగానే ఊహించింది. మోర్సీ పాలిస్తుండగానే తన పెత్తనానికి ఢోకాలేకుండా చూసుకుంది. ఆయనను అదను చూసి గద్దె దించిననాడు అమెరికా, ఇతర పాశ్చాత్యదేశాలూ ఆర్థిక ఆంక్షలు విధించవచ్చన్న అనుమానంతో గల్ఫ్ దేశాల నుంచి ముందుగానే 1,200 కోట్ల డాలర్ల రుణం పొందింది. అయితే, పాశ్చాత్యదేశాలు అది ఊహించినపాటి నిరసన కూడా వ్యక్తం చేయలేదు. ఒక్క డెన్మార్క్ మాత్రం 53 లక్షల డాలర్ల సాయాన్ని నిలిపివేసింది. ఇంత నరమేథం జరిగాక కూడా అమెరికా ఉమ్మడి సైనిక విన్యాసాలను నిలిపేయడం మినహా ఎలాంటి చర్యలనూ ప్రకటించలేదు.
అయితే, ఈజిప్టు ప్రజలకు తెహ్రీర్ స్క్వేర్ చాలా పాఠాలు నేర్పింది. అందువల్లే తన పాలనను సుస్థిరం చేసుకోవడానికి సైన్యం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదు. కొత్త రాజ్యాంగాన్ని రూపొందించడానికి సైనిక పాలకుడు జనరల్ అబ్దుల్ సిసి నియమించిన 50 మంది సభ్యుల కమిటీకి... ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇస్లామిస్టు గ్రూపులు మొదలుకొని అందరి నుంచీ తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్నది. ఈజిప్టు మరోసారి జూలు విదిల్చి ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాణ ప్రతిష్ట చేస్తుందని ఈ పరిణామాలు ఆశ కలిగిస్తున్నాయి. నియంతలు ఏ రూపంలో ఉన్నా వారిని ఓ కంట కనిపెట్టగల సత్తా దానికుందని భరోసా ఇస్తున్నాయి.
వధ్యశాల ఈజిప్టు!
Published Sat, Aug 17 2013 12:30 AM | Last Updated on Fri, Sep 1 2017 9:52 PM
Advertisement
Advertisement