ఈజిప్టు రాజధాని కైరో బుధవారం బుల్‌డోజర్ల పదఘట్టనలు, తుపాకీ కాల్పుల మోతలతో దద్ధరిల్లింది.
ఈజిప్టులో తిరుగుబాటుదారులపై విరుచుకుపడ్డ సైన్యం
శిబిరాలు బుల్‌డోజర్లతో నేలమట్టం
కైరో: ఈజిప్టు రాజధాని కైరో బుధవారం బుల్‌డోజర్ల పదఘట్టనలు, తుపాకీ కాల్పుల మోతలతో దద్ధరిల్లింది. పదవీచ్యుతుడైన ఈజిప్టు అధ్యక్షుడు మహమ్మద్ మోర్సీకి మద్దతిస్తున్న 40 మంది తిరుగుబాటుదారులను సైన్యం హతమార్చింది. మోర్సీ మద్దతుదారులపై సైన్యం బుల్‌డోజర్లతో విరుచుకుపడి శిబిరాలను పెకలించింది.
ఈ ఘర్షణలో 300 మంది మరణించినట్లు ముస్లిం బ్రదర్‌హుడ్ నేతలు పేర్కొనగా 40 మంది మృత్యువాత పడినట్లు అల్‌జజీరా చానల్‌ను ఉటంకిస్తూ కొన్ని వర్గాలు వెల్లడించాయి. అధ్యక్ష పీఠం మోర్సీకి తిరిగి అప్పగించాలని డిమాండ్ చేస్తున్న తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా సైన్యం సరైన చర్యలు చేపడుతున్నట్లు అంతర్గతశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
నాజర్ నగరంలో 200 మందిని, గిజాలో 150 మందిని అరెస్టు చేసినట్లు ప్రకటించింది. తిరుగుబాటుదారుల్లో ప్రాసిక్యూషన్ చేయాల్సిన వారు మినహా మిగతావారు సురక్షితంగా నిష్ర్కమించేందుకు అవకాశం ఇస్తామని పేర్కొంది. మరోవైపు ముగ్గురు భద్రతా సిబ్బంది సహా తొమ్మిది మంది చనిపోయినట్లు ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.