Archaeological Survey
-
Gyanvapi case: జ్ఞానవాపి నివేదికకు మరో 10 రోజుల గడువు
వారణాసి(యూపీ): జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ) శాస్త్రీయ సర్వే నిర్వహించి నివేదిక సమర్పించేందుకు మరో 10 రోజుల గడువును వారణాసి జిల్లా కోర్టు మంజూరుచేసింది. నవంబర్ 17(శుక్రవారం)లోగా సర్వే వివరాలను నివేదించాలని గతంలో ఆదేశించగా మరో 15 రోజుల గడువుకావాలంటూ శుక్రవారం కోర్టును ఏఎస్ఐ తరఫు లాయర్లు అభ్యర్థించారు. టెక్నికల్ రిపోర్ట్ ఇంకా అందుబాటులో లేని కారణంగా గడువును పెంచాలని ఏఎస్ఐ కోరడంతో జిల్లా జడ్జి ఏకే విశ్వేశ్ నవంబర్ 28 వరకు గడువు ఇచ్చారని హిందువుల తరఫు న్యాయవాది మదన్ మోహన్ యాదవ్ వెల్లడించారు. ఆలయ పురాతన పునాదులపైనే 17వ శతాబ్దంలో మసీదు నిర్మించారంటూ దాఖలైన పిటిషన్ విచారణలో భాగంగా కోర్టు ఆదేశాల మేరకు ఏఎస్ఐ సర్వే చేపట్టిన విషయం తెల్సిందే. ఆగస్టు నాలుగో తేదీన నివేదిక సమర్పించాలని మొట్టమొదటిసారిగా కోర్టు ఆదేశించింది. ఆ తర్వాత కేసు విచారణల సందర్భంగా గడువు పొడిగిస్తూ వచ్చారు. తాజాగా గడువును జిల్లా కోర్టు నవంబర్ 28గా నిర్దేశించింది. ‘న్యాయం జరగాలంటే సర్వే జరగాల్సిందే’ అంటూ వారణాసి కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను అలహాబాద్ హైకోర్టు సమర్థించడంతో ఈ సర్వే ప్రక్రియకు తొలి అడుగు పడింది. -
ఐదు శతాబ్దాల బురుజు.. అయినా ఇప్పటికీ చెక్కు చెదరలేదు!
వైఎస్సార్ జిల్లా (పులివెందుల రూరల్): పులివెందుల మండల పరిధిలోని ఎర్రబల్లె పంచాయతీలోని నల్లగొండువారిపల్లె గ్రామంలో 5 శతాబ్దాల నాటి బురుజు నేటికి చెక్కు చెదరకుండా ఉంది. పూర్వం బ్రిటీష్ కాలంలో శత్రువులు దాడులు చేసినప్పుడు వారి నుంచి ప్రాణాలను రక్షించుకునేందుకు బురుజులు ఏర్పాటు చేశారని గ్రామస్తులు అంటున్నారు. అంతేకాక పంట ఉత్పత్తులను ఈ బురుజులలో గోప్యంగా దాచి ఉంచేవారు. ఇప్పటికి పలు గ్రామాలలో పాతకాలం నాటి బురుజులు దర్శనమిస్తున్నాయి. ఈ బురుజుల గురించి ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు. చదవండి: శిథిలావస్థలో అపూర్వమైన కట్టడాలు -
మ్యూజియాలు భద్రమేనా?
సాక్షి, హైదరాబాద్: ఘనమైన గత వైభవానికి ప్రతీక.. భావితరాలకు జ్ఞాపిక.. పూర్వీకులు మనకిచ్చిన పురాతన చారిత్రక సంపద. తరతరాల చరిత్రకు ఆధారాలు, అలనాటి పాలనకు దర్పణాలు ఆ విలువైన పురాతన వస్తువులు. అత్యంత విలువైన ఆ సంపదకు క్రమంగా ఆపద ముంచుకొస్తోంది. చారిత్రక సంప దను కాపాడాల్సిన మ్యూజియాలకు రక్షణ కరువవుతోంది. చరిత్రను చాటే ఆనవాళ్లు ఒక్కొక్కటిగా కాలగర్భంలో కలసిపోయే పరిస్థితి తలెత్తుతోంది. ‘నిజాం’లో చోరీ: పురావస్తు శాఖ నిర్వహిస్తున్న మ్యూజియాల్లో కొన్నింటికి రక్షణ కరువై విలువైన సంపద దుండగుల చేతికి చిక్కుతోంది. ఇటీవలి హైదరాబాద్ నిజాం మ్యూజియం దొంగతనమే ఇందుకు ఉదాహరణ. మ్యూజియాలపై ప్రభుత్వాల అలసత్వం, అక్కడ తగినంత భద్రత, సీసీ కెమెరాలు లేకపోవడం చోరీలకు కారణంగా చెప్పొచ్చు. పురావస్తు శాఖకు బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించకపోవడం, సిబ్బంది నియామకాలు చేపట్టకపోవడం కూడా ఆ శాఖపై చిన్నచూపును తెలుపుతోంది. రాష్ట్రంలోని పురావస్తు శాఖలో 200 మంది సిబ్బంది అవసరం ఉండగా 