
మినీ ట్రక్కు బోల్తా..22 మంది మృతి
సాక్షి, బెంగళూరు/బెల్గాం: కర్ణాటకలోని బెల్గాం జిల్లాలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 22 మంది దుర్మరణం చెందారు. మరో 30 మంది గాయపడ్డారు. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులే ఉన్నారు. అతివేగమే ఈ అనర్థానికి కారణమని తెలుస్తోంది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. వెనుకబడిన జిల్లాగా పేరుపొందిన యాద్గీర్ లోని వివిధ తాండాల వారు పొరుగునే గల మహారాష్ట్రలో కూలి పనులకు వెళ్తుంటారు. యాద్గీర్ జిల్లా సర్పూర్ తాలూకాలోని ఐబీ తండా, మనుగొండ, తదితర ఐదు తండాలకు చెందిన 52 మంది కూడా తమ పిల్లలతో కలిసి శుక్రవారం రాత్రి క్యాంటర్ వాహనం(మినీ ట్రక్కు)లో మహారాష్ట్రలోని సవాంతవాడిలో రాళ్ల క్వారీలో పనికి బయలుదేరారు.
వంటపాత్రలు, ధాన్యం, ఇతర మూటలు కూడా తీసుకెళ్లారు. శనివారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో అతివేగంగా వెళుతున్న ట్రక్కు హల్కీ క్రాస్ దగ్గరికి చేరుకోగానే ఒక్కసారిగా అదుపుతప్పి పల్టీలు కొట్టింది. దీంతో ఎనిమిది మంది చిన్నారులతో సహా 21 మంది అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు. గాయపడినవారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మృతుల కుటుంబాలకు రూ. లక్ష చొప్పున పరిహారాన్ని ప్రకటించారు.