అఫ్ఘాన్లో నలుగురు భారతీయుల మృతి
తాలిబన్ ఉగ్రవాదులు అఫ్ఘాన్ రాజధాని కాబూల్ నగరంలోని ఓ గెస్ట్హౌస్లోకి చొరబడి విచ్చలవిడిగా కాల్పులు జరిపిన ఘటనలో నలుగురు భారతీయులతో పాటు ఓ అమెరికన్ మరణించారు. విదేశీయులు ఎక్కువగా సందర్శిస్తూ ఉండే ఆ గెస్ట్హౌస్లోనే భారత రాయబారి కూడా ఉండి ఉంటారన్న అనుమానంతోనే తాలిబన్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. కొన్ని గంటల పాటు కాల్పులు జరిగిన తర్వాత ఉగ్రవాదులను పోలీసులు మట్టుబెట్టారు.
బుధవారం రాత్రి 9 గంటల సమయంలో (అఫ్ఘాన్ కాలమానం) ముగ్గురు సాయుధ ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. సమాచారం అందిన కొద్దిసేపటికే అఫ్ఘాన్ జాతీయ భద్రతాదళం, ప్రత్యేక బలగాలు అక్కడకు చేరుకున్నాయి. దుండగులపై కాల్పులు జరిపి, గెస్ట్హౌస్లో బందీలుగా ఉన్నవారిని విడిపించే ప్రయత్నం చేశారు. దాడిలో నలుగురు భారతీయులు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడిలో మొత్తం ఎంతమంది మరణించారన్న విషయంపై మాత్రం స్పష్టత రాలేదు. తొలుత మొత్తం 9 మంది మరణించారని, వారిలో ఇద్దరు భారతీయులున్నారని అన్నారు. కానీ తర్వాత మృతుల్లో భారతీయుల సంఖ్య నాలుగని తేలింది.