50 మంది కూడా లేకపోవడంతో మ్యూజియాలకు రక్షణ లేకుండా పోతుంది. అన్నింటా విలువైన సంపదే హైదరాబాద్‌లో రాష్ట్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్మారక మ్యూజియం, సెంటినరీ జూబ్లీ హెరిటేజ్ మ్యూజియం, ఖజానా, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, పిల్లలమర్రి, అలంపూర్, పానగల్ మ్యూజియాలతో పాటు నాగార్జునసాగర్, కొలనుపాకలో పురావస్తు శాఖ వస్తు ప్రదర్శన శాలలు నడుస్తున్నాయి. వీటిల్లో రాజుల కాలం నాటి ఆయుధాలు, మట్టి కుండలు సహా మరిన్ని విలువైన వస్తువులున్నాయి. నాగార్జున కొండ మ్యూజియం 1959లో అప్పటి విద్యా శాఖ మంత్రి హుమాయన్ కబీర్ మ్యూజియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 1923 నుంచి 1960 వరకు నాగార్జునసాగర్ పరిసరాల్లో పురావస్తు శాఖ వారు నిర్వహించిన తవ్వకాల్లో బయటపడిన శిలలు, శిల్పాలు, శాసనాలు ఇక్కడ ఉన్నాయి. ఫణిగిరిలో ఓ ఇంట్లో..: రాష్ట్రంలో పలుచోట్ల చారిత్రక వస్తువులు, ఆనవాళ్లు గుర్తించినా భద్రపరచడానికి నిధులు, సరిపడా సిబ్బంది లేక పురావస్తు శాఖ కునారిల్లుతోంది. ఫణిగిరిలోని విలువైన సంపదను గ్రామంలోని ఓ ఇంటి గదిలో ఉంచారు. పానగల్ మ్యూజియంలోనూ అనేక విగ్రహాలు ఆలనాపాలనా లేకుండా పడి ఉన్నాయి. ‘పానగల్’కు రక్షణేదీ? నల్లగొండ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోని పానగల్ ఆర్కియాలజీ మ్యూజియాన్ని 1992లో ఏర్పాటు చేశారు. అనేక వినతుల తర్వాత మ్యూజియం ఏర్పాటు చేసినా దాని అభివృద్ధిని, జిల్లాలోని పురాతన వస్తువుల పరిరక్షణనూ గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. తమకున్న పరిధిలో చాలీచాలని సిబ్బందితోనే చారిత్రక సంపద పట్ల ఆసక్తి ఉన్న శాఖ ఉద్యోగులు, ఇతర చరిత్రకారుల సాయంతో సంపద పరిరక్షణకు తోచింది చేస్తున్నారు. మ్యూజియానికి కనీసం ప్రహరీ కూడా లేకపోవడంతో ఆరుబయట ఉన్న విగ్రహాలు, వస్తువులకు రక్షణ కరువైంది. 2014లో ఈ మ్యూజియం నుంచి 12వ శతాబ్దం నాటి గణపతి విగ్రహాన్ని దుండగులు అపహరించారు. సిబ్బంది సంఖ్య అరకొరగానే ఉండటంతో పగలు ఒకరు, రాత్రి ఇద్దరే (ఒకరు తాత్కాలిక ఉద్యోగి) రక్షణగా ఉంటున్నారు. -
అస్థికలతో ఆభరణాలు
నంగునూరు: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో పురావస్తుశాఖ అధికారులు కొనసాగిస్తున్న తవ్వకాల్లో శుక్రవారం అస్థికలతో చేసిన ఆభరణాలు లభ్యమయ్యాయి. మెన్హిర్ వద్ద ఉన్న మొదటి సమాధిలో 50 సెంటీమీటర్ల ఎముకతోపాటు, చిన్న ముక్కలు, ఎర్రమట్టి పాత్ర, మూడు నల్లటిమట్టి గిన్నెలు లభిం చాయి. ఈ సందర్భంగా పురావస్తు శాఖ సహాయ సంచాలకుడు నాగరాజు, ఎర్రమరాజు భానుమూర్తి మాట్లాడుతూ నర్మెటలోని పెద్ద సమాధిలో రెండున్నర మీటర్ల లోతు తవ్వకాలు జరిపి కీలకమైన ప్రాచీన మానవుడి ఆనవాళ్లను గుర్తించామని చెప్పారు. పొడవాటి కాలి ఎముకతోపాటు, ఎముకలతో చేసిన ఆభరణాలను వెలికి తీశామన్నారు. ఆనాటి మహిళలు దీన్ని ఆభరణంగా ధరించి ఉండవచ్చని భావిస్తున్నామని, పరీక్షల అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. మరికొన్ని మృణ్మయ పాత్రలు లభించాయన్నారు. ఇప్పటికే చాలా సమాచారాన్ని సేకరించామని, ఐదు రోజుల్లో తవ్వకాలు పూర్తి చేస్తామని అన్నారు. -
శిలాయుగపు వలసల గుట్టు తేల్చేస్తాం!
