పరీక్షలు లేకుండానే.. విమానాలు నడిపేశారు!!
గడిచిన సంవత్సరంలో.. అంటే 2014లో ఏకంగా 320 మంది పైలట్లు తగిన సామర్థ్య పరీక్షలు చేయించుకోకుండానే విమానాలు నడిపేశారు. వాళ్లలో 219 మంది ప్రైవేటు ఎయిర్లైన్స్కు చెందినవారు కాగా మరో 101 మంది మాత్రం ఎయిరిండియా వాళ్లు. ఈ విషయాన్ని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు పార్లమెంటుకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు. అత్యధికంగా జెట్ ఎయిర్వేస్ పైలట్లు 130 మంది ఈ పరీక్షలు చేయించుకోలేదు. తర్వాతి స్థానంలో ఎయిరిండియా నిలిచింది. ఈ పైలట్లందరికీ డీజీసీఏ వర్గాలు లైసెన్సులను సస్పెండ్ చేసి, హెచ్చరిక లేఖలు కూడా ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
అంతేకాదు.. 19 కేసుల్లో అయితే పైలట్ లైసెన్సులు పొందడానికి తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించినట్లు కూడా జైపూర్లోని రాజస్థాన్ ఫ్లయింగ్ స్కూట్ చీఫ్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్ గుర్తించారు. అయితే ప్రస్తుత సంవత్సరంలో అలాంటి కేసులేవీ డీజీసీఏ దృష్టికి రాలేదని అశోక్ గజపతి రాజు చెప్పారు.