‘ఆప్’కే మెట్రోల ఓటు
ప్రధానిగా మాత్రం మోడీయే మేలని అభిప్రాయం
న్యూఢిల్లీ: పుట్టుకతోనే ఢిల్లీలో సంచలనం సృష్టించిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్).. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ తన ప్రభావం చూపనుందా? అంటే అవుననే అంటున్నారు మెట్రో నగరాల ప్రజలు. లోక్‌సభకు ‘ఆప్’ పోటీ చేస్తే తాము ఆ పార్టీ అభ్యర్థులకే ఓటేస్తామని 44 శాతం మంది మెట్రో ప్రజలు స్పష్టంచేశారు. తాము ‘ఆప్’ నిలబెట్టే అభ్యర్థులను బట్టి ఓటేస్తామని మరో 27 శాతం మంది చెప్పారు. ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, పుణే, అహ్మదాబాద్‌లలో ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ చేయించిన సర్వేలో ఈ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
అయితే ప్రధాన మంత్రి విషయానికి వచ్చేసరికి తాము కేజ్రీవాల్ (25 శాతం) కంటే నరేంద్ర మోడీ(59%)కే ఓటేస్తామని చెబుతున్నారు. ప్రధానిగా రాహుల్ గాంధీకి మద్దతిచ్చేవారు కేవలం 14 శాతం మందే ఉండడం గమనార్హం. కాగా ఈ సర్వే ఫలితాలను పట్టించుకోవలసిన అవసరం లేదని కాంగ్రెస్ కొట్టిపడేసింది. సర్వే వెనుక ఎవరుంటే వారికే అనుకూలంగా ఫలితాలు రావడం మామూలేనని పేర్కొంది. కాగా, లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ 51-100 స్థానాలు గెలుచుకుంటుందని 33 శాతం మంది అభిప్రాయపడ్డారు.