సిద్దిపేట జిల్లాలో తవ్వకాలకు పురావస్తు శాఖ సిద్ధం సాక్షి, హైదరాబాద్: ఒక చోట నుంచి మరో చోటికి వలస వెళ్లడం సాధారణమే. కానీ కొన్ని వేల ఏళ్ల క్రితమే మధ్య ఆసియా ప్రాంతం నుంచి తెలంగాణ ప్రాంతానికి అప్పటి మానవులు వలసలు రావడం విశేషమే. ఇప్పటి ఇరాన్, ఇరాక్, పాలస్తీనా తదితర ప్రాంతాలకు చెందినవారు దాదాపు రెండున్నర వేల ఏళ్ల క్రితం తెలంగాణ ప్రాంతంలో మనుగడ సాగించినట్లుగా ఇటీవల ప్రాథమిక ఆధారాలు వెలుగుచూశాయి. అసలు అక్కడివారు ఇక్కడికి ఎందుకొచ్చారు, ఎలా వచ్చారు, తర్వాత ఏమయ్యారు.. ఇలా ఎన్నో అంతుచిక్కని సందేహాలు తలెత్తుతున్నాయి. కానీ ఇప్పుడా గుట్టు తేల్చే అధ్యయనం మొదలవుతోంది. బృహత్ శిలాయుగపు ఆనవాళ్లు, వలసల వెనుక విశేషాలను తేల్చేందుకు పురావస్తు శాఖ సిద్ధమైంది. ప్రఖ్యాత సంస్థలైన సెంటర్ ఫర్ సెల్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ), పుణేలోని డెక్కన్ కాలేజీ ఫర్ పోస్టు గ్రాడ్యుయేషన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నిపుణులతో కలసి తవ్వకాలు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ నెలాఖరులోనే సిద్దిపేట జిల్లాలోని నర్మెట్ట, పాలమాకుల ప్రాంతాల్లో తవ్వకాలు ప్రారంభించనుంది. రెండేళ్ల కిందటి తవ్వకాలతో.. పురావస్తు శాఖ రెండేళ్ల కింద సిద్దిపేట సమీపంలోని పుల్లూరులో బృహత్ శిలాయుగపు సమాధుల్లో తవ్వకాలు జరిపి మానవుల అవశేషాలను గుర్తించింది. అప్పట్లో వారు వాడిన వస్తువులు, పరికరాలు, ఆయుధాలను కూడా గుర్తించింది. సమాధిలో లభించిన మానవ అవశేషాలను సీసీఎంబీలో పరీక్షించారు. అయితే వాటిల్లోని డీఎన్ఏ తెలంగాణ స్థానికుల డీఎన్ఏతో సరిపోలలేదు. దాంతో వారు మరో ప్రాంతం నుంచి వలస వచ్చి ఉంటారని గుర్తించి పరిశోధన చేయగా... మధ్య ఆసియా దేశవాసుల డీఎన్ఏతో సరిపోలింది. ఈ నేపథ్యంలో ఆ మానవ సమూహం ఈ ప్రాంతానికి వలస వచ్చి, తిరిగి ఎక్కడికో వెళ్లిపోయిందని భావిస్తున్నారు. దీనిపై స్పష్టత కోసం మరిన్ని సమాధుల్లో తవ్వకాలు జరిపి పరీక్షలు నిర్వహించాలని పురావస్తుశాఖ నిర్ణయించింది. అయితే సాధారణ పద్ధతిలో తవ్వకాలు జరిపి, మానవ అవశేషాలను సేకరిస్తే అవి దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. దీంతో తవ్వకాలు జరపటంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన పుణే డెక్కన్ కాలేజీ నిపుణుల ఆధ్వర్యంలో తవ్వకాలు జరిపి, అక్కడే సీసీఎంబీ నిపుణులు శాంపిళ్లను సేకరించనున్నారు. ఈ మేరకు ఆ రెండు సంస్థలతో పురావస్తు శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తంగా తెలంగాణలో తొలిసారి పూర్తి శాస్త్రీయబద్ధంగా పురావస్తు తవ్వకాలు జరపబోతున్నారు. రెండు ప్రాంతాల ఎంపిక సిద్దిపేట జిల్లాలో రెండేళ్ల కింద తవ్వకాలు జరిపిన పుల్లూరుకు సమీపంలో ఉన్న నర్మెట్ట, పాలమాకుల గ్రామాల్లో వందకుపైగా బృహత్ శిలాయుగపు సమాధులు ఉన్నాయి. ఇలాంటి సమాధుల్లో ప్రముఖమైనవి ఉన్నప్పుడు పది అడుగుల కంటే పొడవైన నిలువు రాళ్లను పాతేవారు. వాటిని మెన్హిర్‌గా పేర్కొంటారు. నర్మెట్ట శివారులో దాదాపు 10 అడుగుల ఎత్తున్న ఒక మెన్హిర్ను గుర్తించారు. ఈ రెండు ప్రాంతాల్లో తవ్వకాలు జరపాలని భావిస్తున్నారు. ఈ నెలఖారున తవ్వకాలు ప్రారంభించి దాదాపు ఆరు వారాల పాటు కొనసాగించనున్నారు. పూర్తి శాస్త్రీయ సర్వే ఇది ‘‘శాస్త్రీయ పద్ధతిలో పురావస్తు తవ్వకాలు జరపడంలో పుణేలోని డెక్కన్ కళాశాల, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు ప్రపంచ స్థాయి ఖ్యాతి ఉంది. మానవ అవశేషాల గుట్టు విప్పడంలో సీసీఎంబీ పేరు గాంచింది. అలాంటి ఈ రెండు సంస్థల ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరిపే తొలి శాస్త్రీయ పరిశోధన ఇదే. బృహత్ శిలాయుగపు సమయంలో తెలంగాణకు వలసలు, ఆ సమూహాలు మరో ప్రాంతానికి వెళ్లటానికి కారణాలను విశ్లేషిస్తాం. ఇది చరిత్రలో కొత్త కోణాన్ని ఆవిష్కరించేందుకు దోహదం చేస్తుంది’’ – విశాలాచ్చి, పురావస్తుశాఖ డైరెక్టర్ -
రామప్పకు పొంచి ఉన్న ముప్పు
