మ్యూజియాలు భద్రమేనా? | There is no proper Museum security | Sakshi
Sakshi News home page

మ్యూజియాలు భద్రమేనా?

Published Sun, Sep 9 2018 2:48 AM | Last Updated on Sun, Sep 9 2018 2:48 AM

There is no proper Museum security - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఘనమైన గత వైభవానికి ప్రతీక.. భావితరాలకు జ్ఞాపిక.. పూర్వీకులు మనకిచ్చిన పురాతన చారిత్రక సంపద. తరతరాల చరిత్రకు ఆధారాలు, అలనాటి పాలనకు దర్పణాలు ఆ విలువైన పురాతన వస్తువులు. అత్యంత విలువైన ఆ సంపదకు క్రమంగా ఆపద ముంచుకొస్తోంది. చారిత్రక సంప దను కాపాడాల్సిన మ్యూజియాలకు రక్షణ కరువవుతోంది. చరిత్రను చాటే ఆనవాళ్లు ఒక్కొక్కటిగా కాలగర్భంలో కలసిపోయే పరిస్థితి తలెత్తుతోంది.  

‘నిజాం’లో చోరీ: పురావస్తు శాఖ నిర్వహిస్తున్న మ్యూజియాల్లో కొన్నింటికి రక్షణ కరువై విలువైన సంపద దుండగుల చేతికి చిక్కుతోంది. ఇటీవలి హైదరాబాద్‌ నిజాం మ్యూజియం దొంగతనమే ఇందుకు ఉదాహరణ. మ్యూజియాలపై ప్రభుత్వాల అలసత్వం, అక్కడ తగినంత భద్రత, సీసీ కెమెరాలు లేకపోవడం చోరీలకు కారణంగా చెప్పొచ్చు. పురావస్తు శాఖకు బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటాయించకపోవడం, సిబ్బంది నియామకాలు చేపట్టకపోవడం కూడా ఆ శాఖపై చిన్నచూపును తెలుపుతోంది. రాష్ట్రంలోని పురావస్తు శాఖలో 200 మంది సిబ్బంది అవసరం ఉండగా 50 మంది కూడా లేకపోవడంతో మ్యూజియాలకు రక్షణ లేకుండా పోతుంది.  

అన్నింటా విలువైన సంపదే 
హైదరాబాద్‌లో రాష్ట్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి స్మారక మ్యూజియం, సెంటినరీ జూబ్లీ హెరిటేజ్‌ మ్యూజియం, ఖజానా, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, పిల్లలమర్రి, అలంపూర్, పానగల్‌ మ్యూజియాలతో పాటు నాగార్జునసాగర్, కొలనుపాకలో పురావస్తు శాఖ వస్తు ప్రదర్శన శాలలు నడుస్తున్నాయి. వీటిల్లో రాజుల కాలం నాటి ఆయుధాలు, మట్టి కుండలు సహా మరిన్ని విలువైన వస్తువులున్నాయి.  

నాగార్జున కొండ మ్యూజియం 
1959లో అప్పటి విద్యా శాఖ మంత్రి హుమాయన్‌ కబీర్‌ మ్యూజియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 1923 నుంచి 1960 వరకు నాగార్జునసాగర్‌ పరిసరాల్లో పురావస్తు శాఖ వారు నిర్వహించిన తవ్వకాల్లో బయటపడిన శిలలు, శిల్పాలు, శాసనాలు ఇక్కడ ఉన్నాయి. 

ఫణిగిరిలో ఓ ఇంట్లో..: రాష్ట్రంలో పలుచోట్ల చారిత్రక వస్తువులు, ఆనవాళ్లు గుర్తించినా భద్రపరచడానికి నిధులు, సరిపడా సిబ్బంది లేక పురావస్తు శాఖ కునారిల్లుతోంది. ఫణిగిరిలోని విలువైన సంపదను గ్రామంలోని ఓ ఇంటి గదిలో ఉంచారు. పానగల్‌ మ్యూజియంలోనూ అనేక విగ్రహాలు ఆలనాపాలనా లేకుండా పడి ఉన్నాయి. 

‘పానగల్‌’కు రక్షణేదీ?
నల్లగొండ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోని పానగల్‌ ఆర్కియాలజీ మ్యూజియాన్ని 1992లో ఏర్పాటు చేశారు. అనేక వినతుల తర్వాత మ్యూజియం ఏర్పాటు చేసినా దాని అభివృద్ధిని, జిల్లాలోని పురాతన వస్తువుల పరిరక్షణనూ గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు.  తమకున్న పరిధిలో చాలీచాలని సిబ్బందితోనే చారిత్రక సంపద పట్ల ఆసక్తి ఉన్న శాఖ ఉద్యోగులు, ఇతర చరిత్రకారుల సాయంతో సంపద పరిరక్షణకు తోచింది చేస్తున్నారు. మ్యూజియానికి కనీసం ప్రహరీ కూడా లేకపోవడంతో ఆరుబయట ఉన్న విగ్రహాలు, వస్తువులకు రక్షణ కరువైంది. 2014లో ఈ మ్యూజియం నుంచి 12వ శతాబ్దం నాటి గణపతి విగ్రహాన్ని దుండగులు అపహరించారు. సిబ్బంది సంఖ్య అరకొరగానే ఉండటంతో పగలు ఒకరు, రాత్రి ఇద్దరే (ఒకరు తాత్కాలిక ఉద్యోగి) రక్షణగా ఉంటున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement