నాలుగేళ్ల పాపకు 9వ తరగతిలో అడ్మిషన్
లక్నో : నాలుగేళ్ల పిల్లలు.. మహా అయితే ఏం చేస్తారు? వారి చిట్టిపొట్టి మాటలతో తల్లిదండ్రులను అలరిస్తూ.. ఇళ్లంతా కలయతిరుగుతూ తెగ సందడిచేస్తుంటారు. కానీ ఓ నాలుగేళ్ల పాప, అప్పుడే ఓనమాలు నేర్చుకోవాల్సి వయసులో తొమ్మిదో తరగతి అడ్మిషన్ కొట్టేసి అద్భుతం సృష్టించింది. నాలుగేళ్ల.. ఎనిమిది నెలల.. 21 రోజుల అనన్య వర్మ, విద్యాశాఖ సమ్మతితో లక్నో స్కూల్లో అధికారికంగా అడ్మిషన్ దక్కించుకుంది. అయితే తను ఒక్కతే కాదు. ఆ పాప సోదరి. సుష్మా వర్మ కూడా ఏడేళ్లలో 10వ తరగతి పూర్తిచేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో యంగెస్ట్ స్టూడెంట్గా చోటు దక్కించుకుంది. అక్క బాటలోనే చెల్లి పయనం అనేమాదిరి అనన్య కూడా సుష్మా రికార్డును బ్రేక్ చేయడానికి ప్రయత్నిస్తోంది. పిట్ట కొంచెం కూత ఘనం అంటే ఇదేనేమో. ఈ అక్కచెల్లెళ్లు ఇద్దరిదీ ఒకటే స్కూల్ అట.
అనన్యకు అపరిమితమైన జ్ఞానం ఉందని, ఆమె అడ్మిషిన్ను ఎవరూ ప్రశ్నించలేరని జిల్లా పాఠశాలల ఇన్స్పెక్టర్ ఉమేశ్ తిరుపతి చెప్పారు. అనన్య అనర్గళంగా హిందీని మాట్లాడగలుగుతుందని, తొమ్మిదో తరగతి పుస్తకాలను ఎలాంటి ప్రయాస లేకుండా చదివేస్తుందని తిరుపతి పేర్కొన్నారు. అనన్య అద్భుతమైన మేధస్సును చూసి తాము చాలా మురిసిపోయినట్టు లక్నోలోని సెయింట్ మీరా ఇంటర్ కాలేజీకి అప్లియేటెడ్ స్కూల్ ప్రిన్సిపాల్ అనితా రాత్రా తెలిపారు. వెంటనే తొమ్మిదో తరగతిలో అడ్మిషన్ కల్పించినట్టు చెప్పారు.
2011 డిసెంబర్ 1న అనన్య జన్మించింది. తండ్రి తేజ్ బహదూర్ బాబాసాహెబ్ బీమ్రావ్ అంబేద్కర్ యూనివర్సిటీలో అసిస్టెంట్ సూపర్వైజర్(సానిటేషన్). తల్లి చాయా దేవీ కనీసం చదవడం, రాయడం రాని నిరక్షరాస్యురాలు. ఈ ఇద్దరి సోదరుడు శైలేంద్ర కూడా 14ఏళ్లకే బీసీఏ పూర్తిచేశాడు. అనన్య అక్క సుష్మా 7ఏళ్ల వయసులో అంటే 2007లో 10వ తరగతి పూర్తిచేసింది. ప్రస్తుతం బీబీఏయూలో పీహెచ్డీ అడ్మిషన్ పొంది, మైక్రోబయాలజీలో డాక్టరేట్ చదువుతోంది. ఏడాది తొమ్మిది నెలల వయస్సులోనే అనన్య రామయణ, సుందరకాండలను చదవేదని తండ్రి బహదూర్ చెబుతున్నారు. తమ పిల్లలకు దేవుడు అద్భుతమైన మేధస్సు వరంగా ఇచ్చి, తమ కుటుంబానికి ఆశీర్వాదాలు కల్పిస్తున్నాడని హర్షం వ్యక్తం చేస్తున్నారు.