- పునాదులను తొలుస్తున్న చీమలు - శాండ్బాక్స్ టెక్నాలజీపై కాకతీయ కట్టడాలు - నిర్లక్ష్యపు నీడలో చారిత్రక ఆలయం సాక్షి, హన్మకొండ: విశిష్టమైన కాకతీయ కట్టడాలకు, అద్భుత శిల్పకళా సంపదకు నెలవైన రామప్ప ఆలయాన్ని నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి. చాపకింద నీరులా చీమలు ఈ ఆల యానికి చేటు చేస్తున్నాయి. ఆదిలోనే చీమల దండుకు అడ్డుకట్ట వేయకపోతే ఆలయ పునాదులు కదిలే ప్రమాదం ఉంది. వరంగల్ కేం ద్రంగా తెలుగు ప్రాంతాలను ఎనిమిది వందల ఏళ్ల క్రితం కాకతీయులు పాలించారు. వీరి కాలంలో గొలుసుకట్టు చెరువులతోపాటు వేయిస్తంభాల గుడి, రామప్ప ఆలయం , కీర్తితోరణాలు వంటి అనేక రాతి కట్టడాలను అద్భుతంగా నిర్మించారు. స్థానికంగా ఉండే భౌగోళిక పరిస్థితుల్లో ఎక్కువ కాలం కట్టడాలు నిలిచి ఉండేలా నాటి నిర్మాతలు జాగ్రత్తలు పాటించారు. 8 వందల ఏళ్ల క్రితమే శాండ్బాక్స్ పద్ధతి ద్వారా నిర్మాణాలు చేపట్టారు. వరంగల్ జిల్లాలో విస్తారంగా ఉన్న నల్లరేగడి నేలలో భారీ రాతికట్టడాలు కుంగి పోకుండా ఉండేందుకు ఈ పద్ధతిని అవలంభించారు. సంప్రదాయ పద్ధతికి భిన్నంగా పునాదుల నుంచి బలమైన శిలలను కాకుండా ఇసుకతో నింపారు. ఈ ఇసుక పునాదిపై రాళ్లను పేర్చుకుంటూ పోయి వేయిస్తంభాలగుడి, రామప్ప ఆలయాలను నిర్మించారు. ఎనిమిది వందల ఏళ్ల తర్వాత నేటికీ ఈ ఆలయాలు నిలిచి ఉండటానికి ఈ శాండ్ బాక్స్ టెక్నాలజీ ప్రధాన కారణం. చీమల కారణంగా ఈ కట్టడాలకు ప్రమాదం పొంచి ఉంది. రామప్పకు ముప్పు వరంగల్ జిల్లా వెంకటాపురం మండలం పాలంపేట గ్రామంలో రామప్పగుడిగా పిలవబడే రామలింగేశ్వరాలయం ఉంది. కాకతీయుల కాలం నాటి శిల్పకళా నైపుణ్యానికి రామప్ప ఆలయం నిదర్శనం. ఈ ఆలయంలో వేలాది శిల్పాలు ఉన్నాయి. ముఖ్యంగా మదనికలు, నాగిని శిల్పాలు చూసేందుకు విదేశీ యూత్రికులు వస్తుంటారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఆలయానికి చీమల బెడద పట్టుకుంది. నిర్మాణంలో ఉపయోగించిన శిలల మధ్య చీమలు ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఈ చీమల కారణంగా శాండ్ బాక్స్ టెక్నాలజీ ప్రకారం నిర్మించిన ఆలయ పునాదుల్లో ఉపయోగించిన ఇసుక బయటకు వచ్చి పేరుకుపోతుంది. ఇలా పేరుకుపోయిన ఇసుకను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు తప్పితే చీమల నివారణకు నిర్మాణాత్మక చర్యలు తీసుకోవడం లేదు. చీమల కారణంగా పునాదుల్లో ఇసుక బయటకు రావడం వల్ల ఆలయ పటిష్టతకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. నిర్లక్ష్యం చేస్తే.. రామప్ప ఆలయానికి ఇరువైపులా కాటేశ్వరాలయం, కామేశ్వరాలయం ఉన్నాయి. చీమల కారణంగా కామేశ్వరాలయం పునాదులు కుంగిపోవడంతో ఆలయం ఒకే వైపు నకు ఒరిగిపోయింది. ప్రమాదభరితంగా మారడంతో ఆలయాన్ని తొలగించారు. రామప్ప ఆలయంలో చీమల సంచారంపై నిర్లక్ష్యం వహిస్తే పునాదుల్లో ఉన్న ఇసుక నిల్వలు తగ్గిపోయేందుకు అవకాశముంది. దీని కారణంగా ఆలయం ప్రమాదంలో పడుతుందని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆలయం పైకప్పు కురుస్తోంది. అయినా పురావస్తుశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. -
అప్పాజిపేటలో అతి ఎత్తయిన స్మారక శిల
- 30 అడుగుల ఎత్తయిన శిలాయుగ - సమాధిని గుర్తించిన పురావస్తుశాఖ - నాటి తెగలకు చెందిన నాయకుడి సమాధిగా అంచనా - తెలుగు రాష్ట్రాల్లో ఇదే అతిపెద్ద స్మారక శిలా సమాధి సాక్షి ప్రతినిధి, నల్లగొండ : నల్లగొండ జిల్లాలో దాగి ఉన్న చారిత్రక సంపద అవశేషాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇటీవల తిప్పర్తి మండలం పజ్జూరు -ఎర్రగడ్డల గూడెం శివార్లలో ఆదిమానవుల పెద్ద సమాధిని చరిత్రకారులు వెలికి తీయగా, తాజాగా నల్లగొండ రూరల్ మండ లం అప్పాజిపేటలో కూడా అతిపెద్ద స్మారకశిలను పురావస్తుశాఖ అధికారులు గుర్తించారు. బృహత్కాల యుగం లో జీవించిన మానవుల సమాధుల్లో ఒక రకమైన స్మారక శిలా సమాధి ఇంత ఎత్తులో గుర్తించడం ఇదే ప్రథమమని అధికారులు చెబుతున్నారు. ఈ అతి ఎత్తై స్మారక శిలతో పాటు 50-70 వర్తులాకార సమాధులు, పరుపు బండ, సానబండ గుంతలు కూడా గుర్తించారు. వీటితో పాటు లింగాలపాడు అనే ప్రదేశంలో తొలి చారిత్రక యుగం నాటి అవశేషాలను కూడా వెలికితీయడం గమనార్హం. 