సాక్షి, న్యూఢిల్లీ: గతేడాది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఢిల్లీలో నిర్వహించామని, ఈసారి గోల్కొండ కోటలో ఘనంగా నిర్వహిస్తున్నామని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి జి.కిషన్‌రెడ్డి చెప్పారు. రేపు గోల్కొండ కోటపై త్రివర్ణపతాకాన్ని ఎగురవేయడంతోపాటు సాయుధ బలగాల పరేడ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సాయంత్రం జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో శంకర్ మహదేవన్, డాక్టర్ ఆనంద శంకర్ బృందం, మంజులా రామస్వామి బృందం ప్రదర్శనలు ఉంటాయన్నారు అలాగే, మంగ్లీ, మధుప్రియలు తెలంగాణ సంప్రదాయాన్ని, ఉద్యమాన్ని ప్రతిబింబించే పాటలు పాడతారని తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ రాజ్‌భవన్లలోనూ తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతాయన్నారు. బుధవారం ఢిల్లీలోని తన నివాసంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
కుటుంబపాలనకు చరమగీతం
రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబ వ్యతిరేక ఓట్లు చీల్చేందుకు కాంగ్రెస్–బీఆర్‌ఎస్ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని కిషన్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ బలపడితే తమకు నష్టమని బీఆర్‌ఎస్ భావిస్తోందన్నారు. అయితే, అవినీతి, నియంతృత్వ, కుటుంబపాలనకు చరమగీతం పాడాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. తెలంగాణలో బీజేపీ నేతల మధ్య విభేదాల్లేవని, కొందరు ఉద్దేశపూర్వకంగానే ఈ వివాదాలను సృష్టిస్తున్నారన్నారు. బీజేపీలో చేరిన నాయకులు బీజేపీలోనే ఉంటారని, పార్టీ కోసమే రోజూ పోరాడుతున్నారని స్పష్టత ఇచ్చారు. రాబోయే రోజుల్లో అనేక మంది నాయకులు తమ పార్టీలో చేరనున్నారని చెప్పారు.
తొమ్మిదేళ్లలో తెలంగాణకు కేంద్రం అందించిన సహకారాన్ని వివరిస్తూ త్వరలోనే ప్రజలముందు పూర్తి వివరాలతో ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధంగానే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని.. ఈ విషయంలో విభేదాలకు తావిచ్చేలా, ప్రజలను రెచ్చగొట్టేలా ఎవరూ వ్యాఖ్యానించవద్దని హితవు పలికారు.
దక్షిణ భారతం–ఉత్తర భారతం అంటూ విభేదాలను ప్రోత్సహించేందుకు పనిచేస్తున్న వారికి.. కేంద్ర ప్రభుత్వం ‘ఏక్ భారత్–శ్రేష్ఠ్ భారత్’పేరుతో చేపడుతున్న కార్యక్రమాలు కనిపించడం లేదా? అని కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. కాగా, ఇటీవల పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతిష్టించిన పవిత్ర రాజదండం ‘సెంగోల్’రూపకల్పనలో కీలకంగా వ్యవహరించిన తమిళనాడులోని తిరువడుత్తురై ఆధీనానికి ప్రస్తుత పీఠాధిపతి శ్రీ అంబలవాన పండారా సన్నిధి స్వామి కిషన్‌రెడ్డిని కలిసి ఆశీర్వదించారు.
కేంద్రం ఆధ్వర్యంలో ఆవిర్భావ ఉత్సవాలు
Published Thu, Jun 1 2023 1:19 AM | Last Updated on Thu, Jun 1 2023 1:19 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment