సాక్షి, హైదరాబాద్ : చారిత్రక గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవాలను జరిపేందుకు కేంద్ర పురావస్తు శాఖ అనుమతించింది. రాష్ట్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే చేసిన దరఖాస్తుకు స్పందించిన ఆ శాఖ షరతులతో అప్పట్లోనే తాత్కాలికంగా ఓకే అంది. ఇప్పుడు అధికారికంగా లిఖితపూర్వక అనుమతి మంజూరు చేస్తూనే నిబంధనలు విధించింది. ప్రభుత్వ కార్యక్రమం కోసం గోల్కొండ కోట ప్రాంగణాన్ని వినియోగిస్తున్నందున నిర్దేశిత అద్దె, సెక్యూరిటీ డిపాజిట్ చె ల్లించాలని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రూ.60 వేలను గోల్కొండ కోట ఇన్‌ఛార్జిగా ఉన్న ఏఎస్‌ఐ అధికారికి చెల్లించి అధికారిక అనుమతి పత్రం పొందింది. ఈ అనుమతి కేవలం ఆగస్టు 15కే పరిమితమని, మరుసటి రోజు కోటలో ప్రభుత్వపరంగా ఎలాంటి కార్యక్రమాలు జరపొద్దని, కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన వస్తువులు, పరికరాలను కూడా తొలగించాలని సూచించింది. 15న భద్రతాపరమైన చర్యల పేర సందర్శకులకు ఇబ్బందులు సృష్టించొద్దని స్పష్టం చేసింది. కోటలో పంద్రాగస్టు వేడుకలు నిర్వహిస్తుండటంతో జీహెచ్‌ఎంసీ రోడ్లను ముస్తాబు చేసింది. ప్రధాన రోడ్లన్నింటిని కొత్తగా నిర్మించటం ఎంతో ఆనందంగా ఉందని ఏఎస్‌ఐ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్టు కృష్ణయ్య హర్షం వ్యక్తం చేశారు.