30 అడుగుల ఎత్తులో : వాస్తవానికి బృహత్ కాలయుగం (క్రీస్తు పూర్వం 1000 నుంచి క్రీస్తు శకం 200 సంవత్సరం వరకు)లో వర్తులాకార, స్మారక శిల, గూడు, గుంత, రాతి గుహ సమాధులు ఉండేవి. ఈ ఐదింటిలో రెండు రకాలను నల్లగొండ మండలం అప్పాజీపేట, లింగాలపాడుల్లో గుర్తించారు. మంగళవారం అప్పాజిపేటలో పురావస్తు శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ నాగరాజు పరిశోధించగా దాదాపు 30 అడుగుల ఎత్తు, మీటరు వెడల్పు ఉన్న స్మారక శిల కింద సమాధి వెలుగుచూసింది. ఇది అప్పటి తెగ నాయకుడిది అయి ఉంటుందని పురావస్తుశాఖ అధికారులు భావిస్తున్నారు. ఇంత పెద్ద ఏకరాతి శిలను తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా చూడలేదని వారంటుండడం విశేషం. చారిత్రక అవశేషాలు కూడా : ఈ స్మారక శిల లభించిన చోటు నుంచి కిలోమీటరు దూరంలో ఉన్న లింగాలపాడులో తొలిచారిత్రక యుగం నాటి అవశేషాలు లభించాయి. పలు రంగుల్లో ఉన్న పెంకులను కూడా పురావస్తు అధికారులు గుర్తించారు. అక్కడే ఆనాటి ప్రజలు ఆడుకునేందుకు ఉపయోగించిన తొక్కుడు బిళ్లలు, పెద్ద పెద్ద ఇటుక ముక్కలు కూడా లభ్యమయ్యాయి. ఇవన్నీ క్రీస్తు శకం 1 నుంచి 4-5 శతాబ్దాలకు చెందినవి అయి ఉంటాయని, ఈ ఆధారాలు, విశేషాలను బట్టి ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున మానవ సమూహం అప్పట్లో నివసించి ఉంటారని అర్థమవుతోందని పురావస్తు అధికారులు చెపుతున్నారు. లింగాలపాడుకు అరకిలోమీటర్ దూరంలో సర్వే నం 170, 171, 172లలో ఉన్న 20 ఎకరాల విస్తీర్ణంలో బృహత్ శిలా యుగానికే చెందిన వర్తులాకార సమాధులు కూడా లభించాయి. తవ్వకాలకు అనుమతి కోరుతాం ‘ఇలాంటి చారిత్రక సంపదను పదిలపర్చుకోకపోతే భవిష్యత్తరాలు నష్టపోతాయి. అందుకే అప్పాజీపేట సమీపంలో గుర్తించినవాటి గురించి ప్రభుత్వానికి తెలియజేస్తాం. తవ్వకాలు జరిపితే తొలి చారిత్రక యుగ అవ శేషాలు, విశేషాలు వెలుగులోనికి వస్తాయి. ఈ మేరకు అనుమతి కోరుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాస్తాం.’ - పగడం నాగరాజు, పురావస్తు శాఖ ఏడీ -
ఆదిమ మానవుల ఆనవాళ్లు
‘గుండ్లపోచంపల్లి’లో వేల ఏళ్ల క్రితం సంచరించినట్లు చిత్రాలు గుట్టలపై జంతువుల బొమ్మలు మేడ్చల్: రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లి పరిధిలోని అటవీ ప్రాంతంలో వేల సంవత్సరాల క్రితం ఆదిమ మానవులు సంచరించిన ఆనవాళ్లు కనిపించాయి. గ్రామస్తుడు, పురావస్తు శాఖ స్కాలర్ సారుుకృష్ణ ఆదివారం ఈ విషయం ‘సాక్షి’కి వివరించారు. గుండ్లపోచంపల్లి శివారులో దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. సారుుకృష్ణ ఆరు నెలలుగా అడవిలో పర్యటించి వేల ఏళ్ల క్రితం ఆదిమ వూనవుల సంచారం ఉన్నట్లుగా గుర్తించారు. రాళ్లపై ఆదిమ మానవులు చెక్కిన అటవీ జంతువులుచిత్రాలు కనిపించాయి. జంతువులను వేటాడే విధానం, వేటకు ఉపయోగించిన ఆయుుధాలు చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తున్నారుు. అడవి జంతువులే జీవనాధారంగా బతికిన ఆదిమ మానవులు.. తాము నివాసవుుండే కొండరాళ్లపై వాటి చిత్రాలను రాతియుుగంలో చెక్కి ఉండొచ్చని సాయికృష్ణ వివరించారు. వేల సంవత్సరాల క్రితం గుండ్లపోచంపల్లి ఆదిమ మానవులు అటవీ ప్రాంతంలో సంచరించేవారని, దానికి సంబంధించిన ఆనవాళ్లు వెలుగు చూస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ విషయూన్ని పురావస్తు శాఖకు తెలియుజేసినట్లు ఆయున తెలిపారు. -
కరువు చెప్పిన ‘చరిత్ర’
♦ ఉదయసముద్రంలో బయటపడ్డ ‘శంభులింగాలయం’ ♦ రిజర్వాయర్‌లో నీరు అడుగంటడంతో వెలుగుచూసిన చోళుల కట్టడం సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఎప్పుడో ఏడెనిమిది వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయం.. నల్లగొండకు కూతవేటు దూరంలో ఉన్న పానగల్లును రాజధానిగా చేసుకుని పరిపాలించిన కందూరు చోళుల కాలం నాటి కట్టడం.. నల్లగా ధగధగలాడే రాతిస్తంభాలు, గర్భగుడిలో శివలింగం.. 