జైపూర్: కలుషిత ఆహారం తిని 30 మంది బాలికలు అస్వస్థతకు గురైన సంఘటన రాజస్థాన్లో చోటుచేసుకుంది. నాగౌర్ జిల్లాలోని లాంగోర్ అనే గ్రామంలో ఓ ప్రభుత్వ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల ఉంది. గత రాత్రి భోజనం చేసిన ఆ బాలికలు.. అనంతరం తమకు వికారంగా ఉందని, వాంతులవుతున్నాయని, కడుపులో నొప్పిగా ఉందని వసతి గృహం అధికారులకు చెప్పారు. దీంతో వారిని అందుబాటులో ఉన్న వివిధ ఆస్పత్రులకు తరలించారు. వారిలో ఓ బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆస్పత్రి పాలైన బాలికలంతా కూడా 11 నుంచి 13 సంవత్సరాల లోపువారే. వీరంతా ఈ పాఠశాల సమీపంలోని పలు గ్రామాలకు చెందిన నిరుపేదలు. ఈ ఘటన జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న ఆహార పదార్థాల తనిఖీల అధికారులు స్టాక్ను పరీక్షించారు. కలుషితమైన ఆహారం కారణంగానే బాలికలకు సమస్య ఎదురైందని స్పష్టం చేశారు.