30 వేల ఏళ్ల నాటి ఆదిమానవుల చిత్రాలు
నెల్లూరు జిల్లా ఘటికసిద్ధేశ్వరంలో వెలుగులోకి..
పరిశీలించిన పురావస్తు బృందం
ఉదయగిరి: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం ఘటికసిద్ధేశ్వరంలో కనిగిరి విద్యార్థి కనుగొన్న మధ్యయుగం నాటి ఆదిమానవుని చిత్రాలను రీజి నల్ పురావస్తు శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ జనకర్, పురావస్తు అన్వేషిత బృంద సభ్యులు శనివారం పరిశీలించారు. మరికొన్ని చిత్రాలను కూడా ఆ ప్రాంతంలో కనుగొన్నారు. ఇవి 30 వేల సంవత్సరాల నాటివని పేర్కొన్నారు. జిల్లాలో మొట్టమొదటిసారిగా ఇవి బయటపడినట్లు వారు చెప్పారు. ఆదిమానవులు చిత్రించిన బొమ్మల స్థావరాలు మన రాష్ట్రంలో 13 ఉన్నాయని, జిల్లాలో మాత్రం ఇవేనని తెలిపారు. దాదాపు రెండున్నర అడుగుల ఎత్తులో ఎరువురంగులో చేతిలో మండతోవున్న ఆదిమ మానవుని ఆకృతి భారతదేశంలో అరుదైన చిత్రమని చెప్పారు.
ఆది మానవుని జీవన విధానాన్ని ప్రతిబించించే జింకలవేట, చేపల వేట చిత్రాలను కూడా కనుగొన్నట్లు వెల్లడించారు. రాతి గొడ్డళ్లు, కత్తులు, ఆయుధాలు కూడా ఈ బొమ్మల్లోనే నిగూఢమై ఉన్నాయన్నారు. సీతారామపురానికి ఏడు మైళ్ల దూరంలోని కొండ గుహలో వంద అడుగుల వెడల్పయిన రాతిపై 12 అడుగుల ఎత్తులో సుమారు 20కి పైగా చిత్రాలు ఉన్నాయన్నారు. వీటిని సంరక్షించే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరతామన్నారు. వీటిపై మరిన్ని పరిశోధనలు చేస్తే ఆసక్తికర విషయాలెన్నో వెలికితీయవచ్చన్నారు. ఈ బృందంలో డాక్టర్ ధనిశెట్టి లెనిన్, కొండ్రెడ్డి భాస్కర్, రమణారెడ్డి, ఎస్‌కె.అమ్మసావలి, అల్లం రామ్మూర్తి, గువ్వకల హరీష్ ఉన్నారు.