జపాన్లో ఈ రోజు తెల్లవారుజామునా భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్జీఎస్) బుధవారం ఇక్కడ
వెల్లడించింది.భూకంప తీవ్రత రెక్టర్ స్కేల్పై 6.5 మాగ్నిట్యూడ్గా నమోదు అయిందని తెలిపింది. అయితే భూకంపం వల్ల ఎటువంటి అస్తినష్టం కానీ ప్రాణనష్టం కానీ సంభవించిలేదని పేర్కొంది. టోక్యోకు దక్షిణాన గల పసిఫిక్ సముద్రంలో వందల కిలోమీటర్ల దూరంలో ఇది చోటు చేసుకుందని పేర్కొంది. అయితే భూకంప తీవ్రత కొద్దిగా ఎక్కువగా ఉన్న సునామీ లాంటి విపత్కర పరిస్థితులు ఏమి చోటు చేసుకోవని జపాన్ వాతావరణ సంస్థకు చెందిన అధికార ప్రతినిధి ఈ సందర్భంగా పేర్కొన్నారు.
అలాగే భూకంపం వల్ల ఫుకుషిమా అణు ఇంధన సంస్థ ప్లాంట్లో ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదని టోక్యో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ (టీఈపీపీ) తెలిపింది. కానీ ఇటీవల పుకుషిమా ప్లాంట్లోని ట్యాంక్ నుంచి రేడియోధార్మిక నీరు లీకవుతున్న నేపథ్యంలో వాటిని డ్రైయినేజ్ వ్యవస్థ ద్వారా పసిఫిక్ మహాసముద్రంలోకి వదులుతున్నామని ఆ ప్లాంట్ ఉన్నతాధికారులు ఈ సందర్బంగా గుర్తు చేశారు. అయితే భూకంపం వల్ల ఆ ప్లాంట్లో విపత్కర పరిస్థితులు ఏర్పడలేదని చెప్పారు. అయితే భూకంప తీవ్రత వల్ల నగరంలోని పలు భవనాలు కొద్దిగా ఊగాయని జపాన్లోని పాత్రికేయులు వెల్లడించారు.