డిప్రెషన్తో మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
డిప్రెషన్తో బాధపడుతున్న ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ (24) ఆత్మహత్య చేసుకుంది. ఆమె తన ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ముంబైకి చెందిన దీపా రాదారియా గత ఆరు నెలలుగా ఇండోర్లోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తోంది. ఎంజీ రోడ్డులోని అహింసా టవర్ అపార్టుమెంటులోని తన ఫ్లాట్లో ఉరేసుకుని మరణించిందని టుకోగంజ్ స్టేషన్ ఇన్ఛార్జి దిలీప్ సింగ్ చౌదరి తెలిపారు. తన సహోద్యోగి స్నేహితో కలిసి ఆమె ఆ ఫ్లాట్లో ఉండేది.
చిన్న చిన్న విషయాలకు కూడా దీప పదేపదే డిప్రెషన్కు గురయ్యేదని ఆమె స్నేహితురాలు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. గత మూడు నాలుగు రోజులుగా ఆమె ఆరోగ్యం కూడా అంత బాగోలేదు. దాంతో స్నేహ కూడా ఆఫీసుకు వెళ్లకుండా సాయం ఉంటానని చెప్పినా, దీప బలవంతంగా ఆమెను ఆఫీసుకు పంపేసింది. ఆఫీసుకు వెళ్లిన తర్వాత స్నేహ ఎన్ని సార్లు ఫోన్ చేసినా దీప ఆన్సర్ చేయలేదు. తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్లాక పదే పదే తలుపు కొట్టినా కూడా తీయలేదు. దాంతో ఇరుగుపొరుగులను పిలవగా వాళ్లు తలుపు బద్దలుకొట్టారు. తీరాచూస్తే దీప ఉరేసుకుని కనిపించింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.