18 స్తంభాలతో కూడిన నిర్మాణం.. వినాయకుడు, నంది విగ్రహాలు ఇలా.. చెక్కుచెదరని శిల్ప కళాచరిత్రను ‘కరువు’ బయటకు తీసింది. కాకతీయ రాజ్య సామంతుల ఏలుబడిలో నిర్మితమైన ‘శంభులింగేశ్వరుడి’ రూపాన్ని సాక్షాత్కరింపజేసింది. ఈ ఏడాది సంభవించిన కరువుతో ఉద యసముద్రం రిజర్వాయర్ అడుగంటింది. దీంతో ఈ గుడి వెలుగులోకి వచ్చింది. గతంలో రెండు, మూడుసార్లు రిజర్వాయర్‌లో నీళ్లులేక ఈ ఆలయం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఉదయ సముద్రంలో 0.1 టీఎంసీల కంటే తక్కువ నీరు ఉన్నందున మళ్లీ ఈ ఆలయం బయటపడడంతో దాన్ని పునర్నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. బయటపడ్డవి ఇవే.. అద్భుత కళా సంపదతో కూడిన రాతి కట్టడమైన ఈ ఆలయం.. నాటి శిల్పకళా నైపుణ్యానికి అద్దం పడుతోంది. ఆలయం పైకప్పుపై తామరపువ్వు ఆకారంలో చెక్కిన డిజైనే ఇందుకు నిదర్శనం. తూర్పుముఖంగా నిర్మితమైన ఈ ఆలయం పూర్తిగా గ్రానైట్ రాళ్లతో కట్టబడి ఉందని పురావస్తు అధికారులు చెబుతున్నారు. ఆలయ ముఖ ద్వారానికి ఉన్న గజలక్ష్మి మూర్తి విగ్రహం నాటి ప్రాచీన వైభవానికి ఆనవాళ్లని అంటున్నారు. ఇక.. గర్భాలయానికి ముందు కుడివైపున బొజ్జగణేశుడు, గర్భాలయంలోని లింగానికి ఎదురుగా నందీశ్వరుడు కూడా ఉన్నారు. దీంతో పాటు ఆచంద్రార్క శాసనం కూడా వెలుగుచూసింది. ఈ శాసనంపై చంద్రుడు, సూర్యుడు, శివలింగం చెక్కబడి ఉన్నాయి. సూర్య చంద్రులున్నంతవరకు తమ శాసనం ఉంటుందని చెప్పడం వారి ఉద్దేశమని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ శాసనంపై తెలుగు, సంస్కృతాలను పోలిఉన్న భాషలో అక్షరాలున్నాయి. ఈ శివాలయాన్ని మళ్లీ కట్టవచ్చు గుడి దగ్గర కనిపించిన శిల్పరీతులు, ప్రాథమిక ఆధారాలను బట్టి ఆ ఆలయం 11, 12 శతాబ్దాలకు చె ందినదిగా భావిస్తున్నాం. ఇక్కడి చారిత్రక సంపదనంతా తక్షణమే మ్యూజియానికి తరలించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం రిజర్వాయర్ పక్కనే స్థలం కేటాయిస్తే అక్కడే ఆలయాన్ని నిర్మించవచ్చు. అప్పుడు పర్యాటకంగా ఈ ఆలయానికి ఎంతో ప్రాధాన్యత పెరుగుతుంది. -పి. నాగరాజు, అసిస్టెంట్ డెరైక్టర్, పురావస్తు శాఖ -
30 వేల ఏళ్ల నాటి ఆదిమానవుల చిత్రాలు
నెల్లూరు జిల్లా ఘటికసిద్ధేశ్వరంలో వెలుగులోకి.. పరిశీలించిన పురావస్తు బృందం ఉదయగిరి: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం ఘటికసిద్ధేశ్వరంలో కనిగిరి విద్యార్థి కనుగొన్న మధ్యయుగం నాటి ఆదిమానవుని చిత్రాలను రీజి నల్ పురావస్తు శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ జనకర్, పురావస్తు అన్వేషిత బృంద సభ్యులు శనివారం పరిశీలించారు. మరికొన్ని చిత్రాలను కూడా ఆ ప్రాంతంలో కనుగొన్నారు. ఇవి 30 వేల సంవత్సరాల నాటివని పేర్కొన్నారు. జిల్లాలో మొట్టమొదటిసారిగా ఇవి బయటపడినట్లు వారు చెప్పారు. ఆదిమానవులు చిత్రించిన బొమ్మల స్థావరాలు మన రాష్ట్రంలో 13 ఉన్నాయని, జిల్లాలో మాత్రం ఇవేనని తెలిపారు. దాదాపు రెండున్నర అడుగుల ఎత్తులో ఎరువురంగులో చేతిలో మండతోవున్న ఆదిమ మానవుని ఆకృతి భారతదేశంలో అరుదైన చిత్రమని చెప్పారు. ఆది మానవుని జీవన విధానాన్ని ప్రతిబించించే జింకలవేట, చేపల వేట చిత్రాలను కూడా కనుగొన్నట్లు వెల్లడించారు. రాతి గొడ్డళ్లు, కత్తులు, ఆయుధాలు కూడా ఈ బొమ్మల్లోనే నిగూఢమై ఉన్నాయన్నారు. సీతారామపురానికి ఏడు మైళ్ల దూరంలోని కొండ గుహలో వంద అడుగుల వెడల్పయిన రాతిపై 12 అడుగుల ఎత్తులో సుమారు 20కి పైగా చిత్రాలు ఉన్నాయన్నారు. వీటిని సంరక్షించే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరతామన్నారు. వీటిపై మరిన్ని పరిశోధనలు చేస్తే ఆసక్తికర విషయాలెన్నో వెలికితీయవచ్చన్నారు. ఈ బృందంలో డాక్టర్ ధనిశెట్టి లెనిన్, కొండ్రెడ్డి భాస్కర్, రమణారెడ్డి, ఎస్కె.అమ్మసావలి, అల్లం రామ్మూర్తి, గువ్వకల హరీష్ ఉన్నారు. -
తవ్వకాల్లో బయటపడ్డ 13వ శతాబ్దంనాటి కల్యాణ మండపం
బల్లికురవ: ప్రకాశం జిల్లా బల్లికురవ మండలంలోని కొణిదెన గ్రామంలో ఆలయ పనుల తవ్వకాల్లో 13వ శతాబ్దం నాటి చోళరాజుల కల్యాణ మండపం బయటపడింది. గ్రామ సమీపంలోని భవానీ సమేత శంకరస్వామి, వేణుగోపాలస్వామి ఆలయాలు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయాలు జీర్ణావస్థలో ఉండడంతో పురావస్తు శాఖ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఇందులో భాగంగా చేపట్టిన తవ్వకాల్లో వంటశాల మండపంతోపాటు కల్యాణ మండపం బయటపడ్డాయని, వీటిని కూడా అభివృద్ధి చేస్తామని పురావస్తు శాఖ డీఈ బంగారప్ప తెలిపారు. -
తాడ్వాయి అడవుల్లో డోల్మన్ సమాధులు
♦ ఒక్కోటి 15 అడుగుల పొడవు, వెడల్పున్న రాతి సమాధులు ♦ రెడ్డి రత్నాకర్‌రెడ్డి పరిశోధనలో వెలుగులోకి వచ్చిన ప్రాచీన చరిత్ర ములుగు: వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం దామరవాయి గ్రామానికి కిలోమీటరున్నర దూరంలో ఉన్న సూరగుండయ్య గుట్టల్లో 10 వేల ఏళ్ల కిందటి ప్రాచీన సమాధులు వెలుగుచూశాయి. ప్రముఖ చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి.. తన బృందం సభ్యుడు పకిడె అరవింద్, స్థానికులు మహేశ్, లక్ష్మయ్య, హరిలాల్ సహకారంతో చేసిన పరిశోధనలో ఇవి బయటపడ్డాయి. సూర గుండయ్య గుట్ట ఆది మానవులకు ఆవాసంగా ఉండేదని, ఇక్కడ బయల్పడిన సమాధులు ఆనాటి మానవజాతి నమ్మకాలు, విలువల సాంకేతిక పరిజ్ఞానానికి ఆనవాళ్లుగా ఉన్నాయని తెలిసింది. గుట్టకు కుడి, ఎడమ వైపులా నిరంతరం ప్రవహించే వాగు, దట్టమైన అడవి ఉండడం వల్ల ఆది మానవులకు ఆవాసంగా మారిందని ఆయన చేసిన చరిత్ర పరిశోధనలో తేలింది. సమాధి రాళ్లను తొలచి, సమాధుల నిర్మాణ ప్రాంతాలకు తరలించడం, టన్నుల కొద్దీ బరు వు ఉండే పైకప్పు బండలను వాటిపై అమర్చ డం విశేషంగా కనబడుతుంది. ఇసుకరాయితో ఏర్పడ్డ సూరగుండయ్య గుట్టను పలకలు పలకలుగా తొలచి ‘గది’లా నిర్మాణం చేశారు. సమాధులపై ‘ఏకరాయి కప్పు బండ’లను అమర్చిన తీరు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రతి సమాధికీ ప్రవేశమార్గం ఓ మనిషి చొరబడేలా ఉంది. ఎటు చూసినా 15 అడుగుల పొడవు, వెడల్పు ఉన్న ఏకరాతి బండల సమాధులు తొలిసారి ఇక్కడే వెలుగుచూశాయి. ఈ కప్పు బండలు రెండు నుంచి మూడు ఫీట్లకుపైగా సమాన మందంతో ఉన్నాయి. చాలా సమాధుల్లో లోతు తక్కువ ఉన్న 5 నుంచి 6 అడుగుల నీటి తొట్లు ఉన్నాయి. ఒక సమాధిలో మూడు నీటి తొట్లు ఉండడం విశేషం. వీటిని డోల్మన్ సమాధులు అంటారని పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి తెలిపారు. మూడు రకాల్లో... సూరగుండయ్య గుట్ట ప్రాంతంలో మూడు రకాల డోల్మన్ సమాధులు కనిపిస్తున్నాయి. వాటిలో మొదటి రకం నేలపై, రెండవ రకం రాతిపై, మూడో రకం రాళ్లను కుప్పగా పోసి మధ్యలో సమాధి నిర్మించిన ఆనవాళ్లున్నాయి. రాతిపై నిర్మించినవి మినహా మిగతా రెండు రకాల సమాధులు దీర్ఘ చతురస్రాకారంలో నిలబెట్టి ఉన్నా యి. ప్రాచీన ఆదిమానవుల సమాధుల్లో ఉన్న శిలువాకృతులు ప్రత్యేకంగా కనిపిస్తాయి. గతంలో ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శిలువ ఆకృతి సమాధి బయటపడింది. అయితే దామరవాయిలో కేవలం శిలువాకృతులు సమాధిపై పెట్టడానికి మాత్రమే అన్నట్లుగా ఉపయోగించబడ్డాయి. రెండు రాళ్ల కుప్పలపై నిర్మించబడిన డోల్మన్ సమాధుల మధ్య విరిగి పోయి ఉన్న శిలువాకృతులు 4 అడుగుల పొడవున కనిపిస్తాయి. అనేక శిలువాకృతులు బండను తొలిచినట్లుగా ఉన్నాయి. అప్పటికే అక్కడ నివసించిన జాతి వలసపోవడం, బలహీనపడి అంతరించిపోవడం లాంటివి జరిగి ఉండవచ్చని ఈ పరిశోధకుడి అంచనా. శిలువాకృతులు ఏసుక్రీస్తు శిలువను పోలి ఉన్నాయి. ఇవి క్రీస్తుపూర్వం నాటివని పరిశోధకుడు తెలిపారు. సమాధులపై పురావస్తు శాఖ సమగ్ర అధ్యయనంచేసి పూర్తిస్థాయిలో వెలుగులోకి తీసుకొస్తే.. పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడి సమాధుల లెక్కను తేల్చి, ఆది మానవుల సంప్రదాయ పనిముట్లను బయటి ప్రపంచానికి తెలిసేలా కృషి చేయాలని పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి కోరారు. -
రాష్ట్రానికి కన్నన్ సేవలు
♦ పురావస్తు సంపద వెలికితీతలో దిట్ట ♦ తమిళనాడులో త్వరలో పదవీ విరమణ చేయనున్న సీనియర్ ఐఏఎస్ ♦ రాష్ట్రంలో కన్సల్టెంట్‌గా నియమించేందుకు సన్నాహాలు సాక్షి, హైదరాబాద్ : ప్రపంచంలోనే అద్భుతమనదగ్గ చక్రాకార బౌద్ధస్తూపం ఎక్కడుందో తెలుసా...? అది మన రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో భూమిలో కూరుకుపోయి మగ్గుతోంది. దాదాపు 180 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ స్థూపాన్ని ఇంతవరకు వెలికి తీయలేదు. శాతవాహనకాలం కంటే దాదాపు రెండు శతాబ్దాలకుముందే అద్భుత పట్టణంగా విలసిల్లిన నాటి రాజధాని నగరం కోటిలింగాల. ఆ రాజధాని అందాలన్నీ భూగర్భంలో పదిలంగా ఉన్నాయి. వాటిని చూసే భాగ్యం ఇంకా మనకు దక్కలేదు. ఇలాంటి అద్భుత చారిత్రక ఔన్నత్యాన్ని భావితరాల కళ్లముందుంచాలంటే శాస్త్రీయ పద్ధతిలో తవ్వకాలు జరగాల్సి ఉంది. కానీ అంత సామర్థ్యం ప్రస్తుతం మన పురావస్తు శాఖకు లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలకు సిద్ధమవుతోంది. పురావస్తు సంపదను వెలుగులోకి తేవటంలో ప్రత్యేక నిపుణుడిగా ముద్రపడ్డ డాక్టర్ కన్నన్ సేవలను తీసుకోబోతోంది. