20లోగా స్కాలర్‌షిప్ బకాయిలు చెల్లించాలి: కడియం
సాక్షి, హైదరాబాద్: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ఈ నెల 20లోగా చెల్లించాలని వివిధ సంక్షేమ శాఖలను ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆదేశించారు. గురువారం సచివాలయంలో సీఎస్ రాజీవ్ శర్మ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సమక్షేమ శాఖల ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా పెండింగ్‌లో ఉన్న ఫీజుల వివరాలను ఆయన తెలుసుకున్నారు. విద్యార్థులకు మెస్ ఫీజులు, స్కాలర్‌షిప్‌ల బకాయిలు త్వరగా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఎంటీఎఫ్‌లను అక్టోబర్‌లోగా, ఆర్‌టీఎఫ్‌లను డిసెంబర్‌లోగా చెల్లించాలని ఆదేశించినట్లు సమాచారం. ఫీజు రీయింబర్స్‌మెంట్ (2014-15)కు రిజిస్టర్ చేసుకోని విద్యార్థులు, కాలేజీలు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 20 వరకు గడువిచ్చినందున, 2015-16 విద్యాసంవత్సరానికి సంబంధించి దరఖాస్తులను వారంలోగా ప్రారంభించనున్నట్లు తెలిసింది.
ఇంకా పెద్ద మొత్తంలో బకాయిలు..
ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి ఇప్పటివరకు ఆర్‌టీఎఫ్ ఎంటీఎఫ్ కలుపుకొని మొత్తం రూ.820 కోట్ల బడ్జెట్ విడుదల చేయగా, అందులో ఇప్పటివరకు రూ.444 కోట్లు మంజూరుచేసినట్లు సమాచారం. ఆర్‌టీఎఫ్ కింద 1,884.26 కోట్లు అవసరం ఉండగా, రూ.499.81 కోట్లు బడ్జెట్ విడుదల ఉత్తర్వులిచ్చినట్లు తెలిసింది.
ఎంటీఎఫ్ కింద రూ.567.76 కోట్లు అవసరం ఉండగా, రూ.313 కోట్లకు బీఆర్వోలు విడుదల చేసినట్లు సమాచారం. 2014-15కు సంబంధించి ఇప్పటివరకు 14,31,469 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, 13,62,860 మంది విద్యార్థుల వెరిఫికేషన్ పూర్తయినట్లు తెలిసింది.