రాష్ట్రానికి కన్నన్ సేవలు
♦ పురావస్తు సంపద వెలికితీతలో దిట్ట
♦ తమిళనాడులో త్వరలో పదవీ విరమణ చేయనున్న సీనియర్ ఐఏఎస్
♦ రాష్ట్రంలో కన్సల్టెంట్‌గా నియమించేందుకు సన్నాహాలు
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచంలోనే అద్భుతమనదగ్గ చక్రాకార బౌద్ధస్తూపం ఎక్కడుందో తెలుసా...? అది మన రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో భూమిలో కూరుకుపోయి మగ్గుతోంది. దాదాపు 180 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ స్థూపాన్ని ఇంతవరకు వెలికి తీయలేదు. శాతవాహనకాలం కంటే దాదాపు రెండు శతాబ్దాలకుముందే అద్భుత పట్టణంగా విలసిల్లిన నాటి రాజధాని నగరం కోటిలింగాల. ఆ రాజధాని అందాలన్నీ భూగర్భంలో పదిలంగా ఉన్నాయి. వాటిని చూసే భాగ్యం ఇంకా మనకు దక్కలేదు. ఇలాంటి అద్భుత చారిత్రక ఔన్నత్యాన్ని భావితరాల కళ్లముందుంచాలంటే శాస్త్రీయ పద్ధతిలో తవ్వకాలు జరగాల్సి ఉంది. కానీ అంత సామర్థ్యం ప్రస్తుతం మన పురావస్తు శాఖకు లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలకు సిద్ధమవుతోంది. పురావస్తు సంపదను వెలుగులోకి తేవటంలో ప్రత్యేక నిపుణుడిగా ముద్రపడ్డ డాక్టర్ కన్నన్ సేవలను తీసుకోబోతోంది.
ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో పనిచేస్తున్న ఈ సీనియర్ ఐఏఎస్ అధికారి త్వరలో పదవీవిరమణ చేయబోతున్నారు. ఆ తర్వాత ఆయన తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక కన్సల్టెంట్‌గా సేవలందించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం ఆయనతో సంప్రదించింది. తంజావూరు చిత్రాలు, కుంభకోణం దేవాలయాలు... ఇలా తమిళనాట ఎన్నో చారిత్రక అద్భుతాలను వెలికితీసి కళ్లముందు నిలపటంలో ఆయన కృషి ఎనలేనిది. దాదాపు 15 సంవత్సరాలుగా పురావస్తు శాఖను పర్యవేక్షిస్తున్న ఆయన అక్కడి పర్యాటకరంగ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. చారిత్రక అద్భుతాలున్నాయని రూఢీ అయితే చాలు శాస్త్రీయ పద్ధతిలో తవ్వకాలు జరిపి వాటిని వెలుగులోకి తెచ్చేందుకు ఆయన పట్టుదలగా పనిచేస్తారన్న పేరుంది. ఇప్పుడు పదవీ విరమణ ముంగిట ఉన్న ఆయన సేవలను తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
పూర్తి తవ్వకాలతో అద్భుత విశేషాలు వెలుగులోకి
దేశంలో గొప్ప బౌద్ధ స్తూపాలు, ఆరామాలకు బిహార్, ఉత్తరప్రదేశ్ తర్వాత తెలంగాణ రాష్ట్రమే ప్రసిద్ధి గాంచింది. మెదక్ జిల్లా కొల్చారం, కొండాపూర్, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, ఫణిగిరి, నల్లగొండ జిల్లా చాడ, నాగార్జునసాగర్ పరిసరాలు... ఇలా ఎన్నో ప్రాంతాలున్నాయి. ఈ ప్రాంతాల్లో కొంతమేర మాత్రమే తవ్వకాలు జరిగాయి. అవి పూర్తిచేస్తే ఎన్నో అద్భుత విశేషాలు వెలుగుచూస్తాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అందుకు సరైన మార్గనిర్దేశకత్వం అవసరం.
దాన్ని కన్నన్‌లాంటి వారితో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన స్వదేశీ దర్శన్, ప్రసాద్ పథకాల ద్వారా వీటికి నిధులు తెచ్చే ప్రయత్నంలో ఉన్న ప్రభుత్వం ఇటీవలే మహబూబ్‌నగర్ జిల్లాకు రూ.95 కోట్లు సాధించింది. వచ్చే సంవత్సరం బద్ధిస్ట్ సర్క్యూట్ కోసం కనీసం రూ.100 కోట్లు పొందే ప్రయత్నం చేస్తోంది. అప్పటికల్లా ఓ రూట్ మ్యాప్‌ను సిద్ధం చేయబోతోంది. దానికి డాక్టర్ కన్నన్ నేతృత్వం వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.