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో పనిచేస్తున్న ఈ సీనియర్ ఐఏఎస్ అధికారి త్వరలో పదవీవిరమణ చేయబోతున్నారు. ఆ తర్వాత ఆయన తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక కన్సల్టెంట్‌గా సేవలందించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం ఆయనతో సంప్రదించింది. తంజావూరు చిత్రాలు, కుంభకోణం దేవాలయాలు... ఇలా తమిళనాట ఎన్నో చారిత్రక అద్భుతాలను వెలికితీసి కళ్లముందు నిలపటంలో ఆయన కృషి ఎనలేనిది. దాదాపు 15 సంవత్సరాలుగా పురావస్తు శాఖను పర్యవేక్షిస్తున్న ఆయన అక్కడి పర్యాటకరంగ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. చారిత్రక అద్భుతాలున్నాయని రూఢీ అయితే చాలు శాస్త్రీయ పద్ధతిలో తవ్వకాలు జరిపి వాటిని వెలుగులోకి తెచ్చేందుకు ఆయన పట్టుదలగా పనిచేస్తారన్న పేరుంది. ఇప్పుడు పదవీ విరమణ ముంగిట ఉన్న ఆయన సేవలను తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పూర్తి తవ్వకాలతో అద్భుత విశేషాలు వెలుగులోకి దేశంలో గొప్ప బౌద్ధ స్తూపాలు, ఆరామాలకు బిహార్, ఉత్తరప్రదేశ్ తర్వాత తెలంగాణ రాష్ట్రమే ప్రసిద్ధి గాంచింది. మెదక్ జిల్లా కొల్చారం, కొండాపూర్, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, ఫణిగిరి, నల్లగొండ జిల్లా చాడ, నాగార్జునసాగర్ పరిసరాలు... ఇలా ఎన్నో ప్రాంతాలున్నాయి. ఈ ప్రాంతాల్లో కొంతమేర మాత్రమే తవ్వకాలు జరిగాయి. అవి పూర్తిచేస్తే ఎన్నో అద్భుత విశేషాలు వెలుగుచూస్తాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అందుకు సరైన మార్గనిర్దేశకత్వం అవసరం. దాన్ని కన్నన్లాంటి వారితో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన స్వదేశీ దర్శన్, ప్రసాద్ పథకాల ద్వారా వీటికి నిధులు తెచ్చే ప్రయత్నంలో ఉన్న ప్రభుత్వం ఇటీవలే మహబూబ్‌నగర్ జిల్లాకు రూ.95 కోట్లు సాధించింది. వచ్చే సంవత్సరం బద్ధిస్ట్ సర్క్యూట్ కోసం కనీసం రూ.100 కోట్లు పొందే ప్రయత్నం చేస్తోంది. అప్పటికల్లా ఓ రూట్ మ్యాప్‌ను సిద్ధం చేయబోతోంది. దానికి డాక్టర్ కన్నన్ నేతృత్వం వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. -
‘కోట’పై జెండాకు ఓకే
సాక్షి, హైదరాబాద్ : చారిత్రక గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవాలను జరిపేందుకు కేంద్ర పురావస్తు శాఖ అనుమతించింది. రాష్ట్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే చేసిన దరఖాస్తుకు స్పందించిన ఆ శాఖ షరతులతో అప్పట్లోనే తాత్కాలికంగా ఓకే అంది. ఇప్పుడు అధికారికంగా లిఖితపూర్వక అనుమతి మంజూరు చేస్తూనే నిబంధనలు విధించింది. ప్రభుత్వ కార్యక్రమం కోసం గోల్కొండ కోట ప్రాంగణాన్ని వినియోగిస్తున్నందున నిర్దేశిత అద్దె, సెక్యూరిటీ డిపాజిట్ చె ల్లించాలని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రూ.60 వేలను గోల్కొండ కోట ఇన్ఛార్జిగా ఉన్న ఏఎస్ఐ అధికారికి చెల్లించి అధికారిక అనుమతి పత్రం పొందింది. ఈ అనుమతి కేవలం ఆగస్టు 15కే పరిమితమని, మరుసటి రోజు కోటలో ప్రభుత్వపరంగా ఎలాంటి కార్యక్రమాలు జరపొద్దని, కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన వస్తువులు, పరికరాలను కూడా తొలగించాలని సూచించింది. 15న భద్రతాపరమైన చర్యల పేర సందర్శకులకు ఇబ్బందులు సృష్టించొద్దని స్పష్టం చేసింది. కోటలో పంద్రాగస్టు వేడుకలు నిర్వహిస్తుండటంతో జీహెచ్ఎంసీ రోడ్లను ముస్తాబు చేసింది. ప్రధాన రోడ్లన్నింటిని కొత్తగా నిర్మించటం ఎంతో ఆనందంగా ఉందని ఏఎస్ఐ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్టు కృష్ణయ్య హర్షం వ్యక్తం చేశారు.